Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిఫా సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : 75 వసంతాల స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ముగించుకున్న మరునాడే.. భారత ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారి చీకటి రోజులు చూడాల్సి వచ్చింది!. బయటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందనే కారణంతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)పై ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య ఫిఫా నిషేధం వేటు వేసింది. త్వరలో భారత్‌లో నిర్వహించాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను సైతం వెనక్కి తీసుకుంది. ఫిఫా నిర్ణయం పట్ల ఏఐఎఫ్ఎఫ్ పాలకుల కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
స్పోర్ట్స్ కోడ్ ప్రకారం ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవిలో 12 ఏండ్లకు మించి కొనసాగకూడదు. కానీ ప్రఫుల్ పటేల్ పదవీ కాలం ముగిసినా పదవి నుంచి తప్పుకోలేదు. ఏఐఎఫ్ఎఫ్ రాజ్యాంగ సవరణ అంటూ.. ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ప్రఫుల్ పటేల్‌ను తప్పించి.. పాలకుల కమిటీని నియమించింది. నూతన రాజ్యాంగం విధి విధానాలు రూపొందిస్తున్న పాలకుల కమిటీ.. ముసాయిదా పత్రాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించింది. జులై 31లోపు రాజ్యాంగం ఖరారు, ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని తొలుత ఫిఫా సూచించింది. కానీ ఈ ప్రక్రియలో ఆలస్యం కావటం, ఏఐఎఫ్ఎఫ్ బాధ్యతలు పాలకుల కమిటీ చేతిలో ఉండటంతో ఆగస్టు 16 అనూహ్య నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా రాజ్యాంగ ఆమోదం, ఎన్నికల ప్రక్రియను ముగించి.. ఫిఫాను సంప్రదిస్తే తాతాల్కిక నిషేధం తొలగించే అవకాశం ఉంది. లేదంటే నిషేధంతో భారత జట్టు అంతర్జాతీయ వేదికపై ఆడే అవకాశం కోల్పోతుంది. అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులూ దూరమవుతాయి. 85 ఏండ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో ఫిఫా నిషేధం ఎదుర్కొవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.