Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంగ్‌కాంగ్‌పై భారత్ గెలుపు
- సూపర్ 4కు రోహిత్‌సేన
నవతెలంగాణ-దుబాయ్ : ఆసియా కప్ గ్రూప్-ఏలో హాంగ్‌కాంగ్, భారత్ పోరు. 40 పరుగుల తేడాతో హాంగ్‌కాంగ్‌పై భారత్ విజయం సాధించింది. అయినా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ హావభావాల్లో విజయానందం ఎక్కడా కనిపించలేదు!. ప్రపంచ అగ్రజట్టు టీమ్ ఇండియాపై పసికూన హాంగ్‌కాంగ్ ఛేదనలో ఏకంగా 152 పరుగులు బాదేసింది. ఓ రకంగా హాంగ్‌కాంగ్‌కు ఇది విజయమే!. ఎందుకంటే, హాంగ్‌కాంగ్ జట్టులోని క్రికెటర్లు ప్రొఫెషనల్స్ కాదు!. వృత్తి రీత్యా ఇతర ఉద్యోగాలు చేస్తూనే క్రికెట్లో కొనసాగుతున్నారు. ఇక, పరుగుల వరద పారిస్తారని ఆశించిన విరాట్ కోహ్లి (59 నాటౌట్, 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (36, 39 బంతుల్లో 2 సిక్స్‌లు) నిరాశపరిచారు. విజయం, సూపర్ 4లో భారత్ అడుగు.. ఇవేవీ భారత అభిమానులకు సంతృప్తి ఇవ్వలేదు. కానీ, సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్, 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ షో కేరింతలు కొట్టేలా చేసింది. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ అర డజను చొప్పున ఫోర్లు, సిక్సర్లతో వీర విహారం చేశాడు. 261.53 స్ట్రయిక్‌రేట్‌తో విధ్వంసక ఇన్నింగ్స్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చాడు!.
ప్చ్! : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు టాప్-3 ఆశించిన ఆరంభం ఇవ్వలేదు. రాహుల్, విరాట్ కోహ్లి పరుగులు చేసినా.. దూకుడు కనిపించలేదు. 39 బంతుల్లో 36 పరుగులతో రాహుల్ తేలిపోగా.. 44 బంతుల్లో 59 పరుగులతో కోహ్లి సైతం నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (21, 13 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్) తనదైన శైలి ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో భారత్ 192 పరుగులు చేయగల్గింది. కోహ్లితో కలిసి సూర్య అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఛేదనలో హాంగ్‌కాంగ్ శక్తికి మించిన ప్రదర్శన చేసింది. బాబర్ హయత్ (41), కించిత్ షా (30), జీషన్ అలీ (26 నాటౌట్), స్కాట్ (16 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్, అవేశ్లు 8 ఓవర్లలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నారు. భువనేశ్వర్, చాహల్, జడేజా త్రయం 11 ఓవర్లలో 48 పరుగులే ఇచ్చి హాంగ్‌కాంగ్‌ను కట్టడి చేసింది. యువ బౌలర్లు తేలిపోవటంతో హాంగ్‌కాంగ్ ఏకంగా 152 పరుగులు నమోదు చేసింది. ఇక భారత బౌలర్లు 20 ఓవర్లలో 5 వికెట్లే పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు : భారత్ ఇన్నింగ్స్ : 192/2 (సూర్య 68, కోహ్లి 59, ఆయుశ్ 1/29) హాంగ్‌కాంగ్ ఇన్నింగ్స్ : 152/5 (బాబర్ 41, కించిత్ 30, జడేజా 1/15)