Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారంతం, మధ్యాహ్నా సమయం. దక్షిణ మహారాష్ట్రలోని సంగ్లీ టౌన్ హోల్కర్ రోడ్లో పెద్ద జనాలు ఉండరు. కానీ శనివారం మధ్యాహ్నాం సంకెత్ పాన్ డబ్బా చుట్టూ గుమికూడిన జనం టీవీలో సంకేత్ మహాదేవ్ సర్గార్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి కోసం పోటీపడుతున్న దృశ్యాలను ఉత్కంఠగా చూస్తున్నారు. ఆ షాపు ముందు మీడియా సైతం ఉంది. ఎందుకంటే, కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన సంకెత్ మహాదేవ్ సర్గార్ ఆ పాన్ షాప్‌లో పనిచేసిన వాడే!. జీవనోపాధి కోసం కిల్లీలు కట్టిన 21 ఏండ్ల సంకెత్ మహాదేవ్ ఇప్పుడు కామన్వెల్త్ హీరోగా దేశం ముందు నిలిచాడు.
1990లో సంకెత్ మహాదేవ్ కుటుంబం గ్రామీణ ప్రాంతం నుంచి వలస వచ్చి సంగ్లీలో స్థిరపడింది. మొదట్లో తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే సంకెత్ కుటుంబం.. ఆ తర్వాత కిల్లీ కొట్టు ఆరంభించింది. చిన్నగా ఆ కిల్లీ కొట్టు పక్కన టీ స్టాల్, టిఫిన్ సెంటర్ తోడయ్యాయి. నాలుగేండ్ల కిందట ప్రొఫెషనల్ వెయిట్‌లిఫ్టర్‌గా మారాలని దృఢ నిర్ణయం తీసుకున్న సంకెత్.. ఓ వైపు కఠోర శిక్షణ కొనసాగిస్తూనే మరో వైపు పాన్ షాప్‌లో కిల్లీలు కట్టేవాడు. '2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడలు. గురురాజ పుజారి వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం సాధించాడు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నేనూ వెయిట్ లిఫ్టర్‌గా మెడల్ సాధించాలని. తర్వాతి కామన్వెల్త్‌లోనే పతకం సాధించాలని గట్టిగా అనుకున్నాను. నాన్నకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. తొలుత నన్ను స్థానికంగా ఉండే ఓ జిమ్‌లో చేర్పించాడు. ఎటువంటి శిక్షణ లేకుండానే జిల్లా స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించటంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. నా కల సాకారం చేసుకునేందుకు కఠోరంగా సాధన చేశాను. నాన్న ఎంతగానో ప్రోత్సహించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. నాకు అవసరమైన ప్రోటీన్ పౌడర్ ఇతర అవసరాలకు అప్పు చేసి మరీ సమయానికి అందించేవారు. 2018 కల.. 2022లో సాకారమైంది. నేను జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టర్‌గా కొనసాగుతూ కిల్లీ కొట్టులో పని చేయటంపై కొందరు ఎగతాళి చేస్తారు. కానీ ఇది నా జీవితంలో భాగం. గతంలో అందరూ సంకెత్ కిల్లీ కొట్టు అనేవారు.. ఇక నుంచి కామన్వెల్త్ గేమ్స్ మెడలిస్ట్ సంకెత్ కిల్లీ కొట్టుగా గుర్తుపెట్టుకుంటారని' అని సంకెత్ మహాదేవ్ అన్నాడు.