Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల జట్టుకు చారిత్రక పసిడి
- టేబుల్ టెన్నిస్ మెన్స్ జట్టుకు స్వర్ణం
- వెయిట్‌లిఫ్టర్ వికాశ్ ఠాకూర్ రజతం
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు
లాన్ బౌల్స్. భారత్‌లో పెద్దగా పరిచయం లేని ఆట. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రక పసిడితో లాన్ బౌన్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది!. లాన్ బౌల్స్ ఫోర్స్ మహిళల జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్లో మూడోసారి (2014, 2018) పోటీపడిన భారత్.. అద్భుత ఆటతీరుతో బంగారు పతకం కొల్లగొట్టింది. టేబుల్ టెన్నిస్ మెన్స్ జట్టు మరో పసిడి పతకం సాధించగా.. వెయిట్ లిఫ్టంగ్లో వికాశ్ ఠాకూర్ భారత్ ఖాతాలో మరో మెడల్ జోడించాడు.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
కామన్వెల్త్ క్రీడల్లో టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. తొలి నాలుగు రోజు పోటీల్లో వెయిట్ లిఫ్టర్లు బంగారు పతకాలు అందించగా.. ఐదో రోజు ఆటలో చారిత్రక స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు బర్మింగ్‌హామ్‌లో అదిరిపోయే విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. పసిడి పోరులో 17-10తో ఘన విజయం సాధించింది. లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియ, రూప రాణి టర్కీలు కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. టేబుల్ టెన్నిస్ మెన్స్ జట్టు ఫైనల్లో సింగపూర్‌ను 3-1తో చిత్తు చేసి పసిడి పతకం సొంతం చేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మెన్స్ 96 కేజీల విభాగంలో వికాశ్ ఠాకూర్ 346 కేజీల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
అమ్మాయిలు అదరహో..! : కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఎటువంటి అంచనాలు లేని ఆట లాన్ బౌల్స్. నిజానికి ఈ ఆట ఎలా ఆడతారో సైతం పెద్దగా ఎవరికీ తెలియదు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో పరాజయంతో లాన్ బౌన్స్‌లో మళ్లీ నిరాశ తప్పదేమో అనిపించింది. కానీ వరుస మ్యాచుల్లో అద్వితీయ ప్రదర్శన చేసిన అమ్మాయిలు ఫైనల్లోనూ అదరగొట్టారు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ చేతిలో 9-18తో దారుణ పరాజయం చవిచూసినా.. ఆ తర్వాతి మ్యాచుల్లో కుక్ ఐలాండ్‌పై 15-9, కెనడాపై 17-7తో భారీ విజయాలు నమోదు చేసి నాకౌట్ దశకు చేరుకుంది. కీలక క్వార్టర్ఫైనల్లో నార్ఫోక్ ఐలాండ్‌ను 19-7తో చిత్తుగా ఓడించారు. సెమీఫైనల్లో అగ్రజట్టు న్యూజిలాండ్‌ను 16-13తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడించారు. కివీస్‌పై విజయంతోనే చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. ఆ జోరును పసిడి పోరులోనూ చూపించారు. దక్షిణాఫ్రికా ఫైనల్లో తొలుత భారత్ ఆధిపత్యం చెలాయించింది. 8-2తో తిరుగులేని స్థానంలో నిలిచింది. కానీ సఫారీ అమ్మాయిలు పట్టు విడువలేదు. వేగంగా పుంజుకుని 8-8తో స్కోరు సమం చేశారు. 12 ఎండ్స్ అనంతరం భారత్, దక్షిణాఫ్రికా 10-10తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఇక్కడే భారత్ ఓ అడుగు ముందుకేసింది. కీలక సమయంలో ఆధిక్యంలోకి వెళ్లింది. 13వ ఎండ్‌లో రెండు పాయింట్ల ఆధిక్యం సొంతం చేసుకుంది. 14 ఎండ్‌లో ఆధిక్యం 15-10కు చేరుకుంది. అదే జోరులో 17-10తో అదిరిపోయే ముగింపునిచ్చారు.
ప్యాడర్ల పసిడి జోరు : టేబుల్ టెన్నిస్‌లో పురుషుల జట్టు సూపర్ ప్రదర్శన చేసింది. పసిడి పోరులో అగ్రజట్టు సింగపూర్‌ను చిత్తు చేసింది. 3-1తో ఘన విజయం సాధించిన భారత్ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో భారత్ పసిడి ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ వెటరన్ ప్యాడ్లర్ అచంట శరత్ కమల్ తొలి సింగిల్స్‌లో నిరాశపరిచాడు. 7-11, 14-12, 3-11, 9-11తో పరాజయం పాలయ్యాడు. హర్మీత్, సతియన్లు కఠిన మ్యాచుల్లో గొప్ప ప్రదర్శన చేశారు. జి. సతియన్ 12-10, 7-11, 11-7, 11-4తో గెలుపొందాడు. హర్మీత్ 11-8, 11-5, 11-6తో మూడో సింగిల్స్ మ్యాచ్‌లో మెరుపు విజయంతో భారత్‌కు పసిడి విజయాన్ని కట్టబెట్టాడు. అంతకముందు డబుల్స్ మ్యాచ్‌లో హర్మీత్, సతియన్లు భారత్‌కు గెలుపు ఆరంభాన్ని అందించారు.
రజత వికాసం : వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మరో మెడల్ కైవసం చేసుకుంది. వెయిట్‌లిఫ్టర్ వికాశ్ ఠాకూర్ కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల 96 కేజీల విభాగంలో వికాశ్ ఠాకూర్ ఏకంగా 346 కేజీలు ఎత్తిపడేశాడు. స్నాచ్ విభాగంలో 155 కేజీల బరువు ఎత్తిన వికాశ్.. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 191 కేజీల బరువు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో మూడో ప్రయత్నంలో 198 కేజీల బరువు ఎత్తేందుకు విఫల ప్రయత్నం చేసిన వికాశ్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. డాన్ ఒపెలెజ్ 381 కేజీల రికార్డుతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.