Authorization
Fri April 04, 2025 10:35:27 pm
- లసానెకు త్రిసభ్య ఐఓఏ బృందం
న్యూఢిల్లీ : మరోసారి నిషేధం ఎదుర్కొనే ప్రమాదంలో పడిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వచ్చే నెల తొలి వారంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రధాన కార్యాలయం వెళ్లనుంది. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న నరెంద్ర బత్రాపై ఢిల్లీ హైకోర్టు వేటు వేయటంతో.. ఐఓఏలో ముసలం మొదలైంది!. ఐఓసీ నిబంధనల ప్రకారం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికలు నిర్వహించాలి. న్యాయస్థానంలో కేసులు, అంతర్గత సమస్యలతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతోంది. దీంతో రానున్న మూడు నెలల సమయంలో ఐఓఏ ఎన్నికలు నిర్వహించి, నూతన పాలకవర్గాన్ని ఎన్నుకోని పక్షంలో సస్పెన్షన్ ఎదుర్కొవాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఇదివరకే ఐఓఏకు హెచ్చరిక పూర్వక లేఖను పంపించింది. అయితే, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని, తాత్సారం చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని తెలియజేస్తూ.. ఐఓఏ రోడ్‌మ్యాప్ అందించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఐఓఏ బృందం ఐఓసీ ప్రధాన కార్యాలయం లసానెకు సెప్టెంబర్ 1-2న బయల్దేరనుంది. ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా, కార్యదర్శి రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండేలు లసానెకు వెళ్లనున్నట్టు సమాచారం.