Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామన్వెల్త్ క్రీడల ఏడో రోజు పోటీల్లో భారత్ పతక జోరు కాస్త నెమ్మదించింది!. పసిడిపై కన్నేసిన భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు అంతిమ పోరులో తడబడింది. స్టార్ షట్లర్ సింధు మెరిసినా.. సహచర షట్లర్లు నిరాశపరచటంతో భారత్ రజత పతకంతో సరిపెట్టుకుంది. వెయిట్‌లిఫ్టింగ్ భారత్‌కు మరో పతకం అందించింది. లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య ప్రదర్శనతో మెరిశాడు.
- బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజతం
- లవ్‌ప్రీత్ సింగ్‌కు కాంస్య పతకం
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
బ్యాడ్మింటన్ పవర్‌హౌస్ మలేషియా మెడలు వంచి.. కామన్వెల్త్ క్రీడల పసిడి పతకం సొంతం చేసుకునే ఆలోచనలతో ఉన్న టీమ్ ఇండియా.. పసిడి పోరులో అంచనాలను అందుకోలేదు. రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షట్లర్ పి.వి సింధు మినహా మరో షట్లర్ ఫైనల్లో రాణించలేదు. మిక్స్డ్ జట్టు విభాగం ఫైనల్లో మలేషియాకు 1-3తో పసిడి కోల్పోయిన టీమ్ ఇండియా సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. నాలుగేండ్ల కిందట గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ జట్టు విభాగంలోనే స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. బర్మింగ్‌హామ్‌లో అంచనాలను అందుకోలేదు. ఈ ఏడాది భారత మెన్స్ జట్టు థామస్ కప్ విజయాన్ని సైతం అందుకోవటంతో.. కామన్వెల్త్లో పసిడి పక్కా అనిపించింది. కానీ, తుది పోరులో కిదాంబి శ్రీకాంత్ సహా సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు నిరాశపరిచారు. ఫలితంగా, నాలుగు మ్యాచుల్లో మూడింట పరాజయం పాలైన భారత్ పసిడి పతకాన్ని చేజార్చుకుంది.
బ్యాడ్మింటన్‌లో రజతం : బ్యాడ్మింటన్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. గోల్డ్‌కోస్ట్ ప్రదర్శనను పునరావతంపై భారీ అంచనాలుండగా.. షట్లర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు!. మంగళవారం అర్ధరాత్రి జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. నాలుగేండ్ల క్రితం గోల్డ్‌కోస్ట్ పరాజయానికి మలేషియా ప్రతీకారం తీర్చుకుంది. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టిలు 18-21, 15-21తో మలేషియా జోడీ టెంగ్ఫాంగ్ ఆరోన్, వుయి యిక్ సోక్ చేతిలో ఓటమిచెందారు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు 22-20, 21-17తో గోV్‌ా జిన్ వీపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశపరిచాడు. 19-21, 21-6, 16-21తో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. మహిళల డబుల్స్‌లో 21-18, 21-17తో గాయత్రి గోపీచంద్, త్రిసా జోడీ చేతులెత్తేయగా మలేషియా 3-1తో పసిడి సొంతం చేసుకుంది.
లవ్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం : వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ పతకాల పంట కొనసాగుతోంది. భారత్‌కు ఈ క్రీడాంశంలోనే అత్యధిక మెడల్స్ దక్కగా.. ఏడో రోజు సైతం ఆ జోరు కనిపించింది. పురుషుల 109 కేజీల విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. 355 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. స్నాచ్ విభాగంలో తొలుత 157 కేజీలు ఎత్తిపడేసిన లవ్‌ప్రీత్.. వరుసగా 161 కేజీలు, 163 కేజీలు అలవోకగా ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలుత 185 కేజీలు.. ఆ తర్వాత 189 కేజీలు, చివరి ప్రయత్నంలో 192 కేజీలు ఎత్తి ఔరా అనిపించాడు. 361 కేజీల ప్రదర్శనతో కామెరూన్ వెయిట్‌లిఫ్టర్ స్వర్ణం సాధించగా, 358 కేజీల బరువు ఎత్తి సమోయ వెయిట్‌లిఫ్టర్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు.
హాకీలో టాప్ లేపారు! : గ్రూప్-బిలో భారత హాకీ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం కెనడాను చిత్తు చేసిన భారత్ నాకౌట్ బెర్త్‌ను లాంఛనం చేసుకుంది. హర్మన్‌ప్రీత్, అకాశ్‌దీప్ సింగ్‌లు రెండేసి గోల్స్ కొట్టగా.. గుర్జంత్, మన్దీప్, అమిత్, లలిత్‌లు గోల్స్ జోరులో భాగం కావటంతో భారత్ 8-0తో ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో నేడు వేల్స్‌తో తలపడనుంది.
హుస్సాముద్దీన్ పతక పంచ్! : తెలంగాణ స్టార్ బాక్సర్, నిజామాబాద్ వాసి మహ్మద్ హుస్సాముద్దీన్ పతక పంచ్ విసిరాడు. మెన్స్ 54 కేజీల విభాగంలో హుస్సాముద్దీన్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో నమీబియా బాక్సర్‌పై 4-1తో గెలుపొందిన హుస్సాముద్దీన్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. మహిళల 48 కేజీల విభాగంలో నీతూ ఏకపక్ష విజయంతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది.