Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఆసియా కప్ షురూ
- ఫేవరేట్లుగా భారత్, పాకిస్థాన్
- నేడు తొలి మ్యాచ్‌లో శ్రీలంక, అఫ్గాన్ ఢ
ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు రంగం సిద్ధమైంది. ఆరు దేశాలు, 16 రోజుల పాటు.. ఆసియా కిరీటం కోసం తాడోపేడో తేల్చుకునేందుకు సమరానికి కాలు దువ్వుతున్నాయి. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం క్రికెటర్లకు సవాల్ విసరనుండగా.. రసవత్తర సమరాలు, ఉత్కంఠ రేపే క్లైమాక్స్‌లు అభిమానులను సైతం వేడి వాతావరణంలోకి తీసుకెళ్లనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలు టైటిల్ వేటలో భారత్‌కు సవాల్ విసరనున్నాయి. 2022 ఆసియా కప్ పోరు నేడు శ్రీలంక, అఫ్గనిస్థాన్ పోరుతో ఆరంభం.
నవతెలంగాణ-దుబాయ్
ఆసియా రాజు ఎవరు?
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ ఈవెంట్ల తర్వాత అతిపెద్ద గ్లోబల్ టోర్నీ ఆసియా కప్. పోటీపడే దేశాల పరంగా చూసినా, ఆసియా కప్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆసియా అగ్ర జట్ల నడుమ జరిగే ఈ టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. 38 ఏండ్ల క్రితం షార్జా వేదికగా తొలి ఆసియా కప్ జరిగింది. అప్పుడు భారత్ సహా పాకిస్థాన్, శ్రీలంకలు పోటీపడ్డాయి. మూడు రౌండ్ల రౌండ్ రాబిన్ గేమ్స్ అనంతరం భారత్ విజేతగా అవతరించింది. సునీల్ గవాస్కర్ సారథ్యంలోని భారత్ ఆసియా కప్‌ను తొలిసారి సొంతం చేసుకుంది. ఆసియా కప్ నిలకడగా నిర్వహించే టోర్నీ కాదు. కానీ 2008 నుంచి ప్రతి రెండేండ్లకు ఓసారి నిర్వహిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మళ్లీ అంతరాయం ఏర్పడింది. తాజా ఆసియా కప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లు భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్ ముగిసిన మరో మాసంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగనుంది. దీంతో ఆసియా కప్ కీలకంగా మారింది. ఆసియా కప్ విజేతగా నిలిచిన జట్టు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టేందుకు అవకాశం ఉంటుంది.
త్రిముఖ పోటీ ఉంటుందా?
ఇప్పటివరకు 14 సార్లు ఆసియా కప్ నిర్వహించారు. చివరగా 2018లో ఆసియా కప్ జరిగింది. యుఏఈలోనే నిర్వహించిన గత ఆసియాకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆసియా కప్‌ను అత్యధిక సార్లు సొంతం చేసుకున్న జట్టు భారత్. టీమ్ ఇండియా ఏకంగా 7 సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచింది. శ్రీలంక ఐదు సార్లు చాంపియన్‌గా నిలువగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ టైటిల్‌ను అందుకుంది. ఆసియా అగ్రజట్లు భారత్, పాకిస్థాన్, శ్రీలంక అని చెప్పేవారు. ఇప్పుడు శ్రీలంక స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసిందని భావించవచ్చు. ఇటీవల కాలంలో శ్రీలంక సైతం గణనీయ స్థాయిలో పురోగతి సాధించింది. దీంతో ఆసియా కప్‌లో త్రిముఖ పోటీ ఉంటుంది.
తొలిసారి హాంగ్‌కాంగ్!
ఆసియా కప్ ఈసారి నిజానికి ఆగస్టు 20-24న క్వాలిఫయర్ టోర్నీతో మొదలైంది. ఓమన్‌లో జరిగిన అర్హత టోర్నీలో యుఏఈ, సింగపూర్, కువైట్‌లను ఓడించి హాంగ్‌కాంగ్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో మూడు మ్యాచుల్లో విజయాలు నమోదు చేసిన హాంగ్‌కాంగ్ ఆసియా కప్‌లో తొలిసారి పోటీపడనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హాంగ్‌కాంగ్ 23వ స్థానంలో ఉంది. ఆసియా కప్ ప్రధాన టోర్నీ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో అఫ్గనిస్థాన్ పోటీపడనుంది. సెప్టెంబర్ 11న ఫైనల్‌తో ఆసియా కప్ ముగియనుంది. ఆరంభ, ఫైనల్ మ్యాచులకు దుబారు వేదిక కానుంది.
నయా ఫార్మాట్
ఆసియా కప్ కొత్త ఫార్మాట్లో జరుగనుంది. ప్రధాన టోర్నీలో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఆరు జట్లను రెండు గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సహా పాకిస్థాన్, క్వాలిఫయర్ హాంగ్‌కాంగ్ ఉన్నాయి. గ్రూప్-బిలో ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేవ్, అఫ్గనిస్తాన్ చోటు చేసుకున్నాయి. గ్రూపు దశలో ప్రతి జట్టు మరో జట్టుతో రౌండ్ రాబిన్ పద్దతిలో ఓ సారి తలపడుతుంది. ప్రతి గ్రూపు నుంచి టాప్-2 జట్లు సూపర్ 4 దశకు అర్హత సాధించనున్నాయి. సూపర్4 దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఓ సారి తలపడనుంది. ఇక్కడ టాప్-2లో నిలిచిన జట్టు టైటిల్ పోరులో ఢకొీట్టనున్నాయి.
ఇప్పుడూ టీ20లోనే
ఆసియా కప్‌ను తొలిసారి 2016లో టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. ఈ ఏడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఉండటంతో.. ఆసియా కప్‌ను ఆ ఫార్మాట్లో నిర్వహించారు. ఆధునిక క్రికెట్లో ఆసియా కప్ నిర్వహించే ఏడాదిని బట్టి ఫార్మాట్ నిర్ణయం అవుతోంది. ఈ ఏడాది సైతం ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఉండటంతో మళ్లీ ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్లోనే జరుపుతున్నారు. బహుశా వచ్చే ఏడాది నిర్వహించనున్న ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించవచ్చు. ఎందుకంటే 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అది సన్నాహాక టోర్నీగా ఉపయుక్తం అవుతుంది.
యుఏఈలోనే ఎందుకు?
ఆసియా కప్ కొంతకాలంగా యుఏఈలోనే జరుగుతుంది. భారత్, పాకిస్థాన్‌లు తటస్థ వేదికల్లోనే తలపడుతున్నాయి. గత టోర్నీ యుఏఈలో జరిగేందుకు అది ప్రధాన కారణం. ఈ ఏడాది శ్రీలంకలో జరగాల్సిన టోర్నీ.. అక్కడ తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా యుఏఈలో జరుగుతోంది. ఆతిథ్య హక్కులు శ్రీలంక బోర్డువే కానీ, ఆతిథ్య వేదికలు యుఏఈ నగరాలు. నిజానికి ఆగస్టులో యుఏఈలో క్రికెట్ ఆహ్లాదకరం కాదు!. ఈ సమయంలో వాతావరణం అంత బాగుండదు. అధిక ఉష్ణోగ్రతలు, అధిక ఉక్కపోత పరిస్థితులు ఉంటాయి.
భారత్, పాక్ ఢ మూడుసార్లు?
ఈ ఏడాది ఆసియా కప్ జరుగుతున్న ఫార్మాట్ ప్రకారం భారత్, పాకిస్థాన్‌లు గరిష్టంగా మూడుసార్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. తొలి దశలో ఒకే గ్రూప్‌లో చోటుచేసుకున్న భారత్, పాకిస్థాన్ ఆగస్టు 28న తొలిసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్4కు రెండు జట్లు చేరుకోవటం లాంఛనమే. దీంతో సూపర్4 దశలో మరోమారు ఈ రెండు జట్లు ఢకొీట్టనున్నాయి. ఇక సూపర్4 దశలో భారత్, పాకిస్థాన్‌లు తొలి రెండు స్థానాల్లో నిలిస్తే.. ముచ్చటగా మూడోసారి ఫైనల్లో తలపడేందుకు అవకాశం ఉంది. ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్థాన్‌లు 14 సార్లు ఢకొీన్నాయి. భారత్ ఎనిమిది సార్లు విజయం సాధించగా, పాకిస్థాన్ ఐదు సార్లు గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
బిగ్స్క్రీన్పై క్రికెట్ వినోదం
ఈ ఏడాది ఆసియా కప్ వినోదం రెట్టింపు కానుంది!. భారత్,పాకిస్థాన్ మహా మ్యాచ్ సహా ఇతర క్రికెట్ మ్యాచులను పెద్ద తెరపై చూసేందుకు ఇష్టపడే అభిమానుల కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), సినీపొలిస్లు జట్టు కట్టాయి. దీంట్లో భాగంగా ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సహా ఇతర కీలక మ్యాచులను దేశవ్యాప్తంగా సినీపొలిస్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. బిగ్స్క్రీన్పై క్రికెట్ వినోదం అందించేందుకు ఏసీసీ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.టెలివిజన్, డిజిటల్ వేదికలపై స్టార్‌స్పోర్ట్స్, హాట్స్టార్లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.