Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-పాక్, అఫ్గాన్ మ్యాచ్‌లో పోకిరిల గోల
దుబాయ్ : జెంటిల్మెన్ ఆటలో హూలిగన్లు (పోకిరిలు) ప్రవేశం!. మైదానంలో ఆటగాళ్లతో పాటు స్టాండ్స్‌లో అభిమానులు సైతం క్రీడా స్ఫూర్తితో మెలగటంలో క్రికెట్‌కు మంచి పేరుంది. ఆసియా కప్ సూపర్4లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మ్యాచ్ చూస్తే ఆ అభిప్రాయం ఏమాత్రం కలుగదు. యూరోప్‌లో ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఎక్కువగా కనిపించే హూలిగన్లు.. ఆసియా కప్‌లో షార్జా స్టేడియంలో సైతం దర్శనమిచ్చారు!. మైదానంలో అఫ్గాన్ ఆటగాడు ఫరీద్ అహ్మద్, పాక్ ఆటగాడు అసిఫ్ అలీ స్థాయి మరిచి ప్రవర్తించగా.. అదే తరహా తుంటరితనం అభిమానుల ప్రవర్తనలోనూ ప్రతిబింబించింది. ఆఖరు ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠగా సాగిన పాక్, అఫ్గాన్ మ్యాచ్‌లో పాక్ ఉద్విగ విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఇరు దేశాల అభిమానుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొనగా.. కొందరు దురభిమానులు షార్జా స్టేడియంలో కుర్చీలను విరగ్గొట్టారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన అసిఫ్ అలీపై నిషేధం విధించాలని అఫ్గాన్ అభిమానులు డిమాండ్ చేస్తుండగా.. అఫ్గాన్ అభిమానులపై చర్య తీసుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆసియా దేశాలు అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక నడుమ మ్యాచులు కొంతకాలంగా అభిమానులు, ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్న సంగతి తెలిసిందే.