Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరీబియన్ పర్యటన, ఆసియా కప్‌కు నడుమ జింబాబ్వే సిరీస్‌పై పెద్దగా ఫోకస్ ఉండదు!. కానీ భారత జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. గాయాల నుంచి కోలుకుని పునరాగమనానికి రంగం సిద్ధం చేసుకున్న కెఎల్ రాహుల్, దీపక్ చాహర్‌లు జింబాబ్వేపై ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు గడువు సమీపిస్తోంది. ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో అంతర్భాగంగా కొనసాగేందుకు జింబాబ్వేపై రాహుల్, చాహర్‌లు రాణించాల్సిందే!.
- రాహుల్, దీపక్‌లకు ఈ సిరీస్ కీలకం
- జింబాబ్వేతో వన్డే సిరీస్ రేపటి నుంచి
నవతెలంగాణ క్రీడావిభాగం :
ప్రపంచ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత క్రికెట్ అందుకు మినహాయింపు కాదు. కరోనా వైపరిత్యం భారత క్రికెట్లో సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఈ ఏడాది భారత్‌కు అత్యధిక మంది ప్రాతినిథ్యం వహించారు. కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ను కాపాడుతూ, విరామం అందిస్తూ.. దేశవాళీలో దుమ్మురేపిన క్రికెటర్లకు జాతీయ జట్టులో చోటు కట్టబెడుతున్నారు. దీంతో జాతీయ జట్టులో రిజర్వ్ బలం పెరగటంతో పాటు చోటు సుస్థిరం చేసుకునేందుకు పడాల్సిన శ్రమ సైతం రెట్టింపు అయ్యింది!. భీకర ఫామ్‌లో ఉండగా గాయాల బారిన పడిన కెఎల్ రాహుల్, దీపక్ చాహర్‌లు జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో పునరాగమనం చేయనున్నారు. భారత్, జింబాబ్వే మూడు మ్యాచుల వన్డే సిరీస్ గురువారం హరారేలో తొలి వన్డేతో ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పునరాగమన క్రికెటర్లు కెఎల్ రాహుల్, దీపక్ చాహర్‌లపై ఫోకస్ కనిపిస్తోంది.
రాహుల్‌కు సవాల్ : సంప్రదాయ టెస్టు బ్యాటర్‌గా ముద్ర పడిన కెఎల్ రాహుల్.. 2016 జింబాబ్వే పర్యటనలోనే తొలి వన్డే ఆడాడు. అరంగేట్రంలోనే శతకం సాధించాడు. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్లో బెంగళూర్ తరఫున పరుగుల వరద పారించాడు. కెఎల్ రాహుల్ ఆల్ ఫార్మాట్ బ్యాటర్‌గా రూపాంతరం చెందింది జింబాబ్వే గడ్డపైనే!. ఆరేండ్ల విరామం అనంతరం కెఎల్ రాహుల్ మరోసారి జింబాబ్వే పర్యటనకు వచ్చాడు. ద్వితీయ శ్రేణి జట్టుకు నాయకత్వం వహిస్తున్న కెఎల్ రాహుల్.. ఈ సారి భిన్నమైన సవాల్ ఎదుర్కొంటున్నాడు. స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స, కోవిడ్-19 బారిన పడిన నేపథ్యంలో కెఎల్ రాహుల్ తన మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. భారత ప్రథమ ప్రాధాన్య జట్టులో కెఎల్ రాహుల్ భాగం. ప్రపంచకప్ జట్టులోనూ కెఎల్ రాహుల్ స్థానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు!. కానీ, అందుకు కెఎల్ రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సెలక్టర్లకు చూపించాలి. ఇక జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో కెఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్‌పై ఆసక్తి నెలకొంది. టీ20 బ్యాటింగ్ ఆర్డర్లో కెఎల్ రాహుల్ టాప్ ఆర్డర్‌లోనే వస్తాడు. కానీ ఇటీవల వన్డేల్లో కెఎల్ రాహుల్ నం.5 స్థానంలో ఎక్కువగా మెరిశాడు. లోయర్ ఆర్డర్లో ఎక్స్ ఫ్యాక్టర్ బ్యాటర్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఆసక్తిగా ఉండటంతో రాహుల్‌ను దిగువన ఆడిస్తున్నారు. కొత్త పాత్రలో రాహుల్ ఒదిగిపోయాడు. ఐదో స్థానంలో అతడి బ్యాటింగ్ సగటు 56.62. పది ఇన్నింగ్స్‌ల్లో 113.81 స్ట్రయిక్‌రేట్‌తో రాహుల్ పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ సెంచరీలు, ఓ శతకం ఉన్నాయి. వన్డేల్లో భారత్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీని కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ రూపంలో మూడో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్ వచ్చే ఏడాది ఉండటంతో.. భారత జట్టు మేనేజ్మెంట్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానంపై జట్టు మేనేజ్మెంట్ దీర్ఘంగా ఆలోచన చేయనుంది.
చాహర్‌కు కఠినం! : కెఎల్ రాహుల్ మాదిరిగానే దీపక్ చాహర్ సైతం సుమారు ఏడు మాసాల అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గాయం బారిన పడకముందు, భారత జట్టు కొత్త బంతి ప్రణాళికల్లో దీపక్ చాహర్ అత్యంత కీలకం. కానీ ఇప్పుడు ఆసియా కప్ జట్టులో అతడికి రిజర్వ్ స్థానమే లభించింది. టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోసం 50 ఓవర్ల ఆటలో ప్రదర్శనకు సిద్ధం కావటం సరైనది కాదేమో, కానీ దీపక్ చాహర్‌కు మాత్రం ఇదే సరైన తరుణం!. ఆరు వారాల విరామం అవసరమైన గాయం.. ఆరు నెలల రిహాబిలిటేషన్ వరకు కొనసాగింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీపక్ చాహర్ ఎక్కువగా గడిపాడు. ఐపీఎల్ 2022 ఆటగాళ్లలో రికార్డు ధర దక్కించుకున్న దీపక్ చాహర్.. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
వైట్‌బాల్ ఫార్మాట్లో దీపక్ చాహర్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న సమయంలో గాయం వెనక్కి లాగింది. చాహర్ చివరి మూడు వన్డేల్లో శ్రీలంకపై అజేయంగా 69, దక్షిణాఫ్రికాపై 54, వెస్టిండీస్‌పై 38 పరుగులు బాదాడు. దీపక్ చాహర్ నం.8 స్థానంలో బ్యాటింగ్ మెరుపులు అందిస్తుండగా.. జట్టు బౌలింగ్ విభాగంలో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. దీపక్ చాహర్ ఆల్‌రౌండ్ నైపుణ్యమే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌లు అతడి కోసం పోటీపడ్డాయి. స్వింగ్ బౌలర్ కోసం చెన్నై ఏకంగా రూ.14 కోట్లు వెచ్చించింది. ఇదే సమయంలో, స్వింగ్స్టార్ భువనేశ్వర్ కుమార్ గాయాలను అధిగమించి, జట్టులోకి వచ్చాడు. ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. 2021 నుంచి భువనేశ్వర్ కుమార్ 29 మ్యాచుల్లో 6.73 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 17 వికెట్లు పవర్‌ప్లేలోనే పడగొట్టినవే. పవర్‌ప్లేలో భువనేశ్వర్ ఎకానమీ 5.75 మాత్రమే. ఇటీవల ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై భువనేశ్వర్ రాణించాడు. జింబాబ్వేతో సిరీస్‌లో దీపక్ చాహర్ సైతం ఫిట్నెస్, ఫామ్ నిరూపించుకుంటే.. భారత్‌కు మరో స్థానంలో ఆరోగ్యకరమైన సెలక్షన్ తలనొప్పి ఉండనుంది.
షాబాజ్ అహ్మద్‌కు చోటు
జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు స్పిన్ ఆల్‌రౌండర్ వాషిం గ్టన్ సుందర్ దూరమ య్యాడు. ఎడమ భుజం గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్ జింబాబ్వేతో మూడు మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సుందర్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. షాబాజ్ అహ్మద్‌ను వన్డే జట్టులోకి ఎంపిక చేసినట్టు బీసీసీఐ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 27 ఏండ్ల షాబాజ్ అహ్మద్ ఉపయుక్త ఆల్‌రౌండర్.