Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వేతో తొలి వన్డే నేడు
- రాహుల్, చాహర్‌లపై ఫోకస్
-మధ్యాహ్నాం12.45 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ద్వితీయ శ్రేణి జట్టుతో టీమ్ ఇండియా జింబాబ్వే గడ్డపై అడుగపెట్టగా.. భయమెరుగని బ్రాండ్ క్రికెట్ ఫార్ములాను అగ్ర జట్టుపై పరీక్షించుకునేందుకు ఆతిథ్య జట్టు ఎదురుచూస్తోంది. భారత జట్టు ఫోకస్ పూర్తిగా ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లపై ఉండగా.. మధ్యలో వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదు!. కానీ, గాయాల బారిన పడిన కొందరు క్రికెటర్ల ఫామ్, ఫిట్నెస్ను పరీక్షించేందుకు టీమ్ ఇండియాకు సైతం ఈ సిరీస్ చక్కటి అవకాశం. భారత్, జింబాబ్వే తొలి వన్డే పోరు నేడు.
నవతెలంగాణ-హరారే
చివరగా భారత జట్టు 2016లో జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనకు ఓ టీ20 ప్రపంచకప్, ఓ వన్డే వరల్డ్‌కప్, ఓ చాంపియన్స్ ట్రోఫీ సాధించిన నాయకుడు సారథ్యం వహించాడు. ఇన్నేండ్ల విరామం తర్వాత జింబాబ్వే పర్యటనకు వచ్చిన జట్టుకు ఏడాదిలో రొటేట్ అవుతున్న కెప్టెన్లలో ఓ నాయకుడు సారథ్య పగ్గాలు చేపడుతున్నాడు. అయితే, ఆ పర్యటనకు, ఈ పర్యటనకు భారత్ ద్వితీయ శ్రేణి జట్టునే పంపటం ఏకరూపత!. చివరి పర్యటనలో జింబాబ్వేను 3-0తో చిత్తు చేసిన టీమ్ ఇండియా.. తాజాగా అదే ప్రదర్శన పునరావృతం చేయటంపై గురి పెట్టింది. భయమెరుగుని బ్రాండ్ క్రికెట్ ఫార్ములాతో ఆడుతున్న జింబాబ్వే సైతం అగ్రజట్టుతో సిరీస్‌కు గాయాల కారణంగా కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. భారత్, జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ నేడు తొలి పోరుతో షురూ కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 12.45 గంటలకు తొలి వన్డే ఆరంభం అవనుంది.
ఆ ఇద్దరిపైనే ఫోకస్ : జింబాబ్వేపై వన్డే సిరీస్‌లో భారత జట్టు ప్రణాళికల్లో పెద్దగా మార్పు లేదు. వన్డే వరల్డ్‌కప్ వచ్చే ఏడాది కావటంతో.. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్లాన్ అమలు చేయటమే. అయితే, గాయాల బారిన పడి సుదీర్ఘ కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, దీపక్ చాహర్‌లపై ఫోకస్ ఉంది. ఐపీఎల్ 2022 అనంతరం కెఎల్ రాహుల్ మళ్లీ క్రికెట్ ఆడలేదు. తాజాగా జింబాబ్వేతో తొలి వన్డేలో కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. దీపక్ చాహర్ గాయంతో ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. కోలుకునే సమయం పెరగటంతో దీపక్ చాహర్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఫామ్ అందుకోవటం ఈ ఇద్దరికి పెద్ద విషయం కాకపోవచ్చు.. కానీ వన్డే పోరులో తొలుత మ్యాచ్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడే ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తప్పించలేని స్థితిలో నిలబడగలరు.
యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా మరో సిరీస్‌లో ధనాధన్ షోకు సిద్ధమవుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ వన్డే అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లేకపోవటంతో నం.3 బ్యాటర్‌గా రుతురాజ్ ఆడనున్నాడు. చివరగా ఆడిన వన్డే సిరీస్‌లో కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడాడు. ఇప్పుడూ రాహుల్ మిడిల్ ఆర్డర్ ప్రణాళికల్లోనే ఉండనున్నాడు. అక్షర్ పటేల్, దీపక్ హుడాలకు బ్యాటింగ్ ఆర్డర్లో అవసరమైనప్పుడు ముందుకొచ్చే వెసులుబాటు కల్పించనున్నారు. బౌలింగ్ విభాగానికి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ సారథ్యం వహించనున్నాడు. ప్రసిద్ కృష్ణ, దీపక్ చాహర్‌లు సిరాజ్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లకు తోడుగా స్పిన్ బాధ్యతలను దీపక్ హుడా సైతం పంచుకోనున్నాడు.
జింబాబ్వేకు సవాల్ : బంగ్లాదేశ్‌పై వైట్‌బాల్ ఫార్మాట్లో రెండు సిరీస్ విజయాలు నమోదు చేసిన జింబాబ్వే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌పై 304, 291 లక్ష్యాలను జింబాబ్వే అలవోకగా ఛేదించింది. ఆకర్షణీయ ప్రదర్శనలతో జింబాబ్వే క్రికెట్‌ను మళ్లీ ప్రధాన వేదికపై నిలబెట్టేందుకు గొప్ప కృషి జరుగుతోంది. అందులో భాగంగా జింబాబ్వే తొలి కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. భయమెరుగని బ్రాండ్ క్రికెట్ శైలిని మూడు వన్డేల్లో పరీక్షించుకోనుంది. ఈ సిరీస్ అనంతరం జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ వన్డేలు, టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. అంతకముందు, విలువైన ఆత్మవిశ్వాసం సంపాదించేందుకు భారత్‌పై మెరుపు ప్రదర్శనలు అవసరం. ఇక కీలక సిరీస్‌కు జింబాబ్వే జట్టులో కొందరు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. క్రెయిగ్ ఎర్విన్, బ్లెస్సింగ్ ముజరబాని, చతారలు గాయాలతో సిరీస్‌కు అందుబాటులో లేరు. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయంలో సికిందర్ రజా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడు స్వయంగా.. ఆ ఘనతను పేసర్ ల్యూక్ జాంగ్వేకు కట్టబెట్టాడు. పిచ్ నుంచి సహకారం కొరవడిన సందర్భంలో, మిడిల్ ఓవర్లలో బంతి అందుకునే ల్యూక్.. బంగ్లాదేశ్ బ్యాటర్లను సమర్థవంతంగా నిలువరించాడు. భారత్‌తో సిరీస్‌లోనూ ల్యూక్ నుంచి జింబాబ్వే అటువంటి ప్రదర్శన ఆశిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌కు సికందర్ రజా ప్రధాన బలం. అగ్రజట్టుపై రాణించి అందరి దృష్టిలో పడేందుకు జట్టులోని ఇతర ఆటగాళ్లు సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
పిచ్, వాతావరణం : హరారే స్పోర్ట్స్ క్లబ్ సంప్రదాయంగా బ్యాటింగ్ పిచ్. ఇక్కడ జరిగిన చివరి మూడు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ ఉదయం వేళ ఆరంభం కానుండటంతో.. తొలి గంట పాటు పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభించనుంది. పిచ్‌పై తేమ లేకపోతే.. బ్యాటర్లకు తిరుగుండదు. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. హరారేలో భారత్, జింబాబ్వే (1992-2016) 16 వన్డేల్లో తలపడ్డాయి. ఆతిథ్య జట్టు కేవలం రెండు మ్యాచుల్లోనే విజేతగా నిలువగా.. మిగతా మ్యాచుల్లో భారత్ ఆధిపత్యం చెలాయించింది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.
జింబాబ్వే : కైతానో, మారుమని, ఇన్నోసెంట్ , వెస్లీ, సికిందర్ రజా, చకబవ (కెప్టెన్, వికెట్ కీపర్), టోనీ, ల్యూక్ జాంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్, చివాంగ.