Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3-0తో వన్డే సిరీస్ భారత్ వశం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : వన్డే సిరీస్‌ను భారత్ అద్భుతంగా ముగించింది. తొలి రెండు వన్డేల్లో వెస్టిండీస్ చివరి వరకు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగా.. చివరి వన్డేలో టీమ్ ఇండియా ఏకపక్ష విజయం నమోదు చేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 36 ఓవర్లలో 225/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (98 నాటౌట్, 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శిఖర్ ధావన్ (58, 74 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. తొలి వికెట్‌కు 113 పరుగులు జోడించిన ధావన్, గిల్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. శ్రేయస్ అయ్యర్ (44, 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి ఫామ్ కొనసాగించాడు. 36 ఓవర్ల అనంతరం వర్షం అంతరాయంతో భారత్ ఇన్నింగ్స్ ఆగిపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో వెస్టిండీస్ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్ధారించారు. భారత బౌలర్ల ధాటికి ఛేదనలో వెస్టిండీస్ చేతులెత్తేసింది. మాయగాడు యుజ్వెంద్ర చాహల్ (4/17), పేసర్లు శార్దుల్ ఠాకూర్ (2/17), మహ్మద్ సిరాజ్ (2/14) నిప్పులు చెరిగారు. 26 ఓవర్లలో 137 పరుగులకే వెస్టిండీస్ కుప్పకూలింది. బ్రాండన్ కింగ్ (42), నికోలస్ పూరన్ (42) పోరాటం ఓటమిని తప్పించలేకపోయింది. భారత్ 119 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. శుభ్‌మన్ గిల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సైతం సొంతం చేసుకున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : 225/3 (శుభ్‌మన్ గిల్ 98, శిఖర్ ధావన్ 58, హెడెన్ వాల్ష్ 2/57, హుస్సేన్ 1/43)
వెస్టిండీస్ ఇన్నింగ్స్ : 137/10 (నికోలస్ పూరన్ 42, బ్రాండన్ కింగ్ 42, చాహల్ 4/17, ఠాకూర్ 2/17)