Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామన్వెల్త్ క్రీడల్లో మన వెయిట్‌లిఫ్టర్ల ఖతర్నాక్ షో కొనసాగుతోంది. జెరెమీ లాల్రిన్నుగ అద్వితీయ బల ప్రదర్శనతో బర్మింగ్‌హామ్‌లో భారత్ రెండో పసిడి పతకం సొంతం చేసుకుంది. రెండు రికార్డులు బద్దలు కొట్టిన జెరెమీ 300 కేజీల బరువు సులువుగా ఎత్తిపడేసింది. కామన్వెల్త్ క్రీడల అరంగేట్రంలోనే బంగారు పతకం ముద్దాడింది. వెయిట్‌లిఫ్టర్ బింద్యా రాణి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ల జోరుతో భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకుంది.
- రికార్డు బద్దలు కొడుతూ పసిడి కైవసం
- బింద్యారాణి దేవికి రజత పతకం
- వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతక జోరు
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
2022, మే 4. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల పతకాల ఆవిష్కరణ జరిగిన రోజు. నిత్యం తన శరీరంపై కొత్త టాటూలు, స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన ఫోటోలను స్మార్ట్‌ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకునే ఓ 19 ఏండ్ల కుర్రాడు.. ఆ రోజు అవన్నీ తీసేశాడు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల పసిడి పతకం సోషల్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం కొట్టేందుకు అతడికి ప్రేరణ, స్ఫూర్తి ఆ ఫోన్ వాల్‌పేపర్‌పై ఉన్న బంగారు పతకమే. ఉదయం లేవగానే లక్ష్యం పసిడి పతకం అని గుర్తు రావాలి, రాత్రి పడుకునే ముందు లక్ష్యం పసిడి పతకమని గుర్తుండాలి. జులై 31, 2022. ఆ కుర్రాడి లక్ష్యం నెరవేరింది. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి అతడి పాదాక్రాంతమైంది!. అతడే 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్, వర్థమాన వెయిట్‌లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుగ. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రిన్నుగ కామన్వెల్త్ క్రీడల రికార్డు బద్దలు కొట్టాడు. ఆదివారం జరిగిన మెడల్ రేసులో ఏకంగా 300 కేజీల బరువు ఎత్తిపడేశాడు. బంగారు పతకం అందుకుని, స్వప్నం సాకారం చేసుకున్నాడు. జెరెమీ లాల్రిన్నుగ పసిడితో కామన్వెల్త్లో భారత బంగారు పతకాల సంఖ్యకు రెండుకు చేరుకుంది. ఇక మహిళల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకంతో మెరిసింది. కామన్వెల్త్ పోటీల మూడో రోజు భారత్ రెండు పతకాలు సొంతం చేసుకుంది.
జెరెమీ అదుర్స్ : పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రిన్నుగ అదరగొట్టాడు. జెరెమీ వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శన 306 కేజీలు. 2018 యూత్ ఒలింపిక్స్‌లో పసిడి ప్రదర్శనతో అందరి దృష్టిలో పడిని జెరెమీ.. ఆ తర్వాత గాయాలతో ఫామ్ కోల్పోయాడు. 2021 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో నిరాశపరిచాడు. దీంతో జెరెమీ పసిడి వేటపై పెద్దగా అంచనాలు లేవు. ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. కసితో బరువులు ఎత్తిన జెరెమీ లాల్రిన్నుగ బంగారు పతకంతో ఔరా అనిపించాడు. తొలుత స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలోనే 136 కేజీల బరువును ఎత్తాడు. తన సమీప ప్రత్యర్థి లిఫ్టర్ ఆరు కేజీల ముందంజలో నిలిచాడు. రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తిపడేసిన జెరెమీ కామన్వెల్త్ క్రీడల రికార్డును బద్దలుకొట్టాడు. మూడో ప్రయత్నంలో వ్యక్తిగత రికార్డు (141 కేజీలు) అధిగమించేందుకు 143 కేజీలు ప్రయత్నించిన జెరెమీ.. విఫలమయ్యాడు. స్నాచ్ రౌండ్ ముగిసే సరికి రెండో స్థానంలో నిలిచిన నైజీరియా లిఫ్టర్ కంటే 10 కేజీల స్పష్టమైన ముందంజలో నిలిచాడు జెరెమీ. క్లీన్ అండ్ జెర్క్‌లోనూ 19 ఏండ్ల జెరెమీ జోరు కొనసాగింది. తొలి ప్రయత్నంలో 154 కేజీల బరువు ఎత్తాడు. తొలి ప్రయత్నం సందర్భంగానే జెరెమీ వెన్నునొప్పితో బాధపడినట్టు కనిపించింది. నొప్పిని అధిగమించిన జెరెమీ రెండో ప్రయత్నంలో 160 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 165 కేజీల బరువు ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఓవరాల్‌గా 300 కేజీలు బరువు ఎత్తిన జెరెమీ కామన్వెల్త్ క్రీడల్లో కెరీర్ తొలి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. సమోమ వెయిట్‌లిఫ్టర్ లోయనె, నైజీరియా వెయిట్‌లిఫ్టర్ ఉమోఫియలు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
బింద్యారాణి దేవి సిల్వర్ షో : మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం సొంతం చేసుకుంది. ఈ విభాగంలో ఓవరాల్‌గా 202 కేజీల బరువు ఎత్తిన బింద్యారాణి సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. స్నాచ్ విభాగంలో 86 కేజీలు ఎత్తిన బింద్యారాణి దేవి.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 116 కేజీల బరువు ఎత్తింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మూడో ప్రయత్నానికి ముందు మెడల్ రేసులో మూడో స్థానంలో నిలిచిన బింద్యారాణి దేవి.. చివరి ప్రయత్నంలో 116 కేజీలు ఎత్తి రెండో స్థానానికి దూసుకొచ్చింది. నైజీరియా వెయిట్‌లిఫ్టర్ ఒలరినియె 203 కేజీలతో పసిడి పతకం సొంతం చేసుకుంది.