Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చారిత్రక అడుగు వేసింది. మహిళల క్రికెట్లో తొలిసారి ఎఫ్టీపీ (ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్) విడుదల చేసింది. మే, 2022-ఏప్రిల్, 2025 వరకు రానున్న మూడేండ్ల కాలానికి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన మూడేండ్ల క్యాలెండర్లో మొత్తం 301 మ్యాచులు ఉన్నాయి. ఇందులో ఏడు టెస్టులు, 135 వన్డేలు, 159 టీ20లకు చోటు దక్కింది. ఇక ఈ మూడేండ్ల కాలంలో భారత మహిళల జట్టు రెండు టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు మ్యాచులు ఆడనున్న భారత్.. ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల స్వదేశీ టీ20 సిరీస్ ఆడనుంది. ఎఫ్టీపీ మే, 2022 నుంచి కావటంతో..ఇందులో భారత్ ఇప్పటికే శ్రీలకంతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేసింది. ఐసీసీ విడుదల చేసిన ఎఫ్టీపీ ప్రకారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్‌లు భారత పర్యటనకు రానున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ పర్యటనలకు భారత జట్టు వెళ్లనుంది. ఈ ఏడాది డిసెంబర్లో భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా అమ్మాయిలు.. 2023-24లో మరోసారి మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం రానుంది. అప్పుడు ఓ టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నారు. రానున్న మూడేండ్లలో ఐసీసీ ఈవెంట్ల షెడ్యూల్‌ను సైతం ఎఫ్టీపీలో విడుదల చేశారు. 2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో, 2024 టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో, 2026 టీ20 ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లో నిర్వహించనున్నారు. 2027లో టీ20 చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక వేదిక కానుంది.