Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమయం వృథాకు జరిమానా
- డిఆర్ఎస్ పద్దతి క్రమబద్ధీకరణ
- ఐసీసీకి ఎంసీసీ సిఫారసులు
నవతెలంగాణ-లండన్
ఐదు రోజుల ఆటలో వేగం పెంచేందుకు, వృథా సమయాన్ని గణనీయంగా కుదించేందుకు మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) పలు విప్లవాత్మక సిఫారసులు చేసింది. ప్రపంచ క్రికెట్ నిబంధనల రూపకర్తగా ఎంసీసీ.. ఎప్పటికప్పుడు ఆట రూల్స్‌లో సమయానుగుణ సూచనలు చేస్తుంది. ప్రధానంగా టెస్టు క్రికెట్లో ఆట వేగం పెంచేందుకు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఎంసీసీ పలు సూచనలు చేసింది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గణాంకాలను తీసుకున్న ఎంసీసీ.. ఆ సిరీస్‌లో సగటున ఒక రోజు 31.5 నిమిషాల సమయం వృథా అయినట్టు తేల్చింది.
సమీక్ష పద్దతి క్రమబద్దీకరణ
అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతిని క్రమబద్దీకరించేందుకు ఎంసీసీ రెండు మార్గాలు సూచించింది. ఒకటి, డిఆర్ఎస్ సమయంలో ఆటగాళ్లు అదనపు సమయం వృథా చేయకుండా నిరోధించటం. రెండు, డిఆర్ఎస్ సమీక్ష సమయంలో అంపైర్లు అనవసర పద్దతులను పక్కనపెట్టడం. ఆట సమయంలో సబ్స్టిట్యూట్లు మైదానంలోకి రావటం, బ్యాటర్లకు గ్లౌవ్స్, డ్రింక్స్ తీసుకొచ్చే నిబంధనలను సమీక్షించాలి. ఫీల్డింగ్ జట్టు నాటౌట్ నిర్ణయాన్ని సవాల్ చేసినప్పుడు.. సమీక్షలో నాటౌట్‌గా తేలితే తక్షణమే బంతి వేసేందుకు సిద్ధంగా ఉండాలి. అవుట్ నిర్ణయమైతే ఎలాగూ ఫీల్డింగ్ జట్టు సంబురాలు చేసేందుకు సమయం చిక్కుతుంది. నాటౌట్ నిర్ణయంలో సమయం వృథాని తగ్గించాలి. ఇక డిఆర్ఎస్ సమీక్ష సమయంలో టీవీ అంపైర్లు ప్రత్యేకించి ఎల్బీడబ్ల్యూ సమయంలో తొలుత బంతి బ్యాట్‌ను తాకిందా (ఇన్సైడ్ ఎడ్జ్)? లేదా తెలుసుకునేందుకు పలు కోణాల్లో పరిశీలిస్తారు. అందుకు బదులుగా, తొలుత బాల్ ట్రాకింగ్‌ను చూడాలి. బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకటం లేదని తెలిస్తే.. వెంటనే ఆ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కు తెలియజేయాలి. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ కోసం సమయం వృథా చేయాల్సిన అవసరం ఉండదు.
పరుగుల జరిమానా
మైదానంలో ఫీల్డ్ అంపైర్లు నిబంధనలను మరింత క్రియాశీలంగా అమలు చేయాలని ఎంసీసీ కోరుతుంది. సమయం వృథా అంశంలో రూల్ 41.9, 41.10 ప్రకారం బ్యాటింగ్, ఫీల్డింగ్ జట్లకు జరిమానా విధించవచ్చు. అవనసరంగా సమయం వృథా అవుతుందని అంపైర్ భావిస్తే.. తొలుత హెచ్చరిస్తారు. ఆ తర్వాత ప్రతిసారి (సమయం వృథా అయినప్పుడల్లా) ఐదు పరుగుల చొప్పున జరిమానా విధిస్తారు. రూల్ 41.9 ప్రకారం ఓ ఓవర్ వేస్తుండగా.. మరీ ఎక్కువ సమయం పడుతుంటే సదరు బౌలర్‌ను సస్పెండ్ చేయమని ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌ను అంపైర్ కోరవచ్చు. ఆ బౌలర్ ఆ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే అర్హత కోల్పోతాడు.
వాస్తవిక డ్రింక్స్ విరామం
టెస్టు మ్యాచుల్లో పరిస్థితులతో సంబంధం లేకుండా, డ్రింక్స్ విరామాలు పద్దతి ప్రకారం ఉంటాయి. గడిచిన గంట సమయంలో ఏం జరిగిందనే అంశంతో ఏమాత్రం సంబంధం లేకుండా డ్రింక్స్ విరామం ఉంటుంది. అయితే, ఇక నుంచి డ్రింక్స్ విరామం తీసుకునే అంశం అంపైర్ చేతుల్లోకి వెళ్లనుంది. షెడ్యూల్ డ్రింక్స్ విరామానికి ఓ 15 నిమిషాల ముందు వికెట్ పడినా, రివ్యూ కోరిన సమయంలో ఆటగాళ్లు డ్రింక్స్ తీసుకుంటే.. ఆ షెడ్యూల్ డ్రింక్స్ విరామ సమయాన్ని అంపైర్ రద్దు చేస్తారు. మ్యాచ్‌లో అవసరమైన సమయంలో ఆ విరామ సమయాన్ని వినియోగిస్తారు.
సమయం వృథా ఇలా..!
టెస్టు మ్యాచుల్లో సగటున ఒక రోజు 31.5 నిమిషాల సమయం వృథా అవుతోందని ఎంసీసీ లెక్కలు తేల్చింది. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ గణాంకాలను ఎంసీసీ ఉదహరించింది. ఈ గణాంకాల ప్రకారం ఓవర్ ముగిసిన అనంతరం మరో ఓవర్ కోసం ఎండ్స్ మారేందుకు అధిక సమయం వృథా అవుతోంది. అందుకు ఏకంగా 20 నిమిషాల సమయం పడుతోంది. డిఆర్ఎస్ సమీక్షలకు నాలుగు నిమిషాలు, బంతి పరిశీలనకు మూడు నిమిషాలు, గ్లౌవ్స్ లేదా ఇతరత్రా మార్పులకు రెండున్నర నిమిషాలు, సైట్స్క్రీన్ మార్పులకు మరో రెండు నిమిషాల సమయం వృథా అవుతోంది. టెస్టు క్రికెట్లో ఓవర్ అనంతరం ఎండ్ మారేందుకు 55 సెకండ్లు పడుతోంది. కౌంటీ క్రికెట్లో మాత్రం 45 సెకండ్ల సమయమే సరిపోతుంది. ఇక డిఆర్ఎస్ అనంతరం బంతి వేసేందుకు ఫీల్డింగ్ జట్టు సగటున 25 సెకండ్లు వృథా చేస్తోంది. ఇక, ఈ సిరీస్‌లో ఏకంగా డిఆర్ఎస్ సమీక్షల కోసం 64 నిమిషాలు పట్టింది. అందులో అంపైర్ సమీక్ష (11 నిమిషాలు), ఆటగాళ్ల సమీక్ష (47 నిమిషాలు) పట్టగా.. డిఆర్ఎస్కు వెళ్లాలా వద్దా అని చర్చించేందుకు ఆటగాళ్లు ఆరు నిమిషాలు సగటున వృథా చేశారు.
ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ సిఫారసులను ఐసీసీకి పంపింది. ఐసీసీ క్రికెట్ కమిటీ దీనిపై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఐసీసీ బోర్డు ఆమోదంతో రూల్స్ అమల్లోకి వస్తాయి. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీకి మైక్ గాటింగ్ చైర్మన్‌గా ఉండగా, మాజీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, కుమార సంగక్కర, అలిస్టర్ కుక్, సుజీ బేట్స్, బ్రెండన్ మెక్‌కలమ్, రమీజ్ రాజా తదితరులు సభ్యులుగా ఉన్నారు.