Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ టీ20 లీగ్‌లపై ప్రేమ ొఅంతర్జాతీయ క్రికెట్‌కు బైబై
100 టెస్టులు, 400 వికెట్లు, ఐసీసీ టైటిళ్లు, విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ విజయం సాధించిన సంతృప్తి.. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఏ క్రికెటర్‌కు అయినా ఇవే లక్ష్యాలు!. జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ వేదికపై చెలరేగేందుకు ఏండ్లుగా అహర్నిశలు శ్రమించేది ఆ అనుభూతి కోసమే!.
కానీ క్రికెటర్ల పంథా మారింది. అంతర్జాతీయ క్రికెట్ వద్దు.. టీ20 లీగ్‌లే ముద్దు అంటున్నారు. బెన్‌స్టోక్స్, ట్రెంట్బౌల్ట్లు జాతీయ జట్టు బాధ్యతలను తగ్గించుకోగా.. అదే బాటలో మరికొందరు క్రికెటర్లు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు!. ప్రపంచ క్రికెట్ మునుపెన్నడూ ఎరుగని కొత్త తీరాలకు చేరేందుకు రంగం సిద్ధమైంది!!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ట్రెంట్ బౌల్ట్ వయసు 33 ఏండ్లు. న్యూజిలాండ్ అగ్ర పేసర్. 78 టెస్టులు, 93 వన్డేలు, 44 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ నెగ్గిన జట్టులో సభ్యుడు, ఐసీసీ వన్డే, టీ20 వరల్డ్‌కప్ రన్నరప్‌గా నిలిచిన జట్టులోనూ బౌల్ట్ కీలక ఆటగాడు. ఇటువంటి మేటి ఆటగాడు సాధారణంగా మరో మూడేండ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై పలికే అంశంపై ఆలోచన చేయాలి!. ఎందుకంటే మైలురాయి 100వ టెస్టు ఎంతో దూరంలో లేదు. మరో 22 టెస్టుల్లోనే ఆ ఘనత దక్కనుంది. కరోనా అడ్డంకుల్లోనూ చివరి 22 టెస్టులను రెండున్నరేళ్లలోనే ఆడాడు బౌల్ట్. మరో రెండున్నర ఏండ్లలో సులువుగా వందో టెస్టు మైలురాయి చేరుకోగలడు. టెస్టుల్లో 400 వికెట్ల ప్రదర్శన పెద్ద విషయం అయ్యేది కాదు. న్యూజిలాండ్ తరఫున రిచర్డ్ హాడ్లి ఒక్కరే ఈ ఘనత సాధించారు. అటువంటి అరుదైన ఘనత ఎవరు కోరుకోరు!?. కానీ రోజులు మారిపోయాయి. ఆధునిక క్రికెట్లో ఆటగాళ్ల ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పు వస్తోంది. సంప్రదాయ టెస్టు, వన్డే క్రికెట్‌ను కాదని గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో మెరిసేందుకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అందుకే, న్యూజిలాండ్ వార్షిక కాంట్రాక్టును ట్రెంట్‌బౌల్ట్ వదులుకోవటం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. జాతీయ జట్టు ఎంపికలో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉన్నప్పటికీ.. ట్రెంట్‌బౌల్ట్ మరో ఆలోచనకు తావులేకుండా గ్లోబల్ టీ20 లీగ్‌లకు జై కొట్టాడు. అందుకు దారితీసున్న పరిస్థితులు, కారణాలు ఓ సారి చూద్దాం.
మనీ సెక్యూరిటీ! : గ్లోబల్ టీ20 లీగ్‌లు ఆటగాళ్లకు గొప్ప ఆదాయ వనరుగా మారాయి. గతంలో జాతీయ జట్టు తరఫున మ్యాచ్ ఫీజులు, వార్షిక కాంట్రాక్టు వేతనంపైనే అధికంగా ఆధారపడేవారు. జట్టులో కొంతమంది క్రికెటర్లకు మాత్రమే కమర్షియల్ ప్రకటనల ఆదాయం వచ్చేది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు అనంతరం రెండో ఇన్నింగ్స్‌పై క్రికెటర్లకు ఆందోళన సహజం. బోర్డులు అందించే పెన్షన్ల కోసం ఎదురుచూడాలి. టీ20 లీగ్‌ల రాకతో పరిస్థితులు మారిపోయాయి. జాతీయ జట్టుకు ఏడాది పాటు ఆడినా ఆర్జించలేని ఆదాయం.. ఒకట్రెండు నెలల టీ20 లీగ్‌తో సమకూరుతుంది. ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకున్నంత కాలం పొట్టి క్రికెట్లో క్రికెటర్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా, సామర్థ్యం మరో 3-4 ఏండ్లు మాత్రమే ఉండటంతో.. ఈ విలువైన సమయంలో గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో ఆదాయ ఆర్జనకు ఉపయోగించేందుకు బౌల్ట్ నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో యాజమానులు పెద్దగా మారలేదు. దీంతో ఐపీఎల్, సీపీఎల్, యుఏఈ లీగ్.. ఇలా అన్ని లీగ్‌లకు కలిపి ఉమ్మడి కాంట్రాక్టును సైతం కుదుర్చుకునే రోజులు రావచ్చు.
కుటుంబంతో సమయం : జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఏ క్రికెటర్‌కైనా అంతిమ లక్ష్యం. కానీ అంతర్జాతీయ క్రికెట్ కోసం క్రికెటర్లు కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో, ఐసీసీ టోర్నీల్లో ఎక్కువగా ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణ బడలిక, కుటుంబం దూరం కావటం క్రికెటర్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇదే సమయంలో టీ20 లీగ్‌లు ప్రత్యామ్నాయం చూపిస్తున్నాయి. ఒకటి, రెండు నెలల పాటు సాగే టీ20 లీగ్‌లో పెద్దగా ప్రయాణాలు ఉండవు. ఇక లీగ్ సమయంలో కుటుంబంతో కలిసి గడపవచ్చు. ప్రధానంగా, ఇక్కడ క్రికెటర్లు టీ20 లీగ్‌లకు జై కొడుతున్నారు. కుటుంబంతో గడిపేందుకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం, సెలవు తీసుకున్న క్రికెటర్ల ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. స్టార్ క్రికెటర్లు గాయాల బారిన పడినప్పుడు మినహా మిగతా సమయాల్లో పూర్తిగా జాతీయ జట్టుకు అంకితం కావాల్సి వస్తోంది. విదేశీ క్రికెటర్లను అధికంగా ఆకర్షిస్తున్న అంశం ఇదే!.
ఆదరణ తగ్గదు! ఆగ్రహం ఉండదు! : గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో ఉండే మరో విలక్షణ అంశం అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గదు. ఇంకో మాటలో చెప్పాలంటే, కొన్ని దేశాలకు జాతీయ జట్టుతో పోల్చితే గ్లోబల్ టీ20 లీగ్‌ల్లోనే ఆదరణ ఎక్కువ!. ఎక్కువ మంది అభిమానులు ఆటను వీక్షిస్తారు. జాతీయ జట్టుకు ఆడినప్పుడు ఒత్తిడితో పాటు ఓటమి సమయంలో అభిమానుల విపరీత ఆగ్రహావేశాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. గ్లోబల్ టీ20ల్లో ఆ ప్రమాదం ఉండదు. ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంఛైజీతో నిమిత్తం లేకుండా అభిమాన ఆదరణ పెరుగుతుంది. నిండుకుండల్లాంటి స్టేడియంలో నైపుణ్య ప్రదర్శనకు ఏ క్రికెటర్ అంగీకరించడు?!.
విండీస్ ముందంజ! : గ్లోబల్ టీ20 లీగ్‌ల విషయంలో కరీబియన్ క్రికెటర్లు ముందుచూపుతో వ్యవహరించారు. దేశవాళీ క్రికెట్ సర్క్యూట్ స్థాయి పడిపోవటం, అంతర్జాతీయ క్రికెట్లో బోర్డు నుంచి ఆశించిన ఆదాయం రాకపోవటంతో వెస్టిండీస్ క్రికెటర్లు చాలాకాలంగా గ్లోబల్ టీ20 లీగ్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నైతిక విలువల కంటే, డబ్బులే ఎక్కువా? అని విండీస్ క్రికెటర్లపై విమర్శలు సైతం వచ్చాయి. కానీ ఇప్పుడు అందరూ కరీబియన్ల బాటలోనే నడుస్తున్నారు. అంతర్జాతీయంగా అన్ని గ్లోబల్ టీ20ల్లో అగ్ర క్రికెటర్లును అందించిన వెస్టిండీస్.. జాతీయ జట్టు తరఫున బలమైన బృందాన్ని బరిలో నిలుపటంలో విఫలమవుతోంది. అందుకు కారణం, ప్రధాన క్రికెటర్లు తొలి ప్రాధాన్యతగా టీ20 లీగ్‌ల్లోనే ఆడున్నారు. ఇది మున్ముందు ఇతర బోర్డుల్లోనూ కనిపించనుంది.
గ్లోబల్ టీ20 లీగ్‌ల ప్రభావం పెద్ద క్రికెట్ బోర్డులు భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై పెద్దగా ఉండకపోవచ్చు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల నుంచి గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో ఆడే క్రికెటర్ల సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ.. జాతీయ జట్లు సైతం పటిష్టంగానే ఉన్నాయి. ఇక ఈ మూడు బోర్డులు వార్షిక కాంట్రాక్టు, మ్యాచ్ ఫీజులు సైతం ఆకర్షిణీయంగా అందిస్తున్నాయి. ఇవి కాకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డులపై గ్లోబల్ టీ20 లీగ్‌ల ప్రభావం త్వరలోనే పడనుంది. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్, లంక ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, యుఏఈ టీ20 లీగ్, సీఎస్ఏ టీ20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌ల రూపంలో.. ఫుట్‌బాల్ తరహా లీగ్ సంస్కృతి అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా దూసుకొస్తున్న మార్పు. ఈ విషయాన్ని ఇటు క్రికెట్ బోర్డులు, అటు ఐసీసీ అంగీకరించేందుకు సిద్ధంగా లేవు. కానీ మార్పు అనివార్యం, ఎవరూ ఆపలేరు!.