Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమ్ ఇండియా వరుసగా మరో క్లీన్‌స్వీప్ విజయం దిశగా సాగుతోంది. జింబాబ్వేకు వైట్‌వాష్ పరాజయం రుచిచూపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై వైట్‌బాల్ సిరీస్ విజయాలతో భారత్‌తో సిరీస్‌కు ఎన్నో అంచనాల నడుమ అడుగుపెట్టిన ఆతిథ్య జింబాబ్వే.. ద్వితీయశ్రేణి టీమ్ ఇండియాకు పోటీ ఇవ్వటంలో విఫలమైంది. నేడు రాణించకపోతే ఆతిథ్య జట్టుకు వైట్‌వాష్ ఓటమి తప్పదు. భారత్, జింబాబ్వే మూడో వన్డే పోరు నేడు.
- 3-0 విజయం వేటలో భారత్
- నేడు జింబాబ్వేతో చివరి వన్డే పోరు
- మధ్యాహ్నాం 12.45 నుంచి సోనీలో ప్రసారం..
నవతెలంగాణ-హరారే :
కుర్రాళ్లకు అవకాశం! : వన్డే సిరీస్ 2-0తో భారత్ సొంతమైంది. క్లీన్‌స్వీప్ విజయం ఊరిస్తున్నప్పటికీ.. బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించటంపై జట్టు మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, షాబాజ్ అహ్మద్‌లు నేడు తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అవేశ్ ఖాన్ సైతం పేస్ విభాగంలో స్థానం సాధించే చాన్స్ ఉంది. సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్‌కు విశ్రాంతి ఇచ్చే సూచనలు ఉన్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం బ్యాట్ పట్టిన కెప్టెన్ కెఎల్ రాహుల్.. తొలి వన్డేలో బ్యాటింగ్ అవకాశం రాలేదు. రెండో వన్డేలో ఓపెనర్‌గా విఫలమయ్యాడు. ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు ఓ మంచి ఇన్నింగ్స్ అవసరం. నేడు కెఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంపై దృష్టి సారించనున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు!. టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ సైతం మెప్పించాల్సి ఉంది. దీపక్ హుడా అరంగేట్రం నుంచీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మూడు విభాగాల్లోనూ జట్టుకు ఉపయుక్తంగా ఉంటున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఫామ్‌లోకి రావటం శుభ పరిణామం. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆకట్టుకున్నాడు. సీనియర్ బౌలర్లు లేని వేళ కొత్త బంతితో మెప్పించాడు. అయితే, గణాంకాల పరంగా అతడి ప్రదర్శన వికెట్ల వేటలో కనిపించలేదు. ఆ లోటు చివరి వన్డేలో తీర్చుతాడేమో చూడాలి. తొలి వన్డేలో హీరోయిక్ ప్రదర్శన చేసిన దీపక్ చాహర్.. రెండో వన్డేలో విశ్రాంతి పొందాడు. చివరి మ్యాచ్‌లో మళ్లీ దీపక్ చాహర్ బంతితో మెరుస్తాడేమో చూడాలి. కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినా.. భారత్ క్లీన్‌స్వీప్ గురి ఎక్కుపెట్టనుంది. తొలి రెండు మ్యాచుల్లో తొలుత బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా.. నేడు తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించటంపై ఫోకస్ పెట్టనుంది.
టాప్ తిప్పలు తప్పేనా? : జింబాబ్వే టాప్ ఆర్డర్ దారుణ ప్రదర్శనతో భారత్‌కు కనీస పోటీ ఇవ్వటం కష్టమైంది. తొలి వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం చివరగా 2014లో నమోదు చేసిన జింబాబ్వే.. 2020 నుంచి ఓపెనింగ్ జోడీలను 14 కాంబినేషన్లలో ప్రయోగించింది. అందులో ఏ ఒక్కటి ఫలితం ఇవ్వలేదు. ఈ సమయంలో జింబాబ్వే తొలి వికెట్ సగటు భాగస్వామ్యం 15 పరుగులు. ఇది రెండో అత్యల్ప భాగస్వామ్య సగటు. అయితే, ఈ ఏడాది రేగిస్ చకబ్వా, కయటనో జోడీ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. శ్రీలంకతో సిరీస్‌లో పల్లెకల్‌లో 80, 59 పరుగుల భాగస్వామ్యాలు అందించింది. బ్యాటింగ్ ఆర్డర్లో చకబ్వా కిందకు వెళ్లటం, కయటనో నిలకడ లేని ప్రదర్శనతో మరో కొత్త జోడీని ప్రయోగించాల్సిన అవసరం ఏర్పడింది. రెండో వన్డేలో ఆడిన కయటనో క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించాడు. 32 బంతులు ఎదుర్కొని 7 పరుగులు చేశాడు. చకబ్వా తను ఆడిన 53 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 24 సార్లు ఓపెనింగ్ చేశాడు. తొలి వన్డేలో నం.6, రెండో వన్డేలో నం.4లో బ్యాటింగ్‌కు వచ్చిన చకబ్వా మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ టాప్ ఆర్డర్ తిప్పలు తప్పించేందుకు జింబాబ్వే మరోసారి ఈ జోడీని ఓపెనింగ్‌కు పంపించే ఆలోచనలో ఉంది. మిడిల్ ఆర్డర్లో అనుభవజ్ఞుడైన బ్యాటర్ సీన్ విలియమ్స్ రాకతో.. జింబాబ్వేకు ఈ కాంబినేషన్ ఉపయుక్తం అవుతుంది. ఇక, జింబాబ్వే మరో సమస్య స్టార్ బ్యాటర్ సికందర్ రజా ఫామ్. జింబాబ్వేతో సిరీస్‌లో రెండు శతకాలతో ధనాధన్ ఛేదనల్లో దంచికొట్టిన సికందర్ రజా.. భారత్‌తో సిరీస్‌లో విఫలమయ్యాడు. ఈ ఏడాది 11 ఇన్నింగ్స్‌ల్లో 55.55 సగటుతో 500 పరుగులు సాధించిన సికందర్ రజా భారత్‌తో చివరి వన్డేలోనైనా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. భారత్‌తో సిరీస్‌లో బ్యాటింగ్ భారం సికందర్ రజాదే. చివరి వన్డేలోనూ ఆ బాధ్యత అతడిదే. కానీ భారత పేసర్లు సికందర్ రజాను సౌకర్యవంతంగా ఆడనివ్వటం లేదు. మూడో మ్యాచ్‌లో భారత బౌలర్లకు సికందర్ రజా సరైన సమాధానం ఇస్తాడేమో చూడాలి.
పిచ్, వాతావరణం : హరారే స్పోర్ట్స్ క్లబ్ ఉదయం సెషన్లో పేసర్లకు అనుకూలించనుంది. శీతల వాతావరణం సద్వినియోగం చేసుకునేందుకు టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు. ఇక్కడ జరిగిన 11 వన్డేల్లో ఎనిమిదింట రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. చివరి మ్యాచ్‌లో భారత్ భిన్నంగా.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్/శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్/షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్/దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ/అవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్.
జింబాబ్వే : కయటనో, ఇన్నోసెంట్, రేగిస్ చకబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), వెస్లీ, సికందర్ రజా, సీన్ విలియమ్స్, రియాన్ బర్ల్, ల్యూక్ జాంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యూచి, టనక చివాంగ.