Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-141 ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు
- 2023-27 ఐసీసీ ఎఫ్టీపీ విడుదల
దుబాయ్ : ప్రథమ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు.. మూడు, నాల్గో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో కఠిన ఎదురు కానుంది. 2023-27 కాలానికి ఐసీసీ ఎఫ్టీపీ (ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్) విడుదల చేసింది. మూడో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో (2023-25)లో భారత్ విదేశీ పర్యటనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో టెస్టులు ఆడనుంది. ఇక నాల్గో టెస్టు చాంపియన్‌షిప్‌లో (2025-27) విదేశీ గడ్డపై న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో టెస్టు సిరీస్‌ల్లో పోటీపడనుంది. ఆధునిక క్రికెట్లో స్వదేశంలో అన్ని జట్లు బలంగానే ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనలిస్ట్‌లు తేల్చటంలో విదేశీ గడ్డపై సాధించిన విజయాలే కీలకంగా మారుతున్నాయి. దీంతో 3, 4 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో భారత్ విదేశీ పర్యటనల్లో కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొనుంది. ఇక, ఇంగ్లాండ్‌తో పటౌడీ ట్రోఫీలో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఐదు టెస్టుల పోరాటం చేయనుంది. రానున్న ఐదేండ్ల కాలంలో భారత జట్టు ఏకంగా 141 ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు (మూడు ఫార్మాట్లు) ఆడనుంది. బంగ్లాదేశ్ (150), వెస్టిండీస్ (147), ఇంగ్లాండ్ (142) భారత్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడనున్నాయి. పొట్టి ఫార్మాట్లో భారత్ 61 మ్యాచులు ఆడనుంది. వెస్టిండీస్ ఈ ఫార్మాట్లో ముందుంది. వన్డే ఫార్మాట్లో భారత్ అతి తక్కువగా 42 మ్యాచులు ఆడనుంది. ఐదు రోజుల ఆటలో భారత్ 38 టెస్టులు ఆడనుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే భారత్ కంటే అధికంగా టెస్టులు ఆడనున్నాయి.
ఐపీఎల్‌కు విండో! : ఊహించినట్టుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రత్యేక విండో కేటాయించింది. 2023-27 ఎఫ్టీపీలో ఐపీఎల్ జరిగే సమయంలో ఐసీసీ ఈవెంట్లు లేవు. ఇదే సమయంలో ద్వైపాక్షిక సిరీస్‌లు నామమాత్రం. దీంతో ప్రతి ఏడాది ఏప్రిల్- మే విండో ఐపీఎల్‌కు అధికారికంగా కేటాయించినట్టు చెప్పవచ్చు!.