Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌తో పోరుపై పాకిస్థాన్
- పాక్ దిగ్గజం వసీం అక్రమ్ భావన
హైదరాబాద్: భారత్, పాకిస్థాన్ పోరు అనగానే అభిమానుల్లో విపరీత అంచనాలు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు తెగిపోయినా.. ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలో పొరుగు దేశాలు ముఖాముఖి పోటీపడుతున్నాయి. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్, పాకిస్థాన్.. తాజాగా ఆసియా కప్ సవాల్‌కు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్ ఫార్మాట్ ప్రకారం భారత్, పాకిస్థాన్ ఈ టోర్నీలో ఏకంగా మూడు సార్లు ముఖాముఖి తలపడేందుకు అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఎప్పుడూ ఢకొీట్టలేదు. 2022 ఆసియా కప్‌లో ఆ అద్వితీయ ఘట్టం సైతం ఆవిష్కృతం అయ్యేలా కనిపిస్తోంది. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ మెగా సమరానికి కౌంట్‌డౌన్ మొదలవగా.. అంతకముందు ఆసియా కప్‌లో తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 28న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యంలో ప్రసారదారు స్టార్‌స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన ఓ ఆన్లైన్ మీడియా సమావేశంలో పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రమ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వసీం అక్రమ్ ఏమన్నాడంటే...
ఆత్మవిశ్వాసం : 'గత రెండేండ్లుగా పాకిస్థాన్ జట్టు గొప్పగా రాణిస్తోంది. అంతర్జాతీయ టోర్నీల్లో నిలకడగా పురోగతి సాధిస్తోంది. పాకిస్థాన్ నిలకడ ప్రదర్శనకు కారణం.. భారత్‌పై విజయమే అనుకుంటున్నాను. అది ఏడాది క్రితం సాధించిన విజయమే అయినా.. అది పాక్ జట్టుకు విలువైన ఆత్మవిశ్వాసం అందించింది. రాత్రి, పగలు ఎప్పుడైనా భారత్‌తో సమరానికి సిద్ధమే అనే ఆత్మవిశ్వాసం పాకిస్థాన్ జట్టులో ఉందని నేను నమ్ముతున్నాను' అని అక్రమ్ అన్నారు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భారత్, పాకిస్థాన్ 13 సార్లు తలపడ్డాయి. అందులో ఒక్కసారి మాత్రమే పాకిస్థాన్ విజయం సాధించింది. వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ అజేయ రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు.
మిడిల్ సమస్య! : ' పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్‌పై కాస్త ఆందోళనగా ఉంది. మిడిల్ ఆర్డర్లో అనుభవం కలిగిన బ్యాటర్లు ఎవరూ లేరు. నం.4 ఇఫ్తికార్ అహ్మద్ ఒక్కడే కాస్త అనుభవం కలిగిన ఆటగాడు. ఇకపోతే హైదర్ అలీని చెప్పవచ్చు. కానీ హైదర్ అలీ నిలకడగా రాణించటం లేదు. ప్రపంచకప్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు పాకిస్థాన్‌కు అత్యంత కీలకం. సాధారణంగా పాక్ జట్టు నమ్మకంగానే ఉందని అనుకుంటున్నాను. కానీ మ్యాచ్‌కు ముందు ఎటువంటి ప్రణాళికలు, వ్యూహలు, ఆలోచనలతో వస్తారనేది కీలకం. ఎందుకంటే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆసియా కప్‌లో ఇరు జట్ల గమ్యాన్ని ఎటువైపైనా ప్రభావితం చేయగలదని' అని అక్రమ్ తెలిపారు. 2021 టీ20 ప్రపంచకప్ అనంతరం పాకిస్థాన్ జట్టు స్కోర్లలో 67.53 శాతం టాప్ ఆర్డర్ నుంచి వచ్చినవే. బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్‌లు ప్రధానంగా బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఆ ముగ్గురు విఫలమైతే.. మిడిల్ ఆర్డర్లో ఆదుకునే బ్యాటర్ కరువయ్యాడు!.
అనివార్యమే కానీ..! : ' విరాట్ కోహ్లితో బాబర్ ఆజామ్‌ను పోల్చటం సహజమే. గతంలోనూ ఇంజమామ్ఉల్ హాక్‌ను రాహుల్ ద్రవిడ్‌తో, సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. అంతకముందు జావెద్ మియాందాద్‌ను సునీల్ గవాస్కర్‌తో పోల్చారు. గుండప్ప విశ్వనాథన్‌తో జహీర్ అబ్బాస్‌ను పోల్చారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోలికలు సహజం. విరాట్‌తో బాబర్‌ను పోల్చటం అనివార్యం. కానీ బాబర్ ఆజామ్ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు. ఆధునిక క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా నిలిచేందుకు బాబర్ సరైన మార్గంలో పయనిస్తున్నాడు. బాబర్ 100 శాతం మెరుగైన టెక్నికే అతడి నిలకడ ప్రదర్శనకు కారణం. బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నాడు, పరుగుల దాహం కనిపిస్తోంది, ఫిట్నెస్తో ఉన్నాడు, ఇంకా కుర్రాడే, మూడు ఫార్మాట్లలో నాయకుడు. వేగంగా నేర్చుకుంటున్న బాబర్.. ఇప్పుడు కోహ్లి ఉన్న స్థితికి చేరుకునేందుకు సరైన దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ దశలో అతడిని కోహ్లితో పోల్చటం మరీ తొందరపాటు. కానీ అతడు ఆధునిక దిగ్గజాల్లో ఒకడిగా నిలిచేందుకు దూసుకొస్తున్నాడు' అని వసీం అక్రమ్ అన్నారు.