Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో ఆస్ట్రేలియా మెరుపు విజయం
- హర్మన్‌ప్రీత్, రేణుక మెరుపులు వృథా
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
కామన్వెల్త్ క్రీడల్లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. శుక్రవారం భారత్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో మెరుపు విజయం నమోదు చేసింది. 155 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ నడ్డి విరిచిన టీమ్ ఇండియా ఆ జట్టును 49/5తో ఓటమి కోరల్లోకి నెట్టింది. ఆష్లె గార్డ్నర్ (52 నాటౌట్, 35 బంతుల్లో 9 ఫోర్లు), గ్రేస్ హారీస్ (37, 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత పోరాటంతో ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టారు. భారత బౌలర్ రేణుక సింగ్ (4/18) నాలుగు వికెట్ల ప్రదర్శన వృథా అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (52,34 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్థ సెంచరీతో రాణించింది. గ్రూప్-ఏలో భారత్‌పై మెరుపు విజయంతో ఆస్ట్రేలియా రెండు విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం (జులై 31) పొరుగు దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది.
రేణుక నిప్పులు చెరిగినా..! : ఆస్ట్రేలియా లక్ష్యం 155 పరుగులు. ప్రపంచ శ్రేణి బ్యాటర్లు ఉన్న ఆ జట్టుకు అదేమీ పెద్ద సమస్య కాదు. కానీ భారత పేసర్ రేణుక సింగ్ (4/18) పవర్‌ప్లేలో నిప్పులు చెరిగింది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేసింది. ఓపెనర్ అలీసా హీలే (0), బెత్ మూనీ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (8), తహ్లియ మెక్‌గ్రాత్ (14)లు రేణుక ముందు దాసోహం అయ్యారు. టాప్-4 బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చిన రేణుక సింగ్ ఆస్ట్రేలియాను 49/5తో ఓటమి కోరల్లోకి నెట్టింది. రేచల్ హేన్స్ (9)ను దీప్తి శర్మ వెనక్కి పంపించింది. ఈ కఠిన పరిస్థితుల్లో ఆష్లె గార్డ్నర్ (52 నాటౌట్) గొప్పగా క్రీజులో నిలిచింది. ఆరంభంలో సహచరుల మద్దతు కొరవడిగా.. లోయర్ ఆర్డర్లో విలువైన భాగస్వామ్యులను దొరకబచ్చుకుంది. గ్రేస్ హారీస్ (37) వేగంగా పరుగులు సాధించింది. ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చింది. ఆమె నిష్క్రమించటంతో మళ్లీ మ్యాచ్ భారత్ వైపు మొగ్గగా.. టెయిలెండర్ అలాన కింగ్ (18 నాటౌట్) అదరగొట్టింది. జెస్ జొనాసెన్ (3) నిరాశపరిచినా.. అలానా కింగ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. ఎదురుదాడి చేసిన కింగ్.. మూడు బౌండరీలతో గార్డ్నర్కు చక్కటి సహకారం అందించింది. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 28 బంతుల్లోనే 47 పరుగులు పిండుకున్నారు. మరో ఆరు బంతులు ఉండగానే ఆస్ట్రేలియా గెలుపు గీత అందుకుంది. భారత బౌలర్లలో రాధ యాదవ్, మేఘన సింగ్‌లు దారుణంగా విఫలమయ్యారు.
హర్మన్‌ప్రీత్ అదుర్స్ : టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. పవర్‌ప్లేలో ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఆరు ఓవర్ల అనంతరం భారత్ 35/1తో నిలిచింది. స్మృతీ మంధాన (24, 17 బంతుల్లో 5 ఫోర్లు) ఆరంభం నుంచే ధనాధన్ జోరు చూపించింది. కానీ నాల్గో ఓవర్లోనే మంధాన మెరుపులకు బ్రేక్ పడింది. మరో ఎండ్‌లో నిదానంగా జోరందుకున్న షెఫాలీ వర్మ (48, 33 బంతుల్లో 9 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. యస్టికా భాటియా (8) విఫలమైనా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో (52)తో కలిసి కీలక భాగస్వామ్మం నెలకొల్పింది. ధనాధన్ జోరు చూపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ 31 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలి అర్థ సెంచరీ సాధించిన బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. లోయర్ ఆర్డర్లో ఎవరూ పెద్దగా రాణించలేదు. జెమీమా రొడ్రిగస్ (11), దీప్తి శర్మ (1), హర్లీన్ డియోల్ (7), రాధ యాదవ్ (2) అంచనాలను అందుకోలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ మెరుపులతో భారత్ 154 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్ జెస్ జొనాసెన్ (4/22) నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకుంది.
స్కోరు వివరాలు :
భారత మహిళల ఇన్నింగ్స్ : స్మృతీ మంధాన (సి) హీలే (బి) బ్రౌన్ 24, షెఫాలీ వర్మ (సి) హీలే (బి) జొనాసెన్ 48, యస్టియా భాటియా (రనౌట్) 8, హర్మన్‌ప్రీత్ కౌర్ (బి) స్కట్ 52, జెమీమా రొడ్రిగస్ (సి) మూనీ (బి) జొనాసెన్ 11, దీప్తి శర్మ (సి,బి) జొనాసెన్ 1, హర్లీన్ డియోల్ (సి) మెక్‌గ్రాత్ (బి) జొనాసెన్ 7, రాధ యాదవ్ నాటౌట్ 2, మేఘన సింగ్ (సి) మెక్‌గ్రాత్ (బి) స్కట్ 0, ఎక్స్‌ట్రాలు : 1, మొత్తం :(20 ఓవర్లలో 8 వికెట్లకు) 154.
వికెట్ల పతనం : 1-25, 2-68, 3-93, 4-115, 5-117, 6-140, 7-154, 8-154.
బౌలింగ్ : డార్సీ బ్రౌన్ 3-0-30-1, మేఘన్ స్కట్ 4-0-26-2, అష్లె గార్డ్నర్ 4-0-23-0, అలాన కింగ్ 4-0-36-0, జెస్ జొనాసెన్ 4-0-22-4, తహ్లియ మెక్‌గ్రాత్ 1-0-17-0.
ఆస్ట్రేలియా మహిళల ఇన్నింగ్స్ : అలీసా హీలే (సి) దీప్తి (బి) రేణుక 0, బెత్ మైనీ (బి) రేణుక 10, మెగ్ లానింగ్ (సి) రాధ (బి) రేణుక 8, తహ్లియ మెక్‌గ్రాత్ (బి) రేణుక 14, రేచల్ హేన్స్ (సి) రాధ (బి) దీప్తి 9, ఆష్లె గార్డ్నర్ నాటౌట్ 52, గ్రేస్ హారీస్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) మేఘన 37, జెస్ జొనాసెన్ (సి,బి) దీప్తి 3, అలాన కింగ్ నాటౌట్ 18, ఎక్స్‌ట్రాలు:6, మొత్తం: (19 ఓవర్లలో 7 వికెట్లకు) 157.
వికెట్ల పతనం : 1-0, 2-20, 3-21, 4-34, 5-49, 6-100, 7-110.
బౌలింగ్ : రేణుక సింగ్ 4-0-18-4, మేఘన సింగ్ 4-0-38-1, రాజేశ్వరి గైక్వాడ్ 2-0-24-0, దీప్తి శర్మ 4-0-24-2, రాధ యాదవ్ 4-0-42-0, హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-10-0.