Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంప్రదాయ పతక ఈవెంట్లు దూరమైనా.. పతక వేటలో టీమ్ ఇండియా సరికొత్త పుంతలు తొక్కుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో మన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు. 3000 మీ స్టీఫుల్‌ఛేజ్‌లో అవినాశ్‌కు సిల్వర్ మెడల్ రాగా.. 10కిమీ వాక్ రేసులో ప్రియాంక రజత వెలుగులు నింపింది. బర్మింగ్‌హామ్ అథ్లెటిక్స్‌లో భారత్ నాల్గో పతకం సొంతం చేసుకోవటం విశేషం. లాన్‌బౌల్స్ ఫోర్స్ మెన్స్ జట్టు సిల్వర్ మెడల్ సాధించగా.. బాక్సర్ జేస్మైన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
- స్టీఫుల్‌ఛేజ్‌లో అవినాశ్‌కు సిల్వర్
- 10కిమీ రేస్ వాక్‌లో ప్రియాంకకు రజతం
- లాన్‌బౌల్స్ మెన్స్ జట్టుకు సిల్వర్ షో
- బాక్సర్ జేస్మైన్కు కాంస్య పతకం
నవతెలంగాణ-బర్మింగ్‌హామ్
అథ్లెటిక్స్‌లో భారత్ సత్తా చాటుతోంది. కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన దిశగా దూసుకెళ్తోంది. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, హైజంప్‌లో తేజస్విన్ శంకర్ పతకాలు పట్టుకురాగా.. తాజాగా స్ప్రింటర్లు పతకాలు కొల్లగొట్టారు. పతక అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత అథ్లెట్లు రజత పతకాలు సాధించారు. పురుషుల 3000 మీటర్ల స్టీఫుల్‌ఛేజ్‌లో అభినాశ్ సబ్లే రజత పతకం సాధించాడు. 10కిమీ వాక్ రేసులో ప్రియాంక సైతం సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. లాన్‌బౌల్స్ ఫోర్స్ మెన్స్ జట్టు ఫైనల్లో నార్తర్న్ ఐర్లాండ్‌కు పసిడి కోల్పోయింది. ఇక, శనివారం జరిగిన నాలుగు బాక్సింగ్ సెమీఫైనల్స్‌లో ఏకంగా ముగ్గురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లగా.. యువ బాక్సర్ జేస్మైన్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
స్ప్రింటర్ల కేరింత! : 10 కిలోమీటర్ల వాక్ రేసులో ప్రియాంక గోస్వామి అదరగొట్టింది. ఈ విభాగంలో రెండో స్థానంలో నిలిచిన ప్రియాంక సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. 43.38.83 సెకండ్లలో రేసు పూర్తి చేసిన ప్రియాంక గోస్వామి కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో పాటు కెరీర్ అత్యుత్తమ మెడల్ సాధించింది. ఐదు కిలోమీటర్ల వద్ద రెండు నిమిషాలు వెనుకంజ వేసిన ప్రియాంక.. తొమ్మిదో కిలోమీటర్ వద్ద ఓ నిమిషం మెరుగుపడినా.. రజతంతో సరిపెట్టుకుంది. 42.34.30 సెకండ్లలో రేసు పూర్తి చేసిన ఆస్ట్రేలియా అథ్లెట్ జెమీమా మోంటాగ్ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల రికార్డుతో ఆసీస్ స్ప్రింటర్ పసిడి సాధించింది. కెన్యా అథ్లెట్ ఎమిలీ 43.50.86 సెకండ్ల ప్రదర్శనతో కాంస్య పతకం గెల్చుకుంది. ఇక పురుషుల 3000 మీటర్ల స్టీఫుల్‌ఛేజ్‌లో అవినాశ్ అదరగొట్టాడు. మెన్స్ 5000 మీటర్ల రేసులో నాల్గో స్థానంతో సరిపెట్టుకున్న అవినాశ్.. స్టీఫుల్‌ఛేజ్‌లో పతకం చేజారనీయలేదు. కెరీర్ ఉత్తమ ప్రదర్శనతో రజతం కైవసం చేసుకున్నాడు. 8.11.20 సెకండ్లలో రేసు ముగించిన అవినాశ్.. కెన్యా అథ్లెట్ కిబివాట్ (8.11.15 సెకండ్లు) తర్వాతి స్థానంలో నిలిచాడు. మరో కెన్యా అథ్లెట్ ఆమోస్ 8.16.83 సెకండ్ల ప్రదర్శనతో కాంస్య పతకం సాధించాడు.
మహిళల 400 (4) రిలే రేసులో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో హీట్-1లో భారత జట్టు ద్వితీయ స్థానం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. హిమదాస్, ద్యుతీచంద్, జ్యోతి, శ్రావణిలతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 44.45 సెకండ్లలో రిలే రేసు పూర్తి చేసింది. ఫైనల్స్‌కు చేరుకున్న 12 జట్లతో కూడిన ఓవరాల్ జాబితాలో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. నైజీరియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు తొలి మూడు స్థానాలు సాధించాయి.
లాన్‌బౌల్స్‌లో మరో మెడల్ : అసలు ఏమాత్రం అంచనాలు లేని లాన్‌బౌల్స్‌లో భారత్ రెండో పతకం సాధించింది. మహిళల ఫోర్స్ జట్టు పసిడి పతకంతో చరిత్ర సృష్టించగా.. మెన్స్ ఫోర్స్ జట్టు సైతం అదే ప్రదర్శన దిశగా సాగింది. కానీ పసిడి పోరులో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో భారత జట్టు పరాజయం పాలైంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్, దినేశ్ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5-18తో ఓటమి చెందారు. ఫైనల్లో ఐదో ఎండ్ వరకు భారత్ పాయింట్ల ఖాతా తెరువలేదు. 12 ఎండ్ల అనంతరం భారత్ 5-14తో వెనుకంజలో నిలిచింది. ఆ తర్వాత సైతం భారత ప్రదర్శన మెరుగుపడలేదు. చివరి ఎండ్‌లలోనూ భారీగా పాయింట్లు సాధించిన నార్తర్న్ ఐర్లాండ్ 18-5తో భారీ విజయంతో పాటు పసిడి పతకం కైవసం చేసుకుంది.
జైస్మైన్ కాంస్య పంచ్ : బాక్సింగ్‌లో భారత్ ఏడు పతకాలు ఖాయం చేసుకోగా.. అందులో ఓ పతకం జైస్మైన్ అందుకుంది. 20 ఏండ్ల యువ బాక్సర్ జైస్మైన్ కామన్వెల్త్ క్రీడల అరంగేట్రంలోనే పతక పంచ్ విసిరింది. శనివారం జరిగిన మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో జైస్మేన్ నిరాశపరిచింది. 2-3తో ఇంగ్లాండ్ బాక్సర్ రిచర్డ్సన్కు పసిడి పోరు బెర్త్‌ను కోల్పోయింది. 27-30, 27-30, 28-29, 27-30, 28-29తో జైస్మైన్ స్వల్ప తేడాతో పసిడి పోరుకు చేరుకునే అవకాశం చేజార్చుకుంది.
కామన్వెల్త్లో ముగ్గురు బాక్సర్లు కనీసం సిల్వర్ మెడల్ ఖాయం చేసుకున్నారు. వరల్డ్ చాంపియన్, తెలంగాణ సూపర్‌స్టార్ నిఖత్ జరీన్, అమిత్ పంఘాల్, నీతూలు తమ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల 48 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ జరీన్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇంగ్లాండ్ బాక్సర్ సవన్నా అల్ఫీయను చిత్తు చేసింది. మూడు రౌండ్లలో సవన్నాకు పంచ్ వాడివేడీ రుచిచూపించిన నిఖత్ 5-0తో ఏకగ్రీవ విజేతగా నిలిచింది. 30-27, 30-27, 30-27, 30-27, 30-27తో ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను విజేతగా తేల్చారు. ఆదివారం జరిగే పసిడి ఫైట్‌లో నార్తర్న్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్నాల్తో నిఖత్ జరీన్ పోటీపడనుంది. పురుషుల 48 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ ఫైనల్లోకి చేరుకున్నాడు. సెమీఫైనల్లో జాంబియా బాక్సర్‌ను 5-0తో చిత్తు చేశాడు. యువ బాక్సర్ నీతూ మహిళల 45 కేజీల విభాగంలో పసిడి పోరుకు చేరుకుంది. కెనడా బాక్సర్ ప్రియాంక ధిల్లాన్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన నీతూ నాకౌట్ విజయం నమోదు చేసింది.
సెమీస్‌లో సింధు : బ్యాడ్మింటన్‌లో పి.వి సింధు పసిడి దిశగా మరో అడుగు ముందుకేసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో సింధు కాస్త కష్టపడింది. మలేషియా షట్లర్‌పై 2-1తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయిన సింధు.. వరుసగా చివరి రెండు గేముల్లో చెలరేగింది. 21-14, 21-18తో జిన్ వీపై విజయం సాధించింది. నేడు సెమీఫైనల్లో సింగపూర్ షట్లర్ జిన్ మియాతో సింధు తలపడనుంది. మరో క్వార్టర్ఫైనల్లో ఆకర్షి కశ్యప్ పరాజయం పాలైంది. స్కాట్లాండ్ షట్లర్ క్రిస్టీ గిల్మోర్ చేతిలో 10-21, 7-21తో కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేసింది.
హాకీ అమ్మాయిలకు షాక్! : హాకీ ఇండియా అమ్మాయిలకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో భారత్ పూర్తి సమయం ముగిసే సరికి 1-1తో సమవుజ్జీగా నిలిచింది. భారత్ తరఫున వందన కటారియ ఏకైక గోల్ కొట్టింది. అదనపు సమయంలోనూ విజేత తేలలేదు. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతగా నిర్ణయించారు. ఆస్ట్రేలియా తొలి ప్రయత్నాన్ని భారత గోల్‌కీపర్ సవిత సమర్థవంతంగా నిలువరించింది. కానీ స్టాప్ క్లాక్‌ను స్టార్ట్ చేయలేదనే కారణంతో ఆస్ట్రేలియాకు మరో అవకాశాన్ని కల్పించారు. దీంతో రెండో అవకాశం సద్వినియోగం చేసుకున్న ఆసీస్ గోల్ కొట్టింది. రెండు అవకాశాలను సైతం గోల్స్‌గా మలిచింది. భారత్ మూడు అవకాశాలను చేజార్చుకుంది. షూటౌట్లో 0-3తో భారత మహిళల జట్టు ఓటమి చెందింది. షూటౌట్లో ఆస్ట్రేలియాకు అదనపు అవకాశం కల్పించటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పట్టపగలు కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ను మోసం చేశారంటూ అంతర్జాతీయ హాకీ సమాఖ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.