Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, పాకిస్థాన్ హై ఓల్టేజ్ పోరు కోసం అభిమానులు ఏండ్ల తరబడి ఎదురుచూస్తారు. అలాంటిది, వారం వ్యవధిలో రెండు సార్లు తలపడితే ఆ మజానే వేరు!. ఆసియా కప్ సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ నేడు మరోసారి ఢకొీట్టనున్నాయి. అంచనాలు ఆకాశాన్ని తాకితే.. ఆటగాళ్ల ప్రదర్శన అందుకు భిన్నంగా ఉండేది!. ప్రత్యేకించి భారత్ ఆధిపత్యంతో దాయాదుల పోరు అంచనాలను అందుకోలేకపోయేది!. కానీ పాకిస్థాన్ సైతం సవాల్ విసరటంతో సమరం రక్తికడుతోంది. ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు గొప్పగా ఆస్వాదించగా.. ఇరు జట్ల ఉత్సాహం చూస్తుంటే నేడు దుబాయ్‌లో మరో ధనాధన్ ఊరిస్తోందని చెప్పవచ్చు!!.
- సూపర్4లో భారత్, పాక్ ఢ నేడు
- ఊరిస్తోన్న మరో ఉత్కంఠ పోరు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-దుబాయ్:భారత్, పాకిస్థాన్ ఎప్పుడు తలపడినా అది తుది సమరాన్ని తలపిస్తుంది. పొరుగు దేశాలు అత్యంత అరుదుగా వరుసగా రెండో ఆదివారం పోరుకు సై అంటున్నాయి. గ్రూప్ దశలో మ్యాచ్ అత్యంత ఉత్కంఠకు దారితీసింది. సూపర్ 4 మ్యాచ్‌కు ముందు భారత్, పాకిస్థాన్ మధ్య అంతరం లేదనే విషయం స్పష్టమైంది. గ్రూప్-ఏలో మరో జట్టు హాంగ్‌కాంగ్‌ను పాకిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించగా.. భారత్ మాత్రం ఆ జట్టుపై సంతృప్తికర విజయం నమోదు చేయలేదు. వరుసగా రెండు విజయాలు, పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డుతో టీమ్ ఇండియా నేటి మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశ మ్యాచ్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బాబర్ సేన సైతం సిద్ధమవుతోంది. ఇరు వైపులా మ్యాచ్ విన్నర్లు, ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాళ్లకు కొదవ లేదు. ధనాధన్ ఫార్మాట్లో నరాలు తెగే ఉత్కంఠ పోరు ఊరిస్తోండగా.. దుబారు వాతావరణం ఆటగాళ్లకు సవాల్ విసురుతోంది. ఆసియా కప్ సూపర్ 4లో భారత్, పాకిస్థాన్ పోరు నేడు.
విరాట్ రాణించేనా?!
ఆసియా కప్‌లో పరుగుల వేట సాగించి విమర్శలకు సమాధానంతో పాటు జట్టు మేనేజ్మెంట్కు సంతోషం అందిస్తాడని అనుకుంటే.. సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ వీడేందుకు ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. పాక్‌తో తొలి మ్యాచ్‌లో పరుగులు చేసినా, హాంగ్‌కాంగ్‌పై అజేయ అర్థ సెంచరీ బాదినా విరాట్ కోహ్లి ఫామ్‌లోకి రాలేకపోయాడు. కీలక సూపర్ 4 దశ మ్యాచుల ప్రాధాన్యతకు తోడు ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమీపిస్తుండటం భారత్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు జట్టులో యువ ఆటగాళ్లు భయమెరుగని బ్రాండ్ క్రికెట్‌తో రెచ్చిపోతుండగా, విరాట్ కోహ్లి బంతికో పరుగు కోసం తంటాలు పడుతున్నాడు. టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియా వ్యూహం మార్చుకుంది. స్ట్రయిక్‌రేట్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎక్కువ పరుగులు చేయటం కంటే.. తక్కువ బంతుల్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయటంపై ఫోకస్ చేస్తోంది. కొత్త వ్యూహంలో ఇమడటం కోహ్లికి అనివార్యం. కోహ్లితో పాటు కెఎల్ రాహుల్ ఆట విమర్శలకు తావిస్తోంది. హాంగ్‌కాంగ్‌పై అతడి ఇన్నింగ్స్ నెట్టింట్లో విమర్శల పాలైంది. కీలక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్, రాహుల్ రాణిస్తే భారత్ బ్యాటింగ్ లైనప్ గాడిలో పడినట్టే. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య సూపర్ ఫామ్‌లో కొనసాగుతుండగా.. వికెట్ కీపర్ బెర్త్ రేసులో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ పోటీపడుతున్నారు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో దూరం కావటం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ. జడేజా స్థానంలో దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లలో ఒకరు తుది జట్టులో నిలువనున్నారు. పేస్ విభాగంలో భారత్‌కు పెద్దగా ఆప్షన్లు లేవు. భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వెంద్ర చాహల్ తుది జట్టులో కొనసాగినా.. మాయజాల ప్రదర్శనకు అతడు సిద్ధమవ్వాలి.
మిడిల్ సమస్య!
పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యతో ఇబ్బందులు పడుతోంది. పాకిస్థాన్ పరుగుల వేటలో టాప్-3 బ్యాటర్లు జోరుమీదున్నారు. ఫకర్ జమాన్, బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్‌లు ఫామ్‌లో ఉన్నారు. బాబర్ ఆజాం గ్రూప్ దశ మ్యాచుల్లో నిరాశపరిచాడు. పరుగుల దాహంతో ఉన్న బాబర్‌ను నిలువరించటం కష్టమే. మహ్మద్ రిజ్వాన్ వరుస మ్యాచుల్లో చెలరేగాడు. భారత్‌కు మరోసారి ఈ ముగ్గురు బ్యాటర్లు సవాల్ విసరనున్నారు. ఇఫ్తీకార్ అహ్మద్ మినహా మిడిల్ ఆర్డర్లో ఎవరికీ పెద్దగా అనుభవం లేదు. ఆ లోటు భారత్‌తో తొలి మ్యాచ్‌లో స్పష్టంగా బయటపడింది. ఖుష్దిల్ అహ్మద్, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీలు బ్యాట్‌తో బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో షాన్వాజ్ దహని గాయంతో దూరమయ్యాడు. నసీం షా, హరీశ్ రవూఫ్లకు తోడుగా హసన్ అలీ పేస్ బాధ్యత తీసుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లు షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌లు బౌలింగ్ ప్రణాళికల్లో కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం
దుబాయ్ పిచ్ సూపర్ 4 దశలో కాస్త భిన్నంగా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ పలు మ్యాచులు జరుగటంతో పేసర్లతో పాటు ఇక నుంచి స్పిన్నర్లకు మంచి సహకారం లభించనుంది. మంచు ప్రభావం నేటి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దీపక్ హుడా/అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, యుజ్వెంద్ర చాహల్.
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజాం (కెప్టెన్), ఫకర్ జమాన్, ఇఫ్తీకార్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీశ్ రవూఫ్, నషీం షా, హసన్ అలీ.