Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జింబాబ్వేతో రెండో వన్డే
- మధ్యాహ్నం 12.45ని.ల నుంచి సోనీలో
హరారే: తొలి వన్డేలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 1-0 ఆధిక్యంలోకి టీమిండియా.. శనివారం హరారే వేదికగానే రెండోలో జింబాబ్వేతో తలపడనుంది. జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తొలి వన్డేలో లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ అద్భుతంగా రాణించిన సంగతిని గుర్తుంచుకోవాలి. ఆ వన్డేలో టీమిండియా బౌలర్లు రాణించినా.. జింబాబ్వే లోయర్ఆర్డర్ను కంట్రోల్ చేయడంలో మాత్రం కాస్త విఫలమయ్యారు. కెప్టెన్ చకబ్వాతో పాటు సికిందర్ రాజాను త్వరగానే పెవిలియన్కు చేర్చారు. అయితే తొమ్మిదో వికెట్కు బ్రాడ్ ఇవాన్స్-ఎన్గరవ 70పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లు ఆరంభంలో ఉన్న పట్టును విడిపించారు. లేకపోతే తొలి వన్డేలో జింబాబ్వే 150పరుగుల్లోపే పరిమితం కావాల్సిన ఆ జట్టు చివరికి 189 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరును నమోదు చేసింది. ఆ వన్డేలో దీపక్ చాహర్(3/27), ప్రసిధ్ (3/50), అక్షర్(3/24) కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరాజ్ ఒక వికెట్ లభించింది. ఇక రెండో వన్డేలో ఎక్కువ వికెట్లను ఏ బౌలర్ తీస్తాడో వేచిచూద్దాం.
దుర్భేధ్యఫామ్లో ఉన్న టీమిండియా ఓపెనర్లు..
తొలి వన్డేలో భారత ఓపెనర్లే 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ధావన్(81), శుభ్మన్(82)పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇక గాయం నుంచి కోలుకొని టీమిండియా పగ్గాలు అందుకున్న కేఎల్ రాహుల్ బ్యాటింగ్కు దిగలేదు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ కూడా రెండో వన్డేలో అవకాశం వస్తే మాత్రం ఏమాత్రం చేజారనీయకూడదు. మరో రెండు నెలల్లో పొట్టి ప్రపంచకప్ నేపథ్యంలో ఫిట్నెస్తోపాటు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. టీమ్ఇండియా ఓపెనర్లు కూడా తొలి వన్డే ఆటనే కొనసాగించాలి. శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్ వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడతారు.
అంచనా..
భారతజట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), ధావన్, శుభ్మన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజు(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్.
జింబాబ్వే జట్టు: చకబ్వా(కెప్టెన్, వికెట్ కీపర్), ఇన్నొసెంట్ కాలా, మరుమాని, విలియమ్స్, రాజా, రియాన్ బూరి, జోంగ్వే, ఇవాన్స్, నరావా, నౌచీ.