Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యసేన్, శ్రీకాంత్, ప్రణరు ముందంజ
- సాయిప్రణీత్‌కు తప్పని పరాభవం
- బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-టోక్యో : కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ లక్ష్యసేన్ జోరు కొనసాగుతోంది. పతకమే లక్ష్యంగా టోక్యోలో అడుగుపెట్టిన యువ షట్లర్ లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్యసేన్ అలవోక విజయం నమోదు చేశాడు. బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరులు సైతం తొలి రౌండ్లో మెరుపు విజయాలు నమోదు చేశారు.
సూపర్ లక్ష్య : లక్ష్యసేన్ వరుస గేముల్లోనే తొలి రౌండ్లో గెలుపొందాడు. డెన్మార్క్ షట్లర్ హాన్స్ క్రిస్టియన్ సోల్బర్గ్ను లక్ష్యసేన్ చిత్తు చేశాడు. 21-12, 21-11తో 35 నిమిషాల్లోనే లాంఛనం ముగించాడు. తొలి గేమ్‌లో విరామ సమయానికి 11-8తో ముందంజ వేసిన లక్ష్యసేన్.. వరుస పాయింట్లతో 15-9తో దూసుకెళ్లాడు. 20-12తో అలవోకగా తొలి గేమ్ నెగ్గాడు. రెండో గేమ్‌లో తొలి పాయింట్ డెన్మార్క్ షట్లర్ సాధించినా మ్యాచ్ పాయింట్ లక్ష్యసేన్ సొంతం చేసుకున్నాడు. 3-3 వరకు లక్ష్యసేన్‌తో పోటీ పడిన డెన్మార్క్ షట్లర్.. ఆ తర్వాత చేతులెత్తేశాడు. 11-8తో ఆధిక్యంలో నిలిచిన లక్ష్యసేన్ 14-9, 15-11తో దూకుడుగా ఆడాడు. వరుసగా ఆరు పాయింట్లతో అదరగొట్టిన లక్ష్యసేన్ రెండో గేమ్‌ను మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. నేడు రెండో రౌండ్లో స్పెయిన్ షట్లర్ లూయిస్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు. వరల్డ్ నం.74 లూయిస్ భారత స్టార్ షట్లర్‌కు ఏ మేరకు పోటీనిస్తాడో చూడాలి. ఇక మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ చెమటోడ్చి తొలి రౌండ్ దాటాడు. 22-20, 21-19తో ఐర్లాండ్ ఆటగాడిపై 51 నిమిషాల పోరులో పైచేయి సాధించాడు. అనూహ్యంగా గట్టి పోటీ చవిచూసిన శ్రీకాంత్ ఒత్తిడిలో మంచి విజయం సాధించాడు. 5-5 నుంచి 9-9 వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌లో 10-11తో విరామ సమయానికి శ్రీకాంత్ వెనుకంజ వేశాడు. ద్వితీయార్థంలోనూ 10-14తో వెనుకబడ్డాడు. వేగంగా పుంజుకున్న శ్రీకాంత్ 16-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 16-16తో మళ్లీ స్కోరు సమమైనా.. 20-20 వద్ద టైబ్రేకర్‌లో శ్రీకాంత్ పైచేయి సాధించాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్ ఆధిపత్యం చూపించాడు. 11-6తో విరామ సమయానికి ఆధిక్యం సాధించాడు. ఏ దశలోనూ ఐర్లాండ్ షట్లర్ శ్రీకాంత్‌తో సమవుజ్జీగా నిలువలేదు. 17-16తో దగ్గరకు వచ్చినా.. 20-19తో శ్రీకాంత్ విజయం లాంఛనం చేసుకున్నాడు. నేడు రెండో రౌండ్లో శ్రీకాంత్ చైనా షట్లర్‌తో తలపడనున్నాడు. చివరగా 2017లో చైనా షట్లర్‌తో ఆడిన శ్రీకాంత్ నేడు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. మరో సీనియర్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణరు అలవోకగా గెలుపొందాడు. 21-12, 21-11తో ఆస్ట్రియా షట్లర్‌పై 34 నిమిషాల్లోనే జయభేరి మోగించాడు. రెండు గేముల్లోనూ ప్రణరుకు ప్రతిఘటన ఎదురుకాలేదు. నేడు రెండో రౌండ్లో వరల్డ్ నం.2 కెంటో మొమొట (జపాన్)తో ప్రణరు పోటీపడనున్నాడు. జపాన్ స్టార్‌తో ప్రణరు ముఖాముఖి రికార్డు 0-7తో పేలవంగా ఉంది. నేటి మ్యాచ్‌లో సమీకరణం సరిచేసేందుకు ప్రణరు ప్రయత్నిస్తాడేమో చూడాలి.
మెన్స్ సింగిల్స్‌లో బి. సాయిప్రణీత్ పరాజయం పాలయ్యాడు. చైనీస్ తైపీ షట్లర్‌కు 15-21, 21-15, 15-21తో తలొగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బాన్సోద్ 14-21, 12-21తో డెన్మార్క్ అమ్మాయి చేతిలో ఓటమి చెందింది. వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ నేడు తొలి రౌండ్లో హాంగ్‌కాంగ్ అమ్మాయితో తలపడనుంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట 21-7, 21-9తో గెలుపొందింది. మెన్స్ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి, మను అత్రి 11-21, 21-19, 15-21తో జపాన్ జోడీ చేతిలో కంగుతిన్నారు. అర్జున్, కపిల జోడీ 21-17, 17-21, 22-20తో థారులాండ్ జోడీపై పోరాడి గెలిచారు. మహిళల డబుల్స్‌లో పూజ, సంజన 21-6, 10-21, 21-14తో, మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్, తనీష జంట 21-12, 21-13తో విజయాలు సాధించారు.