Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ఈవెంట్ల టెలివిజన్ హక్కులు జీ సొంతం
- డిజిటల్ ప్రసార హక్కులే అట్టిపెట్టుకున్న డిస్నీ స్టార్
నవతెలంగాణ-ముంబయి
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని నానుడి. తాజాగా ఈ సంప్రదాయం వ్యాపార సామ్రాజ్యంలోకి సైతం ప్రవేశించింది!. సుమారు మూడు దశాబ్దాలుగా మార్కెట్లో గట్టిగా పోటీపడిన డిస్నీ స్టార్, జీ గ్రూప్ సంస్థలు తాజాగా చేతులు కలిపాయి. క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కులు దక్కించుకునేందుకు మొదలై, ముదిరి పాకాన పడిన ఈ టెలివిజన్ సంస్థల వైరం.. ఐసీసీ మీడియా హక్కుల రూపంలో స్నేహానికి దారితీసింది. 2023-27 కాలానికి ఐసీసీ మీడియా హక్కులను డిస్నీ స్టార్ (భారత మార్కెట్) రూ.25 వేల కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. గతంలో ఎనిమిదేండ్ల కాలానికి ఐసీసీ మీడియా హక్కులను రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసిన డిస్నీ స్టార్.. తాజాగా ముగిసిన వేలంలో నాలుగేండ్ల కాలానికి సంబంధించిన హక్కుల కోసమే ఏకంగా రూ.25 వేల కోట్లు వెచ్చించింది. డిస్నీ స్టార్ కేవలం భారత మార్కెట్‌కు ఐసీసీ మీడియా హక్కుల కోసం అధిక ధర చెల్లించిందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. సుమారు రూ.8 వేల కోట్ల వరకు డిస్నీ స్టార్ నష్టపోయే ప్రమాదం ఉందనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి. ఈ పరిస్థితుల్లో డిస్నీ స్టార్ గ్రూప్ అనూహ్య నిర్ణయంతో స్పోర్ట్స్ ప్రసారాల మార్కెట్‌కు షాక్ ఇచ్చింది. రానున్న నాలుగేండ్ల కాలానికి ఐసీసీ మీడియా హకులను జీ టెలివిజన్ గ్రూప్‌తో డిస్నీ స్టార్ పంచుకోనుంది.
టెలివిజన్ హక్కులు జీ సొంతం : 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)ను ఆరంభించిన జీ టెలివిజన్ గ్రూప్.. ఐసీసీ, బీసీసీఐ నుంచి నిషేధం ఎదుర్కొంది. అనంతరం కోర్టు కేసులు నడిచినా.. ఈ మధ్య కాలంలో ఐసీసీ, బీసీసీఐతో జీ గ్రూప్ సంధి చేసుకుంది. ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కుల రేసులోనూ జీ గ్రూప్ పోటీపడింది. ఐసీసీ మీడియా హక్కుల రూపంలో జీ గ్రూప్ మళ్లీ క్రికెట్ ప్రసారాల మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఒప్పందం ప్రకారం రానున్న నాలుగేండ్లలో ఐసీసీ ఈవెంట్ల టెలివిజన్ ప్రసారాల హక్కులను జీ సొంతం చేసుకుంది. డిస్నీ స్టార్, జీ గ్రూప్ మధ్య ఒప్పందానికి ఐసీసీ నుంచి అంగీకారం లభించినట్టు సమాచారం. జీ గ్రూప్‌కు ఎంత మొత్తానికి డిస్నీ స్టార్ టెలివిజన్ ప్రసార హక్కులు అప్పగించిందనే విషయం ఇంకా తెలియలేదు. దీనిపై ఇరు సంస్థలు గోప్యత పాటిస్తున్నాయి. ఇక ఐసీసీ మీడియా హక్కుల అంశంలో మూడో సంస్థ సైతం ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీ, సోనీ గ్రూప్‌ల విలీనానికి చర్చలు నడుస్తున్నాయి. అదే జరిగితే సోనీ నెట్వర్క్ సైతం టెలివిజన్ ప్రసార మార్కెట్లో భాగం కానుంది.
డిస్నీ స్టార్ విచిత్ర వ్యూహం! : క్రికెట్ ప్రసార హక్కుల అంశంలో డిస్నీ స్టార్ విచిత్ర వైఖరితో ముందుకెళ్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల కోసం పోటీపడిన డిస్నీ స్టార్.. డిజిటల్ మార్కెట్‌ను వయాకామ్18కు వదులుకుంది. కానీ టెలివిజన్ ప్రసార హక్కులను నిలుపుకుంది. కానీ అదే ఐసీసీ మీడియా హక్కుల విషయంలో అటు టెలివిజన్, ఇటు డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్నప్పటికీ.. కేవలం డిజిటల్ హక్కులను అట్టిపెట్టుకుంది. టెలివిజన్ హక్కులను మాత్రం జీ గ్రూప్‌కు అమ్మేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు 2024, 2026, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2027 సహా ఐసీసీ అండర్-19 ఈవెంట్లు టెలివిజన్‌లో జీ ప్రసారం చేయనుండగా.. డిజిటల్ వేదికపై డిస్నీ స్టార్ (హాట్‌స్టార్) ప్రసారం చేయనుంది. ఇదిలా ఉండగా, డిస్నీ స్టార్‌తో జీ గ్రూప్ ఒప్పందం ఐసీసీ మీడియా హక్కుల వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం చోటుచేసుకున్నది కాదని తెలుస్తోంది. జీ గ్రూప్ వ్యవహారాలను బీసీసీఐ మాజీ సీఈఓ రాహుల్ జోహ్రీ చూస్తున్నారు. వేలం ప్రక్రియకు ముందే డిస్నీ స్టార్‌తో అవగాహన ఒప్పందం కుదిరేలా చూడటంలో జోహ్రి కీలక భూమిక పోషించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఐసీసీ మహిళల క్రికెట్ టోర్నీల టెలివిజన్, డిజిటల్ ప్రసారాల బాధ్యత డిస్నీ స్టార్ చూడాల్సి రావచ్చు. మహిళల క్రికెట్‌కు గ్లోబల్ ఆదరణ లభించేందుకు ఇచ్చిన డిస్నీ స్టార్ ఇచ్చిన ప్రజంటేషన్ ఐసీసీకి బాగా ఆకట్టుకుంది. అందుకే, మహిళల క్రికెట్ ప్రసారాల టెలివిజన్ ప్రసార హక్కులు జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్‌కు బదిలీ చేసేందుకు ఐసీసీ నుంచి అనుమతి లభించలేదని తెలుస్తోంది.