Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నం.4 బ్యాటర్‌గా రవీంద్ర జడేజా
- పాక్ ప్రణాళికలు తలకిందులు
నవతెలంగాణ క్రీడావిభాగం
ఆసియా కప్‌లో భారత్ బోణీ కొట్టింది. పొరుగు దేశం పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఉద్విగ విజయం సాధించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య విజయంలో అత్యంత ముఖ్య భూమిక పోషించాడు. మూడు వికెట్లు కూల్చి పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచిన హార్దిక్ పాండ్య.. ఛేదనలో ప్రత్యర్థికి సింహస్వప్నంగా మారాడు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్ల ప్రదర్శనలో భాగంగా పాక్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాంను సాగనంపాడు. అది, మ్యాచ్‌లో తొలి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విజయంలో ఆటగాళ్ల ప్రదర్శనల పరంగా హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజాలు ముందుంటారు. కానీ, జట్టు నాయకత్వం వేసిన ఓ వ్యూహాత్మక ఎత్తుగడ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అదే, రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్.
అనూహ్య నిర్ణయం : 'రిషబ్ పంత్ జట్టు ప్రణాళికల్లో అంతర్భాగం' అని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టులో అతడి స్థానంపై తలెత్తిన సందేహాలను కొట్టిపారేశాడు. ఇది జరిగి, ఓ నెల రోజులైనా కాలేదు!. ఆసియా కప్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తుది జట్టులో రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితం కావటం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. ఎక్స్ ఫ్యాక్టర్‌గా జట్టులో ప్రత్యేకత నిలుపుకున్న పంత్ ఆసియా కప్‌లో రిజర్వ్ ఆటగాడిగా మిగిలాడు. దినేశ్ కార్తీక్‌ను ఫినిషర్ పాత్ర కోసం భారత్ అట్టిపెట్టుకున్నప్పటికీ.. బ్యాటింగ్ లైనప్‌లో కుడి-ఎడమ కాంబినేషన్ కోసమైనా రిషబ్ పంత్‌ను తీసుకుంటారని అందరూ భావించారు. అందుకు భిన్నంగా, భారత జట్టు మేనేజ్మెంట్ దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేసింది.
మాస్టర్ స్ట్రోక్ : తుది జట్టు ఎంపికలోనే కాదు, బ్యాటింగ్ ఆర్డర్లోనూ జట్టు నాయకత్వం భిన్నంగా ఆలోచించింది. ఎవరూ, ఊహించలేని ఎత్తుగడతో పాకిస్థాన్ ప్రణాళికలు తలకిందులు చేసింది. బ్యాటింగ్ ఆర్డర్లో రవీంద్ర జడేజా ఆరో స్థానంలో రావాలి. కానీ, అందుకు భిన్నంగా జడేజా నం.4 బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్‌తో 8వ ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా, చివరి ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు. 29 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 36, హార్దిక్ పాండ్యతో కలిసి 52 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
పాకిస్థాన్ బౌలింగ్ విభాగంలో మగ్గురు పేసర్లు, ఓ లెగ్ స్పిన్నర్ ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా మహ్మద్ నవాజ్ ఒక్కడే ఉన్నాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో తొలిసారి బంతి అందుకున్న నవాజ్.. రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్లో విరాట్ కోహ్లి వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ సైతం నవాజే వేశాడు. కానీ క్రీజులో రవీంద్ర జడేజా అప్పటికే కుదురుకోవటంతో చివరి ఓవర్ వేసేందుకు ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఎదురు చూడాల్సి వచ్చింది. 'క్రీజులో లెఫ్డ్హ్యాండ్ బ్యాటర్ ఉన్నాడు. నవాజ్ ఓవర్ వెనక్కి వెళ్లేందుకు అది కారణమైంది. చివరకు, అదే పాక్ మూల్యం చెల్లించుకునేలా చేసింది' అని మికీ ఆర్థర్ అన్నాడు. ' నం.4 బ్యాటర్‌గా జడేజా వస్తాడని ఎవరూ ఊహించలేదు. అది మంచి నిర్ణయం. నిజానికి, పాకిస్థాన్ నవాజ్‌ను ఓ ఓవర్ పవర్‌ప్లేలో ప్రయోగించాల్సింది. జడేజా ఉండటంతో మిడిల్లో అతడి ఓవర్‌ను ఆలస్యం చేసింది. పాకిస్థాన్‌ను అది బాగా దెబ్బతీసిందని' అని రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డాడు.