Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధావన్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపిక
ముంబయి : భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధించాడు. స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ అనంతరం కోలుకుని కరీబియన్ పర్యటనకు వెళ్లిన కెఎల్ రాహుల్ అక్కడ కోవిడ్ బారిన పడ్డాడు. తాజాగా బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలో కెఎల్ రాహుల్ ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కొని పాసయ్యాడు. దీంతో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్‌ను ఎంపిక చేశారు. దీంతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా శిఖర్ ధావన్ స్థానంలో కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. భారత జట్టుకు కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ అందుబాటులో లేకపోవటంతో ధావన్‌ను సారథిగా నియమించారు. తాజాగా రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకోవటంతో వైస్ కెప్టెన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. జింబాబ్వేతో సిరీస్‌లో రాహుల్‌తో పాటు దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు సైతం గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జింబాబ్వేతో తొలి వన్డే ఆగస్టు 18న జరుగనుండగా, 22న మూడో వన్డేతో సిరీస్ ముగియనుంది.
భారత వన్డే జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.