Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్టిమేట్ ఖోఖో లీగ్ ఆరంభం
- బోణీ కొట్టిన తెలుగు యోధాస్
పుణె : దేశవాళీ క్రీడా రంగంలోకి మరో స్పోర్ట్స్ లీగ్ దూసుకొచ్చింది. గ్రామీణ క్రీడ ఖోఖో.. అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్ ఆదివారం ఘనంగా మొదలైంది. కార్పోరేట్ సంస్థలు ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన అల్టిమేట్ ఖోఖో లీగ్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పుణెలోని స్టేడియంలో కలర్ఫుల్గా కూతన మొదలైంది. తెలుగు యోధాస్, రాజస్థాన్ వారియర్స్, ఒడిశా జగర్‌నట్స్, ముంబయి ఖిలాడిస్, గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్ గన్స్.. ఆరు ప్రాంఛైజీలు అల్టిమేట్ ఖోఖో ఆరంభ సీజన్లో తలపడుతున్నాయి. టైటిల్ కోసం 22 రోజుల పాటు ఆరు జట్లు పోటీపడనున్నాయి. సరికొత్త ఫార్మాట్, అభిమానులను అలరించే రూల్స్‌తో రూపుదిద్దుకున్న అల్టిమేట్ ఖోఖో లీగ్ ఆదివారం ముంబయి ఖిలాడిస్, గుజరాత్ జెయింట్స్ కూతతో షురూ అయ్యింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ అదిరిపోయే విజయం నమోదు చేసింది. 25 పాయింట్ల తేడాతో ముంబయి ఖిలాడిస్పై ఘన విజయం సాధించింది. గుజరాత్ 69 పాయింట్లు సాధించగా.. ముంబయి 44 పాయింట్లతోనే సరిపెట్టుకుంది. తొలి రోజు రెండో మ్యాచ్‌లో తెలుగు యోధాస్ గెలుపొందింది. చెన్నై క్విక్ గన్స్‌పై 10 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు యోధాస్ 48 పాయింట్లతో మెరువగా.. చెన్నై జట్టు 38 పాయింట్లే సాధించింది. ఇక ఆరంభ వేడుకలకు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. నిండుకుండ లాంటి స్టేడియంలో ఆడటం ఖోఖో ఆటగాళ్లకు సరికొత్త అనుభూతిని అందించింది. సెప్టెంబర్ 4న అల్టిమేట్ ఖోఖో తొలి సీజన్ టైటిల్ పోరు జరుగనుంది.