Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో మంధాన ధనాధన్ షో
బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో తొలి మ్యాచ్‌లో భంగపడిన టీమ్ ఇండియా.. రెండో మ్యాచ్‌లో పొరుగు దేశం ఏకపక్ష విజయం నమోదు చేసింది. బౌలర్లు సమిష్టిగా విజృంభించటంతో తొలుత పాకిస్థాన్ అమ్మయిలను 99 పరుగులకే కుప్పకూల్చిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని 11.4 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. పాకిస్థాన్‌పై విజయంతో భారత్ విలువైన రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తొలి మ్యాచ్‌లో బార్బడోస్ చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు కామన్వెల్త్లో ఇది వరుసగా రెండో పరాజయం. గ్రూప్-ఏలో భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో బార్బడోస్‌తో ఆగస్టు 3న తలపడనుంది.
ఛేదనలో స్మృతీ మంధాన (63 నాటౌట్, 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 31 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన మంధాన.. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడింది. మంధాన విశ్వరూపంతో పాక్ బౌలర్లు చేష్టలుడిగారు. యువ ఓపెనర్ షెఫాలీ వర్మ (16, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)) తొలి వికెట్‌కు 61 పరుగుల దూకుడు భాగస్వామ్యం నెలకొల్పింది. మంధాన షో నడిచిన ఛేదనలో తెలుగు తేజం సబ్బినేని మేఘన (14, 16 బంతుల్లో 2 ఫోర్లు), జెమీమా రొడ్రిగస్ (2 నాటౌట్) రాణించారు. మరో 38 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు 99 పరుగులకు (18 ఓవర్ల మ్యాచ్) కుప్పకూలారు. ఓపెనర్ మునీబ అలీ (32, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), అలియా రియాజ్ (18, 22 బంతుల్లో 2 ఫోర్లు), బిష్మా మారూఫ్ (17, 19 బంతుల్లో) మినహా ఎవరూ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో స్నేV్‌ా రానా (2/15), రాధ యాదవ్ (2/18) రెండేసి వికెట్లతో మెరువగా.. షెఫాలీ వర్మ, రేణుక సింగ్, మేఘన సింగ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.