Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసికూనపై పంజా విసిరేందుకు టీమ్ ఇండియా రంగం సిద్ధం చేసుకుంది!. బలమైన పాకిస్థాన్‌పై మెరుపు విజయం నమోదు చేసిన రోహిత్ సేన.. సూపర్ 4 దశ ముంగిట పలు ప్రయోగాలు సైతం చేసేందుకు ఎదురుచూస్తోంది. ప్రపంచ క్రికెట్ అగ్రజట్టు భారత్‌తో ఆడే అవకాశం అరుదు కావటంతో.. ఈ సమరంలో మెరిసి జీవితకాల జ్ఞాపకాలు సంపాదించేందుకు హాంగ్‌కాంగ్ క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఆసియా కప్ గ్రూప్-ఏలో నేడు భారత్, హాంగ్‌కాంగ్ పోరు.
- పసికూన హాంగ్‌కాంగ్‌తో పోరు నేడు
- రాహుల్, కోహ్లి ఫామ్‌పై ఫోకస్
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం..
నవతెలంగాణ-దుబాయ్
నాలుగేండ్ల క్రితం. 2018 ఆసియా కప్. భారత్‌తో హాంగ్‌కాంగ్ మ్యాచ్. పసికూన హాంగ్‌కాంగ్‌పై పెద్దగా అంచనాలు లేవు. అయినా, ఆ జట్టు అగ్ర జట్టు, టైటిల్ విన్నర్ భారత్‌కు అనూహ్యంగా గట్టి పోటీ ఇచ్చింది. పసికూనపై భారత్ కేవలం 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌తో మ్యాచ్‌లో పోరాట స్ఫూర్తి హాంగ్‌కాంగ్ ఆటగాళ్లకు గొప్ప ప్రేరణగా నిలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్ అర్హత టోర్నీల్లో హాంగ్‌కాంగ్ తృటిలో అవకాశాలు చేజార్చుకుంది. తాజాగా ఆసియా కప్ అర్హత టోర్నీలో కువైట్, సింగపూర్, యుఏఈలపై పైచేయి సాధించి ప్రధాన టోర్నీకి చేరుకుంది. గ్రూప్-ఏలో భాగంగా నేడు బలమైన భారత్‌తో హాంగ్‌కాంగ్ పోటీపడనుంది. ఇప్పటివరకు భారత్, హాంగ్‌కాంగ్‌లు రెండు సార్లు తలపడ్డాయి. 2008, 2018 ఆసియా కప్‌లలో (వన్డే ఫార్మాట్) తలపడిన రెండు సార్లు భారత్ విజయాలు నమోదు చేసింది. టీ20 ఫార్మాట్లో భారత్, హాంగ్‌కాంగ్ పోటీపడనుండటం ఇదే తొలిసారి కానుంది. భారత్, హాంగ్‌కాంగ్ ఆసియా కప్ గ్రూప్ సమరం నేడు.
ఆ ఇద్దరిపై ఫోకస్ : విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ విరామం అనంతరం జట్టులోకి వచ్చారు. కాగితంపై ఈ ఇద్దరు ఆటగాళ్లకు ఎదురులేదు. ఇక హాంగ్‌కాంగ్ వంటి జట్టుతో పోటీపడినప్పుడు ఇక ఆ సంగతి చెప్పనక్కర్లేదు. కానీ ఈ ఇద్దరు ప్రస్తుతం ఫామ్‌లో లేరు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అది స్పష్టంగా కనిపించింది. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి సంయుక్తంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచినా.. అవి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ నుంచి వచ్చిన పరుగులు కావనే చెప్పాలి. మానసికంగా కాస్త తడబాటులో ఉన్న ఈ ఇద్దరు పసికూన హాంగ్‌కాంగ్‌పై పంజా విసిరితే కీలక సూపర్4 దశకు విలువైన ఆత్మవిశ్వాసం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. టాప్ ఆర్డర్లో వచ్చే విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్ నేడు ధనాధన్ ఇన్నింగ్స్‌లపై కన్నేయనున్నారు. వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ను కొనసాగిస్తారా? రిషబ్ పంత్‌కు ఓ అవకాశం కల్పిస్తారా? అనే అంశంపై మ్యాచ్‌కు ముందే స్పష్టత రానుంది. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోరులలో ఒకరిని లేదా ఇద్దరినీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. హాంగ్‌కాంగ్ బ్యాటింగ్ లైనప్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్ల దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ ఈ విధంగా నిర్ణయం తీసుకోనుంది. పేసర్లలో అవేశ్ ఖాన్ బెంచ్‌కు పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి పవర్‌ప్లేలో కీలకం కానున్నాడు. కొత్త బంతితో భువనేశ్వర్‌ను కాచుకుని హాంగ్‌కాంగ్ టాప్ ఆర్డర్ ఏ మేరకు నిలువగలదనేది ఆసక్తికరం.
మెరిసేందుకు ఆరాటం! : హాంగ్‌కాంగ్ జట్టు నేటి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్, పాకిస్థాన్లతో ఒకే టోర్నీలో ఆడే అరుదైన అవకాశం హాంగ్‌కాంగ్ దక్కించుకుంది. ఈ అవకాశం పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ఆ జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు రచిస్తోంది. గతంలో భారత్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో అసమాన పోరాట స్ఫూర్తి కనబరిచిన హాంగ్‌కాంగ్.. నేడు టీ20 ఫార్మాట్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎదురుచూస్తోంది. హాంగ్‌కాంగ్ బ్యాటింగ్ లైనప్‌లో టాప్ ఆర్డర్లో ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉండనున్నారు. ముర్తజా, కించిత్ షాలు టాప్ ఆర్డర్లో కీలకం కానున్నారు. కెప్టెన్ నిజకత్ ఖాన్ బ్యాటింగ్ భారం మోయనున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆయుశ్ శుక్లా, మహ్మద్ గజాన్ఫర్, ఈషన్ ఖాన్లు కీలక పాత్ర పోషించనున్నారు. అర్హత టోర్నీలో అదరగొట్టిన హాంగ్‌కాంగ్.. నేడు భారత్‌పై మంచి ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టిలో పడేందుకు ఆరాటపడుతోంది.
పిచ్, వాతావరణం : ఆసియా కప్ ఇప్పుడిప్పుడే ఆరంభం!. పిచ్ స్వభావంలో పెద్ద మార్పులు లేవు. సహజంగానే దుబారు పిచ్ నుంచి పేసర్లకు కాస్త అనుకూలత లభించనుంది. పెద్ద బౌండరీల, ఎడమ చేతి వాటం బ్యాటర్ల దృష్ట్యా స్పిన్నర్లను తుది జట్టులోకి ఎంపిక చేసుకునేందుకు ఆస్కారం ఉండనుంది. మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. సూపర్4 దశ ముంగిట, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా,దినేశ్ కార్తీక్/రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్/రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.
హాంగ్‌కాంగ్ : నిజఖత్ ఖాన్ (కెప్టెన్), యసీం ముర్తజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, స్కాట్ మెక్కెన్చే (వికెట్ కీపర్), జీషన్ అలీ, హరూన్ అహ్మద్, ఈషన్ ఖాన్, మహ్మద్ గజాన్ఫర్, ఆయుశ్ శుక్లా.