Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిదాంబి శ్రీకాంత్ పరాజయం
- జపాన్ ఓపెన్ 2022
ఒసాక (జపాన్):భారత స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.8 హెచ్.ఎస్ ప్రణయ్ మరో అద్భుత విజయం నమోదు చేశాడు. మాజీ వరల్డ్ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను చిత్తు చేసి వరుస గేముల్లో మెరుపు విజయం సాధించాడు. జపాన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. మాజీ వరల్డ్ నం.1, అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ నిలకడలేని ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రౌండ్లో అద్బుతంగా ఆడిన కిదాంబి.. ప్రీ క్వార్టర్స్‌లో అనూహ్యంగా నిరాశపరిచాడు. ఓటమితో జపాన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.
44 నిమిషాల ప్రీ క్వార్టర్స్‌లో హెచ్.ఎస్ ప్రణయ్ సత్తా చాటాడు. 22-20, 21-19తో ఎనిమిదో సీడ్, సింగపూర్ స్టార్ కీన్‌పై గెలుపొందాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ ఒత్తిడిని చిత్తు చేసి క్వార్టర్స్‌లో కాలు మోపాడు. తొలి గేమ్ ఆరంభంలో ప్రణయ్ చెమటోడ్చాడు. నువ్వా నేనా అన్నట్టు సాగిన గేమ్‌లో విరామ సవయానికి 9-11తో ప్రణయ్ వెనుకంజ వేశాడు. వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్న సింగపూర్ షట్లర్ 16-11తో దూసుకెళ్లాడు. ద్వితీయార్థంలో కీలక సమయంలో పుంజుకున్న ప్రణయ్ 17-17తో స్కోరు సమం చేశాడు. 17-20తో గేమ్ పాయింట్‌ను కాచుకుని వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. 22-20తో టైబ్రేకర్‌లో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ సైతం ఇదే విధంగా సాగింది. ఆరంభంలో సింగపూర్ షట్లర్ దూకుడు ప్రదర్శించగా.. ద్వితీయార్థంలో ప్రణయ్ దుమ్మురేపాడు. విరామ సమయానికి 4-11తో ప్రణరు భారీ వెనుకంజలో నిలిచాడు. నెమ్మదిగా పుంజుకున్న ప్రణరు 11-16తో అంతరం తగ్గించాడు. ఈ సమయంలో వరుసగా ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రణయ్ 19-17తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివర్లో కీన్‌ను బోల్తాకొట్టించిన ప్రణయ్ 21-19తో రెండో గేమ్‌తో పాటు క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు క్వార్టర్ఫైనల్లో చైనీస్ తైపీ ఆటగాడు చో థిన్ చెన్‌తో ప్రణయ్ పోటీపడనున్నాడు. ముఖాముఖి రికార్డులో 3-4తో ప్రణరు వెనుకంజలో నిలిచినా.. చివరి రెండు మ్యాచుల్లో ప్రణయ్ విజయం సాధించాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే నేడు క్వార్టర్ఫైనల్లో ప్రణయ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. చో థిన్ చెన్ ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించగా, ప్రణయ్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయాడు!.
పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నం.1, స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్ఫైనల్లో శ్రీకాంత్ వరుస గేముల్లో పరాజయం పాలయ్యాడు. జపాన్ ఆటగాడు కెంటా సునేమయ చేతిలో 10-21, 16-21తో 40 నిమిషాల్లోనే క్వార్టర్స్ బెర్త్‌ను కోల్పోయాడు. మహిళల సింగిల్స్‌లో భారత వెటరన్ షట్లర్ సైనా నెహ్వాల్ 9-21, 17-21తో టాప్ సీడ్ అకానె యమగూచి చేతిలో తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్‌లో అశ్విని, శిఖా సహా గాయత్రి, జాలీ జోడీలకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది.