Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాంగ్‌జంప్‌లో శ్రీశంకర్‌కు సిల్వర్ మెడల్
- ఫౌల్‌తో స్వర్ణం చేజార్చుకున్న మన మురళీ
- బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు 2022
కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. లాంగ్‌జంప్ విభాగంలో భారత్‌కు అత్యుత్తమ మెడల్ సాధించిపెట్టాడు. భారత దిగ్గజ లాంగ్‌జంపర్లు సురేశ్ బాబు (1978, కాంస్యం), అంజు బాబి జార్జ్ (2002, కాంస్యం), ఎంఏ ప్రజూశ (2010, సిల్వర్) జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో తొలి ప్రయత్నంలోనే మురళీ శ్రీశంకర్ రజత పతకం ఎగరేసుకుపోయాడు. 8.10 మీటర్ల జంప్ చేసిన మురళీ శ్రీశంకర్ ఫౌల్ కారణంగా పసిడి పతకాన్ని కోల్పోయాడు!.
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన దిశగా సాగుతోంది. నీరజ్ చోప్రాకు గాయంతో ఈ విభాగంలో సూపర్‌స్టార్‌ను కోల్పోయినా.. మిగతా అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించగా.. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ ఏకంగా సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల లాంగ్‌జంప్‌లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించింది. సురేశ్ బాబు, అంజు బాబి జార్జ్, ఎంఏ ప్రజూశ్లు పతకాలు సాధించారు. 23 ఏండ్ల మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల అరంగేట్రంలోనే అదరగొట్టాడు. 8.08 మీటర్ల లాంగ్‌జంప్‌తో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.
శ్రీశంకర్ అద్భుతం : లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్ పతక ఫేవరేట్లలో ఒకడిగా బరిలోకి దిగాడు. మెరుగైన జంప్‌తో జాతీయ రికార్డును తన పేరిట లిఖించుకున్న శ్రీశంకర్.. కామన్వెల్త్ క్రీడల్లో తొలి ప్రయత్నంలోనే పసిడిపై కన్నేశాడు. 8.08 మీటర్ల దూరం జంప్ చేసిన శ్రీశంకర్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ ఓ జంప్‌లో మురళీ శ్రీశంకర్ ఏకంగా 8.10 మీటర్లకు పైగా దూరం జంప్ చేశాడు. ఆ జంప్‌ను అధికారులు ఫౌల్‌గా నిర్ణయించారు. దీంతో ఆ జంప్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ జంప్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. శ్రీశంకర్ పసిడి పట్టేవాడు. అయితే, టెలివిజన్ రిప్లేలో శ్రీశంకర్ ఫౌల్ చేసినట్టు కనిపించలేదు. ఫౌల్ లైన్‌కు మిల్లీమీటర్ వ్యత్యాసంలో శ్రీశంకర్ షు కనిపించింది. అయితే, ప్రసారదారు చూపించే కెమెరా కోణం, మ్యాచ్ అధికారులు పరిశీలించే కెమెరా కోణాలు ఒకేలా ఉండవని.. భిన్నమైన కెమెరా కోణాల్లో మ్యాచ్ అధికారులు ఫుటేజీని పరిశీలిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, శ్రీశంకర్ ఫౌల్ అయినట్టు చెబుతున్న జంప్‌కు సంబంధించిన ఫోటోతో సోషల్ మీడియాలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్యపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ది బహమాస్‌కు చెందిన అథ్లెట్ లకాన్ నైర్న్ సైతం 8.08 మీటర్ల లాంగ్‌జంప్ చేశాడు. కానీ అతడి రెండో అత్యుత్తమ లాంగ్‌జంప్ 7,89 మీటర్లు. శ్రీశంకర్ రెండో అత్యుత్తమ లాంగ్‌జంప్ 7.84 మీటర్లు. దీంతో బహమాస్ ఆటగాడు పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. జమైకాకు చెందిన థాంప్సన్ 8.05 మీటర్ల ప్రదర్శనతో కాంస్య పతకం సాధించాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత అథ్లెట్ మహ్మద్ అనీస్ 7.97 మీటర్ల ప్రదర్శనతో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా, అర్హత రౌండ్లో మురళీ శ్రీశంకర్ 8.05 మీటర్ల ప్రదర్శనతో.. లకాన్ నైర్న్ (7.90 మీటర్లు) కంటే మెరుగైన స్థానంలో నిలిచాడు.
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ : బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాల పసిడి వేట జోరుగా సాగుతోంది. మహిళల సింగిల్స్‌లో రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పి.వి సింధు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. వరుసగా రెండో మ్యాచ్‌లో సింధు చెమట పట్టకుండా ప్రత్యర్థిని చిత్తు చేసింది. 21-10, 21-9తో హుసినాల్ (ఉగాండ)పై సింధు వరుస గేముల్లో గెలుపొందింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ సైతం అలవోకగా గెలుపొందాడు. శ్రీలంకకు చెందిన షట్లర్ అభరువిక్రమపై 21-9, 21-12తో వరుస గేముల్లో చిత్తు చేశాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ జోడీ మెరుపు విజయం సాధించింది. 21-2, 21-4తో మారిషియస్కు చెందిన జోడీపై అత్యంత ఏకపక్ష విజయం నమోదు చేసింది.
ఇక టేబుల్ టెన్నిస్‌లో స్టార్ ప్యాడ్లర్ మనిక బత్రా, అచంట శరత్ కమల్, తెలుగమ్మాయి ఆకుల శ్రీజలు క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. మనిక బత్రా 11-4, 11-8, 11-6, 12-10తో ఆస్ట్రేలియా అమ్మాయిపై విజయం సాధించింది. శరత్ కమల్, సతియన్లు అలవోక విజయాలు నమోదు చేశారు. మిక్స్డ్ డబుల్స్‌లో ఆకుల శ్రీజ, శరత్ కమల్ జోడీ 5-11, 11-2, 11-6, 11-5తో విజయం సాధించి క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.
నేడు ఇంగ్లాండ్‌తో ఢీ : కామన్వెల్త్ క్రీడల్లో పతకంపై కన్నేసిన టీమ్ ఇండియా.. నేడు అగ్రజట్టు, ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనుంది. గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు గ్రూప్-బిలో అగ్రస్థానం సాధించిన ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్లో తలపడనుంది. మరో సెమీఫైనల్లో పొరుగు దేశాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీపడనున్నాయి. గ్రూప్ దశలో ఓడిన ఆస్ట్రేలియాతో మ్యాచ్ సహా భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. పేసర్ రేణుక సింగ్ స్వింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇటీవల ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఇంగ్లాండ్‌కు మెరుగైన రికార్డుంది. లోతైన బ్యాటింగ్ ఆర్డర్, నమ్మకమైన బౌలింగ్ బృందం ఇంగ్లాండ్ ప్రధాన బలం. భారత్ సైతం అదే తరహాలో రాణిస్తేనే ఇంగ్లాండ్ అమ్మాయిలకు చెక్ పెట్టగలరు. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగస్‌లు దూకుడుగా రాణించటం భారత్‌కు కీలకం. ఇక ఆరంభంలో పేసర్లు అందించిన జోరును.. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు నిలుపటం సైతం కీలకం కానుంది. భారత్, ఇంగ్లాండ్ మహిళల సెమీఫైనల్ మ్యాచ్ నేడు మధ్యాహ్నాం 3.30 గంటలకు ఆరంభం కానుంది.