Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బజరంగ్, దీపక్, సాక్షిలకు స్వర్ణం
- అన్షుకు రజతం, దివ్యకు కాంస్యం
- రెజ్లింగ్‌లో భారత్ పతక పట్టు
బర్మింగ్‌హామ్ : కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్లు భారత్‌కు పతకాల పంట పండించగా.. అదే బాటలో రెజ్లర్లు నడుస్తున్నారు. ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు దుమ్మురేపారు. స్టార్ రెజ్లర్లు బరిలో నిలిచిన పోటీల్లో భారత్ ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుంది. ఒలింపిక్ మెడలిస్ట్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు బంగారు పతకాలు సాధించారు. 23 ఏండ్ల యువ రెజ్లర్ అన్షు మాలిక్ రజత పట్టుతో మెరిసింది. ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో ఇప్పటివరకు నలుగురు భారత రెజ్లర్లు పసిడి పోరుకు చేరుకోగా.. దీపక్ పూనియా పసిడి పట్టు పట్టాల్సి ఉంది!. మరో ఇద్దరు రెజ్లరు కాంస్య పతక పోరులో పోటీపడనున్నారు!.
భళా బజరంగ్ : పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా పసిడి పతకం నిలుపుకున్నాడు. గ్లాస్గోలో సిల్వర్ సాధించిన బజరంగ్.. గోల్డ్‌కోస్ట్‌లో గోల్డ్ కొట్టాడు. పసిడి పట్టులో కెనడా రెజ్లర్ లాచ్లాన్ మెక్‌నీల్‌పై 9-2తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. లెగ్ ఎటాక్‌తో టేక్‌డౌన్ పూర్తి చేసిన బజరంగ్.. మెక్‌నీల్‌ను రెండు సార్లు టేక్‌డౌన్ చేసి విలువైన పాయింట్లు సాధించాడు. సింగిల్ లెగ్ ఎటాక్‌తో మ్యాట్‌పై నుంచి తోసేసి ఆధిక్యత నిరూపించుకున్నాడు. 9-2తో స్పష్టమైన ఆధిక్యం సాధించిన పూనియా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ రెజ్లర్ జార్జ్ రామ్‌పై , క్వార్టర్స్‌లో జీన్ బ్యాండూ (మారిషస్)పై బై ఫాల్‌తో విజయాలు నమోదు చేశాడు. ఇక పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్లో దీపక్ పూనియా పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో పాకిస్థార్ రెజ్లన్ మహ్మద్ ఇనాంపై 3-0తో విజయం సాధించాడు.
సాక్షి, అన్షు జోరు : మహిళల 62 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో సాక్షి మాలిక్ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో కెనడా రెజ్లర్ అనాను చిత్తు చేసిన సాక్షి మాలిక్ పసిడి పట్టు పట్టింది. తొలుత అనా టేక్‌డౌన్‌తో 2-0తో ముందంజ వేయగా.. సాక్షి మాలిక్ గొప్పగా పుంజుకుంది. టేక్‌డౌన్‌తో పాటు పిన్‌డౌన్ చేసి అనాను రజత పతకానికి పరిమితం చేసింది. మహిళల 57 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో అన్షు మాలిక్ రజతంతో సరిపెట్టుకుంది. నైజీరియా రెజ్లర్ ఒడునయ చేతిలో 3-7తో ఓటమి చెందింది. మెరుగైన ప్రదర్శన చేసిన నైజీరియ రెజ్లర్ కామన్వెల్త్లో వరుసగా మూడో పసిడి సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా రెజ్లర్ ఐరిన్ను ఓడించిన అన్షు మాలిక్.. సెమీఫైనల్లో శ్రీలంక రెజ్లర్‌ను చిత్తు చేసింది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన 23 ఏండ్ల అన్షు మాలిక్.. కామన్వెల్త్ పసిడి వేటలో మెరుగైన రెజ్లర్‌కు స్వర్ణం కోల్పోయింది. ఇక మహిళల 68 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో దివ్య కక్రాన్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. రిపిచేజ్తో కాంస్య పతక పోరుకు చేరుకన్న దివ్య కక్రన్ బై ఫాల్‌తో కాంస్య పతకం దక్కించుకుంది.