Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్షణాల్లో ఆధిపత్యం మారిపోయే టీ20 ఫార్మాట్లో 'రూల్స్' ఫలితంపై ప్రభావం చూపటం సరికొత్త చర్చకు నాంది పలికింది. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అమల్లోకి తీసుకొచ్చిన ఓ నిబంధనకు ఇరు వైపులా పదునే!. నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే.. మ్యాచ్‌లో అప్పటికప్పుడు చర్యలు అమల్లోకి వస్తున్నాయి. కీలక డెత్ ఓవర్లలో బౌండరీ లైన్ దగ్గర ఓ ఫీల్డర్ సేవలు కోల్పోవటం బౌలర్‌పై ఒత్తిడి పెంచటంతో పాటు బ్యాటింగ్ జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుంది. స్లో ఓవర్‌రేట్ రూల్ దెబ్బకు ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌లు సతమతం అయ్యాయి!.
- భారత్, పాక్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ రూల్స్‌పై చర్చ
- ఇన్సైడ్ సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు
నవతెలంగాణ-దుబాయ్
భారత్, పాకిస్థాన్ సమరంపై ఇటీవల కాలంలో విపరీత ప్రచారం లభిస్తోంది. ప్రపంచ క్రికెట్లో హై ఓల్టేజ్ మ్యాచ్ అంటూ వస్తోన్న ప్రచారానికి తగినట్టుగా.. మైదానంలో అసలు సమరం ఉండటం లేదు. కానీ, ఆదివారం దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ అందుకు అతీతం. ఈ మధ్య కాలంలో దాయాదుల అత్యుత్తమ పోరుగా దీన్ని అభివర్ణించవచ్చు. భారత జట్టు ఏకపక్ష ఆధిపత్యానికి పాకిస్థాన్ సమర్థవంతంగా సవాల్ విసరటంతో.. దాయాదుల పోరు నరాలు తెగే ఉత్కంఠకు దారితీస్తున్నాయి. ఇక, ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇరు జట్ల ఫీల్డింగ్ నిబంధనల్లో ఓ అనూహ్య మార్పు కనిపిచింది. డెత్ ఓవర్లలో అటు పాకిస్థాన్, ఇటు భారత్‌లు ఇన్సైడ్ సర్కిల్ పరిధిలో ఐదుగురు ఫీల్డర్లను మొహరించాయి. వాస్తవానికి, డెత్ ఓవర్లలో ఇన్సైడ్ సర్కిల్లో నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. అందుకు భిన్నంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఫీల్దింగ్ నిబంధనల మార్పుపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
స్లో ఓవర్ రేట్ : ఈ ఏడాది జనవరిలో ఐసీసీ క్రికెట్ కమిటీ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. టీ20 ఇన్నింగ్స్‌ల్లో సమయ పాలన పాటించేందుకు, మ్యాచ్ ఫీజులో కోతతో పాటు అప్పటికప్పుడు ప్రభావం చూపే విధంగా చర్యలు ఉండాలని కమిటీ భావించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఓ టీ20 ఇన్నింగ్స్ 85 నిమిషాల వ్యవధిలో ముగియాలి. లేదంటే, కనీసం చివరి ఓవర్ తొలి బంతి 85వ నిమిషం లోపు పడాలి. లేదంటే, 85 నిమిషాల సమయం గడిచిన అనంతరం.. మిగిలిన ఓవర్లలకు ఇన్సైడ్ సర్కిల్లో (30 గజాల సర్కిల్) ఐదుగురు ఫీల్డర్లను ఉంచాలి. దీంతో సర్కిల్ బయట ఓ ఫీల్డర్ సేవలను ఫీల్డింగ్ జట్టు కోల్పోతుంది. గంటకు 14.11 ఓవర్లు లేదా 4.15 నిమిషాలకు ఓ ఓవర్ పూర్తి చేయాలని ఐసీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అదే 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌ను 76.30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. బ్యాటర్ అవుటైనప్పుడు ఓ నిమిషం సమయం, ఏదేని ఆటగాడు గాయానికి గురైనప్పుడు వైద్య సేవలకు, ఇరు జట్లు డీఆర్ఎస్ సమీక్షలకు కోరినప్పుడు వృథా అయిన సమయాన్ని ఫీల్డింగ్ జట్టు సమయం నుంచి మినహాయిస్తారు.
ఇద్దరికీ నష్టమే : భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఈ నిబంధనతో ఇరు జట్లకు నష్టం చేకూరింది. నిర్ణీత గడువు లోపు భారత్ 18 ఓవర్లు మాత్రమే పూర్తి చేసింది. దీంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట ఓ ఫీల్డర్ లేకుండా వేసింది. ఆ రెండు ఓవర్లలో (11 బంతులు) పాకిస్థాన్ ఏకంగా 23 పరుగులు పిండుకుంది. ఇక పాకిస్థాన్ 85 నిమిషాల సమయంలో 17 ఓవర్లు మాత్రమే పూర్తి చేసింది. దీంతో ఆ జట్టు ఏకంగా 3 ఓవర్ల పాటు ఇన్సైడ్ సర్కిల్లో కచ్చితంగా ఐదుగురు ఫీల్డర్లను ఉంచాల్సి వచ్చింది. చివరి మూడు ఓవర్లలో 32 పరుగులు అవసరమైన భారత్‌కు.. ఈ నిబంధన కలిసొచ్చింది. ఓ రకంగా ఈ నిబంధన మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారుతోంది.
సరైన పాఠం! : భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో స్లో రన్‌రేట్ నిబంధనల ప్రభావం ఇరు జట్లకు సరైన గుణపాఠమని చెప్పవచ్చు. రానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రణాళికలతో వచ్చేందుకు ఇది దోహదం చేయనుంది. సహజంగా టీ20 ఫార్మాట్లో విజయం ఒక్క ఓవర్లో చేతులు మారుతుంది. కీలక డెత్ ఓవర్లలో స్లో రన్‌రేట్ కారణంగా ఓ ఫీల్డర్‌ను ఇన్సైడ్ సర్కిల్లో అదనంగా మొహరించాల్సి వచ్చినప్పుడు.. కచ్చితంగా బ్యాటర్లకు పరుగుల వేట సులువు అవుతుంది. నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు భారత్ వాస్తవిక ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది.
మ్యాచ్‌లో చివరి ఓవర్లలో గెలు పు, ఓటము లు మారిపోయే పరిస్థితి ఇది. ఇది సమతూకంతో కూడిన నిబంధన. అందరం రన్‌రేట్ గురించే చర్చిస్తాం. ఆసియా కప్ ఫైనల్లో, వరల్డ్‌కప్‌లో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే కచ్చితంగా ఓటమికే అవకాశం ఎక్కువ. ఈ తరహాలో ఓటమిని ఎవరూ కోరుకోరు. భారత జట్టు సమస్యలను ఎల్లప్పుడూ ఛేదిస్తుంది. డ్రెస్సింగ్‌రూమ్ తదుపరి సమావేశంలో స్లో ఓవర్‌రేట్ గురించి చర్చిస్తాం'
- భువనేశ్వర్ కుమార్