Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టుపై మరింత స్పష్టత
- భిన్న పాత్రల్లో యువ క్రికెటర్లు
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్లలో నిలిచిన భారత్.. నాకౌట్ దశకు సైతం చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు, వ్యూహ రచనలో ధోని సహకారం భారత్‌ను ఆదుకోలేకపోయాయి. వైఫల్యానికి కారణం అక్కడే అవగతం చేసుకున్న టీమ్ ఇండియా.. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ పంథాపై ఓ నిర్ణయానికి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో జట్టు ప్రణాళిలు, ఆట శైలిలో దూకుడు అవసరమని అర్థం చేసుకుంది. ఆ లక్ష్యం దిశగా.. రోహిత్, ద్రవిడ్ జోడీ అడుగులు వేసింది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంది. విభిన్న పాత్రల్లో, కఠిన పరిస్థితుల్లో రాణించగల క్రికెటర్ల కోసం ప్రయోగాలు చేసింది. ఆ దిశగా ద్రవిడ్, రోహిత్ ద్వయం విజయవంతమైంది!. ఆసియా కప్‌లో టీ20 ప్రపంచకప్ జట్టును ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టార్గెట్‌గా సాగుతున్న టీమ్ ఇండియా.. ఈ ఏడాది ఇప్పటివరకు 21 టీ20లు ఆడింది. మరే జట్టు ఇన్ని మ్యాచులు ఆడలేదు. మూడు ఫార్మాట్లలో ఆటగాళ్ల పని ఒత్తిడిని సమన్వయం చేసుకుంటూ... పొట్టి ఫార్మాట్లోనే ఏకంగా 27 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌తో సిరీస్‌లోనే 17 మంది ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఆసియా కప్‌కు కౌంట్‌డౌన్ మొదలు కావటంతో.. తుది జట్టు కూర్పులో మార్పులు, చేర్పులు.. ప్రయోగాలకు ఇక చెక్ పడనుంది. తొలి ప్రాధాన్య జట్టును ఆసియా కప్‌లో భారత్ ప్రయోగించనుంది. ఈ కాలంలో భిన్న పాత్రలకు, భిన్న క్రికెటర్లను పరీక్షించిన భారత జట్టు మేనేజ్మెంట్... బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా రాణించగల ఆటగాళ్ల కోసం అన్వేషణ జరిపింది. ఈ క్రమంలో భారత్ ఆటగాళ్లతో పాటు నాయకులనూ మార్చింది. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్‌లు పొట్టి ఫార్మాట్లో సారథ్యం వహించారు. అయితే, సారథ్యం ఎవరు వహించినా.. జట్టు ప్రణాళికలు దూకుడు పట్టాలు తప్పలేదు. ఈ విషయంలో జట్టు మేనేజ్మెంట్ ఆటగాళ్లకు స్పష్టమైన సందేశం పంపించింది. టీ20 ఆటను రూపాంతరం చెందించేందుకు గత కొన్ని మాసాలుగా ప్రయత్నించిన టీమ్ ఇండియా.. కొన్ని కీలక సమాధానాలను కనుగొంది. వాటిలో కొన్నింటిని చూద్దాం..
నయా ఓపెనర్లు! :
ఈ ఏడాది భారత్ ఏడుగురు ఓపెనర్లను ప్రయోగించింది. అందులో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ ఓపెనర్ అవతారం ఎత్తగా, వెస్టిండీస్ పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. సూర్యకుమార్, రిషబ్ పంత్‌లను ఓపెనర్లుగా పంపటం వెనుక అసలు లక్ష్యం.. ఎక్కువసేపు క్రీజులో గడిపే అవకాశం ఇవ్వటం. ఇది భారత్‌కు సరికొత్త అవకాశాలను అందించింది. 15 మందితో కూడిన జట్టులో భిన్న పాత్రలు పోషించగల ఆటగాళ్లు ఉండటం అరుదు. ఇది ఆసియా కప్‌లోనే కాదు వరల్డ్‌కప్‌లోనూ ఉపయుక్తం. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లు ప్రత్యామ్నాయ ఓపెనర్లుగా ఉండనున్నారు. ఐపీఎల్ తర్వాత రోహిత్, రాహుల్ పెద్దగా ఆడలేదు. దీంతో ప్రపంచకప్‌లో ఫిట్నెస్ సమస్యలు తలెత్తితే.. ఆందోళనకు తావులేకుండా, ప్రణాళికల్లో మార్పులు లేకుండా ముందుకెళ్లవచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా 168.75 స్ట్రయిక్‌రేట్‌తో 135 పరుగులు చేశాడు. 44 బంతుల్లో 76 పరుగుల ఇన్నింగ్స్ ఓపెనర్‌గా అతడి ఉత్తమ ప్రదర్శన. టాప్-6 బ్యాటర్లలో పంత్ ఒక్కడే ఎడమ చేతి వాటం బ్యాటర్.
ఓపెనింగ్ చేయగల సమర్థులైన ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఉండటంతో.. ఇషాన్ కిషన్‌ను కాదని దీపక్ హుడాను ఆసియా కప్‌కు ఎంపిక చేసేందుకు దోహదం చేసి ఉండవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్లో దీపక్ హుడా ఏ స్థానంలోనైనా ఆడగలనని నిరూపించుకున్నాడు. ఏడు టీ20ల్లో హుడా 274 పరుగులు చేశాడు. స్ట్రయిక్‌రేట్ 161. బ్యాటింగ్ ఆర్డర్లో 1-7 స్థానాల వరకు ఎక్కడైనా ఆడగలడు. దీనికి తోడు దీపక్ ఉపయుక్తమైన ఆఫ్ స్పిన్నర్. దీపక్ హుడా తరహాలోనే హార్దిక్ పాండ్య పునరాగమనం తుది జట్టు ఎంపికలో భారత్‌కు ఎన్నో అవకాశాలను కల్పించింది. హార్దిక్ ఫినిషర్‌గానూ అదరగొడుతున్నాడు. పంత్ కోసం కార్తీక్‌కు పక్కనపెట్టినా.. ఫినిషర్‌గా పాండ్య ఉండనున్నాడు.
పేస్ బలం బలోపేతం :
వెస్టిండీస్‌తో రెండో టీ20. కరీబియన్లకు చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం. అనుభవం లేని యువ పేసర్ అవేశ్ ఖాన్ చేతికి కెప్టెన్ రోహిత్ బంతిని అందించాడు. భువనేశ్వర్ కుమార్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అవేశ్ ఖాన్‌కు ఆ ఒత్తిడిలో బంతులేసిన అనుభవం రుచి తెలిసేందుకు.. రోహిత్ ఆ పని చేశాడు. ఆ ప్రయోగం తక్షణ ఫలితం ఇవ్వలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో పవర్‌ప్లేలో, డెత్‌లో రెండు ఓవర్లు వేసిన అవేశ్ 47 పరుగులు ఇచ్చాడు. కానీ నాల్గో టీ20లో అవేశ్ ఖాన్ చెలరేగాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. గత రెండు మ్యాచుల్లో తేలిపోయినా.. జట్టు మేనేజ్మెంట్కు అతడికి అవకాశం ఇచ్చింది. జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌కు గాయం కారణంగానే అవేశ్ ఖాన్ ఆసియా కప్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, తుది జట్టు కూర్పులో అర్షదీప్ సింగ్ ప్రధాన పోటీదారు. జులై తొలి వారంలో టీ20 అరంగేట్రం చేసిన అర్షదీప్ సింగ్.. కొత్త బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు. పవర్‌ప్లేలో భారత్‌కు ఇది కొత్త ఆప్షన్. జట్టులోని ఏకైక లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్. డెత్ ఓవర్లలో పదునైన యార్కర్లు సంధించే అర్షదీప్ సింగ్ ఆసియా కప్‌లో చూడదగని ఆటగాళ్లలో ఒకడు!. ఐపీఎల్ 2021 నుంచి డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ ఎకానమీ 8.50. కనీసం 15 ఓవర్లు వేసిన 22 మంది బౌలర్లలో బుమ్రా తర్వాత రెండో అత్యుత్తమ ఎకనామీ అర్షదీప్ సింగ్‌దే. ఈ ఏడాది ఐపీఎల్లో అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ల ఎకానమీ 7.58. బుమ్రా 7.38 ఎకానమీతో అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్‌పై సిరీస్ విజయానంతరం రోహిత్ శర్మ ఓ ప్రయోగం చేశాడు. ప్రధానంగా పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే అర్షదీప్ సింగ్‌ను మిడిల్ ఓవర్లలో సైతం బరిలోకి దింపాడు. ఆ ఓవర్లలో అర్షదీప్ సింగ్ ఏం చేయగలడనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. 6.58 ఎకానమీకి తోడు ఏడు వికెట్లు కూల్చిన అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కరీబియన్ పర్యటనను ముగించాడు.
జడేజాకు ఓ ప్రత్యామ్నాయం! :
ఆసియా కప్ జట్టులో అక్షర్ పటేల్‌కు చోటు లేదు. ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లలో ఒకడు. అయితే, అవసరం ఏర్పడితే రవీంద్ర జడేడాకు బలమైన ప్రత్యామ్నాయం ఉందనే సంగతి భారత జట్టు మేనేజ్మెంట్కు బాగా తెలుసు. వెస్టిండీస్‌పై రెండో వన్డేలో అక్షర్ పటేల్ 35 బంతుల్లో 64 పరుగులు పిండుకున్నాడు. 312 పరుగుల ఛేదనలో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ రెండు మ్యాచులు ఆడాడు. బ్యాటింగ్‌కు పెద్దగా అవకాశం చిక్కలేదు. కానీ నాల్గో టీ20లో ఎనిమిది బంతుల్లోనే అజేయంగా 20 పరుగులు బాది సత్తా చాటాడు. మిడిల్ ఓవర్లలో నెమ్మదించిన స్కోరును దూకుడు పట్టాలెక్కించాడు. మాయజాలంలో అక్షర్ పటేల్ మేటి. ఆ నైపుణ్యమే అతడిని భారత జట్టు ప్రణాళికల్లో భాగం చేసింది. ఎకానమీ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా మొదలెట్టిన అక్షర్ పటేల్.. తనను తాను రూపాంతరం చెందించుకున్నాడు. వైవిధ్యంతో కూడిన బంతులు వేయటంలో దిట్టగా పేరుగాంచాడు. విండీస్‌పై నాల్గో టీ20లో తొలి ఓవర్లోనే బంతి అందుకున్న అక్షర్ పటేల్ పవర్‌ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు పడగొట్టాడు. కుడి చేతి బ్యాటర్లతో కూడిన విండీస్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు.
'నిరుడు దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్‌లో మా కథ ముగిసిన అనంతరం.. పొట్టి ఫార్మాట్లో మా ఆటతీరు, పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం. ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉండాలని ఆటగాళ్లకు సందేశం పంపాం. జట్టు ఏ లక్ష్యం కోసం ముందుకెళ్తుందనే విషయం ఆటగాళ్లకు స్పష్టంగా అర్థమైతే.. వ్యక్తిగతంగా వారూ అందుకు సిద్ధమవుతారు. అందుకోసం వారికి కావాల్సింది స్వేచ్ఛ, స్పష్టత. అవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. బ్యాటర్లు ఏ స్థానంలోనైనా ఆడాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఓ స్థానంలో, ఓ పరిస్థితుల్లో ఆడతామనే భావనకు దూరం అవుతున్నాం'
- రోహిత్ శర్మ