Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీఫైనల్లోకి ప్రవేశం
- కనీసం కాంస్యం ఖాయం
- బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-టోక్యో : భారత డబుల్స్ స్టార్స్ సాత్విక్‌సాయి రాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి మరో చరిత్ర సృష్టించారు. థామస్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాత్విక్, చిరాగ్ జంట ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకంతో సరికొత్త రికార్డు నమోదు చేశారు. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న ఈ జోడీ తాజాగా బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లోనూ సూపర్ ప్రదర్శన చేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ మెరుపు విజయం నమోదు చేశారు. రెండో సీడ్ జపాన్ జోడీపై సంచలన విజయం సాధించారు. మూడు గేముల ఉత్కంఠ మ్యాచ్‌లో 24-22, 15-21, 21-14తో సాత్విక్, చిరాగ్ గెలుపొందారు. మెన్స్ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి చేరుకున్న భారత స్టార్స్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పతకం సాధించిన తొలి జోడీగా సాత్విక్, చిరాగ్ నిలిచారు.
ఉత్కంఠ విజయం : పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఏడో సీడ్ చిరాగ్, సాత్విక్ జోడీ సంచలన విజయం నమోదు చేసింది. 75 నిమిషాల పాటు ఉత్కంఠ సాగిన పోరులో పైచేయి సాధించింది. వరల్డ్ నం.2, జపాన్ జోడీ టకురో హౌచి, యుగో కొబయషిలపై సాత్విక్, చిరాగ్ చెలరేగారు. టైబ్రేకర్‌కు దారితీసిన తొలి గేమ్‌లో 24-22తో విజయం సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించారు. ఆరంభంలో 11-5తో ముందంజ వేసిన సాత్విక్, చిరాగ్‌లు.. విరామం అనంతరం నెమ్మదించారు. 14-14తో స్కోరు సమం చేసిన జపాన్ జోడీ.. ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీనిచ్చారు. 22-22 తర్వాత వరుసగా రెండు పాయింట్లు సాధించిన మనోళ్లు కీలక తొలి గేమ్‌ను గెల్చుకున్నారు. రెండో గేమ్‌లో మనోళ్లు నిరాశపరిచారు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. ఇక్కడ సాత్విక్, చిరాగ్ చెలరేగారు. జపాన్ జోడీని చిత్తు చేశారు. ఆరంభం నుంచీ ఆఖరు వరకు అదరగొట్టారు. 5-4తో ముందంజ వేసిన సాత్విక్, చిరాగ్‌లు 11-7తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచారు. 14-9, 17-10తో దూసుకెళ్లారు. 21-14తో మూడో గేమ్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు సెమీఫైనల్లో చిరాగ్, సాత్విక్ జోడీ కఠిన సవాల్ ఎదుర్కొనున్నారు. రెండో సీడ్ జపాన్ జోడీని ఓడించిన మనోళ్లకు సెమీస్‌లో మలేషియా షట్లర్లు, ఆరో సీడ్ యిక్, చియ జోడీతో తలపడనున్నారు. ఏడో సీడ్ సాత్విక్, చిరాగ్‌లు మలేషియా జోడీతో ముఖాముఖి మ్యాచుల్లో 0-5తో వెనుకంజలో ఉన్నారు. ఐదుసార్లు తలపడగా.. ఐదింటా మలేషియా షట్లర్లే విజయం సాధించారు. మంచి ఫామ్‌లో ఉన్న సాత్విక్, చిరాగ్ నేడు రికార్డును సరి చేస్తారేమో చూడాలి.
ప్రణయ్ పరాజయం : పురుషుల సింగిల్స్‌లో పతక ఆశలు చిగురింపచేసిన స్టార్ షట్లర్ హెచ్.ఎస్ ప్రణయ్ క్వార్టర్ఫైనల్లో నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్స్‌లో సహచర యువ సంచలన షట్లర్ లక్ష్యసేన్‌పై గెలుపొందిన ప్రణయ్.. క్వార్టర్స్‌లో చైనా షట్లర్‌కు తలొంచాడు. జున్ పెంగ్‌తో పోరులో 21-19, 6-21, 18-21తో ప్రణయ్ గంటకు పైగా సాగిన పోరులో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్ నుంచి నిష్క్రమించాడు. మెన్స్ డబుల్స్‌లో మరో జోడీ ఎంఆర్ అర్జున్, ధ్రువ్ కపిల 8-21, 14-21తో క్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ ఇండోనేషియా జంట చేతిలో ఓటమి చెందారు.