Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయత్రి, ట్రెసా జోడీ ముందంజ
- బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-టోక్యో
భారత వెటరన్ బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌లో అదిరే ఆరంభం సాధించిన సైనా నెహ్వాల్ నేరుగా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. హాంగ్‌కాంగ్ అమ్మాయిని వరుస గేముల్లో చిత్తు చేసిన సైనా నెహ్వాల్.. సుదీర్ఘ విరామం అనంతరం పతక వేటలో ఫేవరేట్‌గా కనిపిస్తోంది!. మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ జోడీ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. నేడు పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరులు బరిలోకి దిగనున్నారు.
అలవోకగా.. : మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో అలవోక విజయం నమోదు చేసింది. 38 నిమిషాల్లోనే లాంఛనం ముగించింది. 21-19, 21-9తో చెంగ్ నగాన్ యిపై సైనా విజయం సాధించింది. తొలి గేమ్‌లో హాంగ్‌కాంగ్ షట్లర్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. 4-4 నుంచి 6-9తో సైనా నెహ్వాల్ వెనుకంజ వేసింది. విరామ సమయానికి 10-11తో సైనా నెహ్వాల్ ఓ పాయింట్ వెనుకంజలోనే కొనసాగింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్‌లో ద్వితీయార్థంలోనూ ఉత్కంఠ నెలకొంది. 19-19తో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో సైనా వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సైనా నెహ్వాల్ క్లాస్ ఆట చూపించింది. ఆరంభం నుంచీ ఆధిపత్యం చెలాయించింది. విరామ సమయానికి 11-7తో ముందంజలో నిలిచిన సైనా నెహ్వాల్.. ద్వితీయార్థంలో మరింతగా రెచ్చిపోయింది. వరుస పాయింట్లతో చెలరేగిన సైనా 21-9తో రెండో గేమ్‌ను మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. జపాన్ స్టార్ షట్లర్ నజొమి ఒకుహర గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంది. తొలి రౌండ్లో ఆరో సీడ్ ఒకుహరకు బై లభించింది. రెండో రౌండ్లో సైనా నెహ్వాల్‌తో తలపడాల్సి ఉంది. కానీ ఆమె టోర్నీ నుంచి వైదొలగటంతో సైనా నెహ్వాల్ నేరుగా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది.
మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ 21-11, 21-13తో మలేషియా జంటపై వరుస గేముల్లో గెలుపొందింది. భారత యువ జంటకు రెండు గేముల్లోనూ పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. అలవోకగా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో పదో సీడ్ మలేషియా జోడీ మురళీథరన్, పీయర్లీతో గాయత్రి, ట్రెసా తలపడనున్నారు. మిక్స్డ్ డబుల్స్‌లో ఇషాన్, తనీష జంట 14-21, 17-21తో పరాజయం పాలైంది. మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణ ప్రసాద్, విష్ణువర్థన్ గౌడ్ 14-21, 18-21తో నిరాశపరిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ ప్రసాద్, జూహి జోడీ 10-21, 21-23తో వరుస గేముల్లో ఓటమి చెందింది. మహిళల డబుల్స్‌లో అశ్విని, శిఖా జోడీ 21-8, 14-21తో వరుస గేముల్లో పోరాడి ఓడింది.