Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో ఏకపక్ష విజయాలు
- ప్రీ క్వార్టర్స్‌లో స్టార్ బాక్సర్ శివ థాప
- 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్ : 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల తొలి రోజు భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. జట్టు, వ్యక్తిగత విభాగాల్లో టీమ్ ఇండియా అథ్లెట్ల జోరు కనిపించింది. హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్‌లో టీమ్ ఇండియా ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. వ్యక్తిగత విభాగంలో స్టార్ బక్సార్ శివ థాప్ పతక వేటను ఘనంగా మొదలెట్టాడు. అద్భుత పంచ్‌తో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.
పాక్‌పై షట్లర్ల దూకుడు : బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు విభాగంలో భారత్ దుమ్మురేపింది. పాకిస్థాన్‌ను 5-0తో చిత్తుగా ఓడించింది. అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్ అలవోక విజయాలు సాధించగా.. అదే బాటలో మిగతా షట్లర్లు నడిచారు. పి.వి సింధు 21-7, 21-6తో చెమట పట్టకుండా మహ్మద్ షెహజాద్‌పై అలవోక విజయం నమోదు చేసింది. మురాద్ అలీపై 21-7, 21-12తో కిదాంబి శ్రీకాంత్ ధనాధన్ గెలుపు సాధించాడు. మెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 21-12, 21-9తో మురాద్ అలీ, మహ్మద్ ఇర్ఫాన్‌లపై వరుస గేముల్లో గెలుపొందారు. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి, అశ్విని పొన్నప్ప జంట 21-9, 21-12తో మహ్మద్ ఇర్ఫాన్, గజాల సిద్దిఖీపై విజయం సాధించారు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రిష జొలీ జోడీ 21-4, 21-5తో షెహజాద్, గజాలపై ఏకపక్ష విజయం నమోదు చేశారు. 5-0తో పాకిస్థాన్‌పై ఎదురులేని విజయం సాధించిన టీమ్ ఇండియా. గ్రూప్-ఏలో నేడు శ్రీలంకతో పోటీపడనుంది.
టేబుల్ టెన్నిస్‌లో హవా : టేబుల్ టెన్నిస్‌లో మహిళల జట్టు బ్యాక్ టు బ్యాక్ విజయాలు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాపై, ఫిజిపై వరుసగా 3-0తో ఏకపక్ష విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికాపై డబుల్స్ మ్యాచ్‌లో ఆకుల శ్రీజ, టెన్నిసన్ 11-7, 11-7, 11-5తో వరుస సెట్లలో విజయం సాధించారు. తొలి సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ మనిక బత్ర 11-5, 11-3, 11-2తో ముష్ఫీక్ కలెంపై అలవోక విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో ఆకుల శ్రీజ 11-5, 11-3, 11-6తో డానిషా పటేల్‌ను చిత్తు చేసింది. తొలి రోజే దక్షిణాఫ్రికా, ఫిజిలపై వరుస విజయాలు సాధించిన భారత మహిళల జట్టు గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు పురుషుల జట్టు పసికూన బార్బడోస్పై 3-0తో గెలుపొందింది.
హాకీలోనూ అదుర్స్ : భారత మహిళల హాకీ జట్టు బోణీ కొట్టింది. పూల్-ఏలో ఘనాపై ఘన విజయం సాధించింది. ప్రతి క్వార్టర్లోనూ గోల్స్ కొట్టిన టీమ్ ఇండియా అమ్మాయిలు 5-0తో భారీ విజయం నమోదు చేశారు. ఘనా జట్టు భారత్‌కు ఎటువంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (2), సంగీత కుమారి (1), సలీమ (1), నేహా (1)లో గోల్స్ నమోదు చేశారు. తొలి, రెండో, నాల్గో క్వార్టర్లో ఒక్కో గోల్ కొట్టిన భారత్.. మూడో క్వార్టర్లో రెండు గోల్స్‌తో విరుచుకుపడింది. నేడు జరిగే మ్యాచ్‌లో వేల్స్‌తో భారత తలపడనుంది.
శివ సూపర్ పంచ్ : స్టార్ బాక్సర్ శివ థాప సూపర్ పంచ్ విసిరాడు. పురుషుల 63.5 కేజీల విభాగంలో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. పాకిస్థాన్ బక్సార్ బాలోచ్ సులేమాన్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన శివ థాప.. ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ విజేతగా అవతరించాడు. సులేమాన్‌పై 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసి ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపాడు.