Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓపెన్, మహిళల విభాగంలో భారత్ జోరు
- 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు
చెన్నై : 44వ చెస్ ఒలింపియాడ్ పోటీల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆరంభించింది. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ పోటీల తొలి రోజు భారత జట్లు విజయంతో మొదలెట్టాయి. ఓపెన్ విభాగంలో భారత ప్రధాన జట్టు తజకిస్థాన్పై విజయం సాధించగా.. భారత్-బి, సి జట్లు సైతం అదే బాటలో నడిచాయి. ప్రధాన జట్టులో విదిత్ గుజరాతీ మెయిన్ బోర్డుపై ఆడి తజకిస్థాన్ ప్లేయర్ రాడ్వెల్పై విజయం సాధించాడు. అర్జున్, ఎస్ఎల్ నారాయణన్, శశికిరణ్ కృష్ణన్లు సైతం విజయాలు నమోదు చేశారు. తజకిస్థాన్పై భారత్ 4-0తో విజయం సాధించింది. భారత-బి జట్టు తరఫున గుఖేశ్, నిహాల్ శరిన్, ఆదిబన్, రౌనక్లు యుఏఈపై పట్టు సాధించారు. అందరూ విజయాలు నమోదు చేయటంతో యుఏఈపై భారత్-బి 4-0తో గెలుపొందింది. భారత-సి జట్టు దక్షిణ సుడాన్పై విజయం సాధించింది. సేతురామన్, అభిజిత్ గుప్త, కార్తీకేయన్ మురళి, అభిమన్యు పురానిక్లు దక్షిణ సుడాన్ ఎత్తులకు పై ఎత్తులు వేసి విజయాలు నమోదు చేశారు. ఇక మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ కోనేరు హంపీ, తానియా సచ్దేవ్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు. కానీ మంచి ఎత్తులతో పుంజుకుని విజయాలు సాధించారు. మహిళల విభాగంలో తజకిస్థాన్పై భారత్ 4-0తో గెలుపొందింది. కోనేరు హంపీ ప్రధాన బోర్డుపై గెలుపొందింది. వైశాళి, తానియ సచ్దేవ్, భక్తి కులకర్ణిలు రాణించారు. 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలను భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనందం, ఫెడె అధ్యక్షుడు, భారత చెస్ సమాఖ్య అధ్యక్షుడు తొలి ఎత్తులతో ఆరంభించారు.