Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 15, 2022. భారత దేశం అమృత ఘట్టంలోకి అడుగుపెట్టిన సందర్భం!. నేటితో స్వాతంత్య్ర భారతావనికి 75 వసంతాలు పూర్తయ్యాయి. ఈ 75 ఏండ్ల కాలంలో అన్ని రంగాల్లోనూ భారత్ పురోగతి సాధించింది. క్రీడా రంగంలోనూ భారత్ నూతన శిఖరాలు అధిరోహించింది. క్రీడా రంగంలో ఇప్పుడిప్పుడే ప్రొఫెషనల్ అడుగులు వేస్తోన్న భారత్.. అంతర్జాతీయ వేదికపై సాధించిన విజయాలు అమోఘం. అదే సమయంలో ఇంకా సాధించాల్సిన ఘనతలు సైతం ఎక్కువగానే ముందున్నాయి. క్రీడా రంగంలో భారత్‌ను ఇప్పుడిప్పుడే స్వర్ణ యుగం తలుపు తడుతోందని ప్రధాని తాజాగా వ్యాఖ్యానించారు.
- కామన్వెల్త్ క్రీడల్లో ఎదగాలి
- కొత్త క్రీడాంశాల్లో పతక వేట సాగాలి
- మిషన్ ఒలింపిక్స్‌కు బీజం పడాలి
శ్రీనివాస్ దాస్ మంతటి
75 ఏండ్ల స్వతంత్య్ర భారతావనిలో భారత్ సంబురాలు చేసుకునే క్రీడా విజయాలు అద్వితీయం. అన్ని క్రీడల్లోనూ భారత్ గొప్ప విజయాలు సాధించింది. భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరు భారత్. వంద కోట్ల ప్రజానికాన్ని ఏకం చేసే శక్తి క్రీడల సొంతం. అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతి పెంచటంతో పాటు దేశానికి సహజ ప్రచారకర్తలుగా క్రీడాకారులు వ్యవహరిస్తారు. వైషమ్యాలు మరిపించి, ప్రజలను ఏకం చేసే సమ్మోహన శక్తి క్రీడా రంగానిది. 75 వసంతాల స్వాతంత్య్ర భారత దేశంలో సాధించాల్సిన విజయాల పట్ల గర్వపడుతూనే..75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాతనైనా సాధించాల్సిన విజయాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం సమంజసం అవుతుందేమో!. అంతర్జాతీయ క్రీడా సంబురం ఒలింపిక్స్‌లో భారత్ తనదైన ముద్ర వేసేందుకు బహు దూరంలో ఉంది!. తొలుత కామన్వెల్త్ క్రీడల్లో అగ్రస్థానం సాధించటం భారత్‌కు సముచిత లక్ష్యమని చెప్పవచ్చు!. ఆ తర్వాత ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో పంజా విసిరేందుకు రంగం సిద్ధమవగలదు. క్రీడా రంగంలో భారత్ నిజంగానే స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోందా?! అసలు స్వర్ణయుగానికి బాటలు పడాలంటే మన ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటో చూద్దాం.
వాస్తవిక లక్ష్యం : భారత్‌లో వ్యవస్థీకృత క్రీడా రంగం లేదు. కుటుంబాల త్యాగాల ఫలితంగానే మేటి క్రీడాకారులు వెలుగులోకి వస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి మెరికల్లాంటి అథ్లెట్లను ఎంపిక చేసి.. ప్రపంచ శ్రేణి శిక్షణ ఇచ్చే వ్యవస్థ మన దగ్గర లేదు. క్రీడాకారులు వ్యక్తిగతంగానే అంతర్జాతీయ వేదికపై మెరిసేందుకు సన్నద్ధమవుతున్నారు. క్రీడాకారులు గొప్ప విజయాలు సాధించిన తర్వాతనే ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతున్నారు. సత్తా చాటేందుకు అవసరమైన శిక్షణ, సదుపాయాలు, సౌకర్యాల కోసం ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారం ఉండటం లేదు. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సారు), రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలు పరిధి మేరకే పని చేస్తున్నాయి. భారత్ స్పోర్ట్స్ నేషన్‌గా ఎదగాలంటే తొలుత.. ఇక్కడ ప్రక్షాళన మొదలవ్వాలి. క్రీడా రంగంలో అగ్రపథాన దూసుకెళ్తోన్న దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మన వ్యవస్థలో ప్రవేశపెట్టాలి. ఒలింపిక్స్ స్థాయిలో అగ్రదేశంగా సత్తా చాటేందుకు.. ఓ 20 ఏండ్ల ముందు నుంచే ఈ ప్రక్రియకు బీజం పడాలి. అప్పుడే ఒలింపిక్స్‌లో పది లోపు పతకాలకే పొంగిపోయే దుస్థితికి తెరపడుతుంది.
కామన్వెల్త్లో మనమెక్కడీ : క్రీడా భారత్ లక్ష్యం.. కామన్వెల్త్ గేమ్స్ నుంచే మొదలవ్వాలి. ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు అతి స్వల్పం. భారత్ చెప్పుకోదగిన స్థాయిలో రాణిస్తున్నది కామన్వెల్త్ గేమ్స్‌లోనే. దీంతో ఇక్కడ అగ్రస్థానంపై కన్నేస్తే.. అది ఒలింపిక్స్‌లోనూ ఫలితాలు ఇవ్వగలదు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటి వరకు సాధించిన పతకాలు 564. ఇందులో 203 పసిడి, 190 రజత, 171 కాంస్య పతకాలు ఉన్నాయి. 1930 నుంచి ఇప్పటి వరకు కామన్వెల్త్ క్రీడలు 22 పర్యాయాలు నిర్వహించారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో 11139 పతకాలు అందించగా.. అందులో 3609 స్వర్ణాలు, 3603 రజతాలు, 3927 రజతాలు ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వాటా కేవలం 5.06 శాతం. పసిడి పతకాల్లో భారత్ 5,62 శాతం, రజత పతకాల్లో 5.27 శాతం, కాంస్య పతకాల్లో 4.35 శాతం అందుకుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఏకంగా 1003 స్వర్ణాలతో ఓవరాల్‌గా 2604 పతకాలు సాధించగా.. ఇంగ్లాండ్ 773 స్వర్ణాలతో ఓవరాల్‌గా 2322 పతకాలు సాధించింది. కెనడా 510 పసిడి పతకాలతో ఓవరాల్‌గా 1647 మెడల్స్ సొంతం చేసుకుంది. ఓవరాల్ పతకాల పట్టికలో భారత్‌ది నాల్గో స్థానం.
కొన్నింట అగ్రపథాన! : కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కొన్ని క్రీడాంశాల్లో అగ్ర పథాన దూసుకెళ్తోంది. బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షుటింగ్లలో భారత్‌కు తిరుగులేదు. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో 3 పతకాలు సాధించగా.. అదే 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో 8 పతకాలతో చరిత్ర సృష్టించారు. స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూరమైనా.. బర్మింగ్‌హామ్‌లో అదరగొట్టారు. లాన్‌బౌల్స్ క్రీడలో కొత్తగా 2 పతకాలు వచ్చాయి. బాక్సింగ్‌లో గోల్డ్‌కోస్ట్‌లో 9 పతకాలు రాగా.. బర్మింగ్‌హామ్‌లో 7 మెడల్స్ సాధించారు. బ్యాడ్మింటన్‌లో గోల్డ్‌కోస్ట్‌లో ఆరు మెడల్స్ రాగా, బర్మింగ్‌హామ్‌లో సైతం ఆరు వచ్చాయి. ఇక రెజ్లింగ్‌లో భారత్ 12 మంది బరిలోకి నిలుపుగా.. 12కు 12 పతకాలు కొల్లగొట్టారు. ఈ అసమాన ప్రదర్శన గోల్డ్‌కోస్ట్, బర్మింగ్‌హామ్‌లో పునరావృతం అయ్యింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో 2018లో 9 మెడల్స్ రాగా.. 2022లో ఆ సంఖ్య 10కు చేరుకుంది. క్రీడాంశాల్లో సాధించిన పతకాల ఆధారంగా బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్‌లలో భారత్ నం.1గా కొనసాగుతోంది (చివరి రెండు కామన్వెల్త్ క్రీడల పతకాల ఆధారంగా).
పతక అన్వేషణ : అంతర్జాతీయ స్థాయిలో భారత్ బలంగా ఉన్న క్రీడల్లో అణగదొక్కేందుకు ఎప్పుడూ ప్రయత్నం జరుగుతుంటుంది!. అది కామన్వెల్త్ క్రీడల్లో అధికంగా కనిపిస్తుంది. సంప్రదాయంగా షుటింగ్, రెజ్లింగ్‌లలో భారత్‌కు తిరుగుండదు. 2018 గోల్డ్‌కోస్ట్‌లో భారత షుటింగ్ బృందం 16 పతకాలు గురిపెట్టింది. అందులో 7 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. బర్మింగ్‌హామ్ క్రీడల నిర్వాహకులు షుటింగ్‌ను తొలగించారు. ఈ నిర్ణయం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇక రానున్న 2026 విక్టోరియా కామన్వెల్త్ క్రీడల జాబితాలో ఇప్పటివరకు షుటింగ్ సహా రెజ్లింగ్‌ను సైతం చేర్చలేదు. రెజ్లింగ్‌లో వంద శాతం పతకాలు సాధించిన భారత్‌కు ఇది దారుణ ఎదురుదెబ్బ కానుంది. అయితే, ఈ నిర్ణయాల పట్ల భారత్ కుంగిపోవాల్సిన పనిలేదు. బర్మింగ్‌హామ్‌లో భారత అథ్లెట్లు ఆ విషయం నిరూపించారు. గోల్డ్‌కోస్ట్‌లో భారత్ 66 పతకాలు సాధించగా.. అందులో 16 మెడల్స్ షుటింగ్‌లో వచ్చినవే. అదే బర్మింగ్‌హామ్‌లో భారత్ 61 పతకాలు సాధించింది. షుటింగ్ లేకపోయినా.. గత గేమ్స్‌తో పోల్చితే కేవలం 4 పతకాలే తక్కువగా సాధించింది. ఇది గొప్ప పరిణామం. ఇదే స్ఫూర్తి రానున్న విక్టోరియా గేమ్స్‌లోనూ కొనసాగాలి.
2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌లలో 52 పతకాల రేసులో నిలిచింది. వాటిలో కొన్ని పతకాలు సాధించినా.. కామన్వెల్త్ క్రీడల్లో అగ్ర దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచేది. సంప్రదాయంగా మనకు బలమున్న క్రీడలను కామన్వెల్త్లో తొలగిస్తే.. ఒలింపిక్స్ వేదికగా సత్తా చాటాలి. కానీ కామన్వెల్త్లో బలహీనంగా ఉన్న క్రీడాంశాల్లో భారత్ పతకాల వేటలో బలమైన పోటీదారుగా నిలువటం ప్రథమ కర్తవ్యం కావాలి. అప్పుడే భారత్‌ను ప్రపంచ దేశాలు స్పోర్ట్స్ నేషన్‌గా చూడగలవు.