Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు కొండ మీరాబాయి చాను భారత్‌లో పసిడి వెలుగులు నింపింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన మీరాబాయి చాను.. కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు బరువు ఎత్తింది. మహిళల 49 కేజీల విభాగంలో 201 కేజీల బరువు అలవోకగా ఎత్తిపడేసింది. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించింది. మరో ఇద్దరు వెయిట్‌లిఫ్టర్లు సంకెత్ మహాదేవ్ సర్గార్, గురురాజ పుజారిలు వరుసగా రజత, కాంస్య పతకాలతో అదరగొట్టారు. కామన్వెల్త్ క్రీడల రెండో రోజు వెయిట్‌లిఫ్టర్లు మూడు పతకాలు సాధించారు.
- మీరాబాయి చానుకు పసిడి పతకం
- సంకెత్కు రతజం, గురురాజకు కాంస్యం
- పతకాల పంట పండించిన వెయిట్‌లిఫ్టర్లు
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చాను అదరగొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌తో భారత బృందంలో కొండంత ఆత్మవిశ్వాసం నింపిన మీరాబాయి చాను.. తాజాగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భలే ప్రదర్శన చేసింది. మహిళల 48 కేజీల విభాగంలో ఎదురులేని ప్రదర్శన చేసిన మీరాబాయి చాను గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పసిడి పతకాన్ని నిలుపుకుంది. తొలుత స్నాచ్ విభాగంలో 84 కేజీలు అలవోకగా ఎత్తిన చాను.. 88 కేజీలను ఎత్తిపడేసి కామన్వెల్త్ క్రీడల రికార్డు నెలకొల్పింది. ఇక క్లీన్ అండ్ జెర్క్‌లోనూ చాను జోరు కొనసాగింది. 109 కేజీల బరువు ఎత్తి పసిడి పతకం ఖాయం చేసుకున్న చాను.. అక్కడితో ఆగలేదు. రికార్డును మరింత మెరుగుపర్చుకునేందుకు 113 కేజీలను సులువుగా ఎత్తింది. ఓవరాల్‌గా 201 కేజీల బరువు ఎత్తిన మీరాబాయి చాను పసిడి పతకం కొల్లగొట్టింది. రెండో స్థానంలో నిలిచిన వెయిట్‌లిఫ్టర్ కంటే మీరాబాయి ఏకంగా 29 కేజీలు ముందంజలో నిలిచింది. మారిషస్ వెయిట్‌లిఫ్టర్ మారీ హనిత్ర 172 కేజీలతో రజత పతకం సాధించగా, కెనడా వెయిట్‌లిఫ్టర్ హన్నా కామినిష్కి 171 కేజీలతో కాంస్య పతకం సాధించింది. వరుసగా మూడో కామన్వెల్త్ క్రీడల్లో మీరాకు ఇది మూడో పతకం. కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఓ సిల్వర్‌తో మీరాబాయి చాను ఘనమైన రికార్డును నెలకొల్పింది.
ఔరా.. సంకెత్! : బర్మింగ్‌హామ్, జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్. అందరూ ఏం జరుగుతుందా? అనే ఆందోళనలో ఉన్నారు!. నొప్పితో విలవిల్లాడిన భారత వెయిట్‌లిఫ్టర్ సంకెత్ మహాదేవ్ సర్గార్ బార్బెల్ను కిందపడేశాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రికార్డు 139 కేజీలు ఎత్తేందుకు ప్రయత్నించిన సంకెత్ భారత్‌కు పసిడి పతకం గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నించాడు. స్నాచ్ విభాగంలో 113 కేజీల బరువు ఎత్తిన సంకెత్.. పసిడి పతకం సాధించిన మలేషియా వెయిట్‌లిఫ్టర్ మహ్మద్ అనిక్ బిన్ కాస్డన్ కంటే ఆరు కేజీలు అధిక బరువును ఎత్తాడు. కానీ, నొప్పితో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 139 కేజీలు ఎత్తటంలో విఫలప్రయత్నం చేసిన సంకెత్ మహాదేవ్.. ఒక్క కేజీ బరువు తేడాతో పసిడి పతకం చేజార్చుకున్నాడు. గాయంతో ఇబ్బందిపడుతున్నా.. మళ్లీ ప్రయత్నం చేసిన సంకెత్ క్రీడాభిమానుల హృదయాలను గెల్చుకున్నాడు. 248 కేజీల బరువు ఎత్తిన సంకెత్ మహాదేవ్ రజతం పతకం సాధించగా.. 249 కేజీల బరువు ఎత్తిన మహ్మద్ అనిక్ (మలేషియా) బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 225 కేజీల బరువు ఎత్తిన శ్రీలంక వెయిట్ లిఫ్టర్ కుమార కాంస్య పతకం సాధించాడు. సంకెత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించాడు. పురుషుల 55 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ పసిడి రేసులో ముందంజలో నిలిచాడు. స్నాచ్ విభాగంలో సంకెత్ మహాదేవ్ ఏకంగా 113 కేజీల బరువు అలవోకగా ఎత్తాడు. మలేషియా వెయిట్‌లిఫ్టర్ స్నాచ్‌లో 107 కేజీల బరువు మాత్రమే ఎత్తగలిగాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో ఏకంగా 142 కేజీల బరువు ఎత్తిన మలేషియా వెయిట్‌లిఫ్టర్ స్నాచ్ లోటును భర్తీ చేసుకున్నాడు. కంటనీరు చెక్కిళ్లపై జాలువారుతుండగా..కుడి చేతిని రజత పతకంపై వేసి మెడల్ పోడియంపై నిల్చుకున్న సంకేత్ భావోద్వేగంతో కనిపించాడు. సంగ్లీకి చెందిన సంకేత్ ఈ ప్రాంతం నుంచి కామన్వెల్త్ మెడల్ సాధించిన రెండో వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచాడు. 1970 ఎడిన్బర్గ్ గేమ్స్‌లో మారుతి మానె సిల్వర్ మెడల్ సాధించాడు.
'క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 139 కేజీల బరువు ఎత్తటంలో ఎటువంటి పొరపాటు చేయలేదు. కానీ కుడి భుజంపై మొత్తం బరువు పడినట్టు అనిపించింది. నేను ఆ బరువును నియంత్రణ చేయలేకపోయాను. భుజంలో ఏదో క్లిక్‌మనిపించింది. అయినా, నేను బరువు ఎత్తాలనే ఆలోచనలోనే ఉన్నాను. ఎందుకంటే నా లక్ష్యం బంగారు పతకం. గత నాలుగేండ్లుగా పసిడి పతకం కోసమే కఠోరంగా శ్రమించాను. రెండో ప్రయత్నంలో బరువు ఎత్తేందుకు తొలుత కోచ్ విముఖత చూపారు. కానీ, నేను సాధించగలనని భరోసా ఇచ్చి వెన్నుతట్టాడు' అని సిల్వర్ మెడల్ సాధించిన అనంతరం సంకెత్ మహాదేవ్ సర్గార్ భావోద్వేగంగా తెలిపాడు.
గురురాజకు కాంస్యం : బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు రెండో పతకం సైతం వెయిట్‌లిఫ్టింగ్ నుంచే వచ్చింది. పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ కాంస్య పతకం సాధించాడు. భారత్ ఖాతాలో మరో మెడల్ జోడించాడు. గురురాజకు కామన్వెల్త్ క్రీడల్లో ఇది రెండో పతకం కావటం విశేషం. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో గురురాజ పుజారి సిల్వర్ మెడల్ సాధించాడు. స్నాచ్ విభాగంలో 118 కేజీలు ఎత్తిన గురురాజ.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 151 కేజీలు ఎత్తాడు. ఓవరాల్‌గా 269 కేజీల బరువు ఎత్తిన గురురాజ మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. న్యూ గునియా వెయిట్‌లిఫ్టర్ మోరియ బారు 293 కేజీలతో రజతం, మలేషియా వెయిట్‌లిఫ్టర్ మహ్మద్ బిన్ కామన్వెల్త్ క్రీడల రికార్డు 285 కేజీలతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ' పది రోజుల ముందు వరకు నేను అత్యుత్తమ దశలో లేను. గత వారమే శిక్షణ ప్రారంభించాను. మెడల్ రేసులో ఉత్తమ ప్రదర్శన చేశాను. కాంస్య పతక ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. 61 కేజీల విభాగం, ఒలింపిక్ కేటగిరి. ఈ విభాగంలో మిగిలిన విజేతలు ఒలింపిక్ పతక విజేతలు. ప్రాక్టీస్‌లో స్నాచ్‌లో 119, క్లీన్ అండ్ జెర్క్‌లో 152 కేజీల బరువు ఎత్తాను' అని గురురాజ పుజారి తెలిపాడు.