Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 61 బంతుల్లో 122 బాదిన కోహ్లి
- రాణించిన కెఎల్ రాహుల్, పంత్
- అఫ్గాన్‌పై భారత్ ఊరట విజయం
నవంబర్ 23, 2019. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్. బంగ్లాదేశ్‌తో గులాబీ టెస్టు. విరాట్ కోహ్లి చివరగా శతకం సాధించిన రోజు అది. అక్కడ్నుంచి 1019 రోజులుగా సూపర్‌స్టార్ శతకం కోసం నిరీక్షించాడు. ఇక విరాట్ పనైపోయింది, అతడు టీ20 జట్టులో తగిన ఆటగాడు కాదనే వ్యాఖ్యలూ వినిపించాయి. ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించాలనే వాదన సైతం మొదలైంది. విమర్శకులకు తొలిసారి విరాట్ సమాధానం చెప్పాల్సిన దుస్థితి చవిచూశాడు, అంతిమంగా ఆ బదులు బ్యాట్‌తోనే వచ్చింది. 61 బంతుల్లో 122 పరుగులతో విరాట్ కోహ్లి శతక విన్యాసం చేశాడు. డజను ఫోర్లు, అర డజను సిక్సర్లతో విశ్వరూపం చూపించిన సూపర్‌స్టార్ ఎట్టకేలకు శతక దాహం తీర్చుకున్నాడు. టీ20 కెరీర్లో తొలి, ఓవరాల్‌గా కెరీర్ 71వ శతకంతో ఎనిమిది దిక్కులు ప్రతిధ్వనించే శతక గర్జిన చేశాడు. ఆసియా కప్ నుంచి నిష్క్రమించిన భారత్‌కు విరాట్ కోహ్లి వంద నాదం అసలైన ఊరట!.
విరాట్ కోహ్లి (122 నాటౌట్, 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) విశ్వరూపం చూపించాడు. సుమారు మూడేండ్లుగా ఎదురుచూస్తున్న కెరీర్ 71వ శతకాన్ని అందుకున్నాడు. విరాట్ కోహ్లి శతకానికి తోడు కెఎల్ రాహుల్ (62, 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించటంతో అఫ్గనిస్థాన్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్ (5/4) కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేయగా ఛేదనలో అఫ్గనిస్థాన్ 111/8 పరుగులకే పరిమితమైంది. 101 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించని డిఫెండింగ్ చాంపియన్.. అఫ్గాన్‌పై ఊరట విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
విరాట పర్వం : టాస్ ఓడిన భారత్ మరోసారి తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోగా.. తాత్కాలిక కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభించాడు. పరుగుల వేటను నెమ్మదిగా మొదలెట్టిన కోహ్లి.. ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ గేర్ మార్చాడు. ఆరంభంలో 5 బంతుల్లో 2 పరుగులే చేసినా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఫరూకీపై ఫ్లిక్ షాట్‌తో షార్ట్ ఫైన్ లెగ్‌లో బౌండరీ బాది వేట షురూ చేశాడు. ముజీబ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో కోహ్లి దూకుడు అందుకున్నాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన కోహ్లి ఇక ఎక్కడా ఆగలేదు. 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కోహ్లి.. ఆ తర్వాతే విశ్వ రూపం చూపించాడు. ఓ దశలో 40 బంతుల్లో 59 పరుగులే చేసిన కోహ్లి.. ఇన్నింగ్స్‌లో తర్వాతి 63 పరుగులను కేవలం 21 బంతుల్లోనే పిండుకున్నాడు. 53 బంతుల్లో పొట్టి ఫార్మాట్లో కెరీర్ తొలి శతకం అందుకున్నాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా తొలి మూడు బంతులను 6, 6, 4గా మలిచిన విరాట్ కోహ్లి ఔరా అనిపించాడు. అంతకముందు, ఇన్నింగ్స్ 19వ ఓవర్లోనూ విరాట్ ఫోర్, సిక్సర్‌తో చెలరేగాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. 200 స్ట్రయిక్‌రేట్‌తో మెగా ఇన్నింగ్స్ ఆడటం విశేషం. ఇక మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (62), రిషబ్ పంత్ (20 నాటౌట్) సైతం రాణించారు. కెఎల్ రాహుల్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న పంత్ ఎక్కువగా కోహ్లి స్ట్రయిక్ రొటేషన్ చేశాడు. తనదైన శైలిలో మూడు ఫోర్లు బాదాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ (2/57) రెండు వికెట్లు తీసుకున్నాడు.
భువి బూమ్! : పాక్, శ్రీలంకపై పస లేని బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ (5/4) కెరీర్ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్.. 6.5 ఓవర్లలోనే 21/6తో అఫ్గాన్‌ను పతనాన్ని శాసించాడు. ఒకే స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన భువనేశ్వర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. పది ఓవర్లైనా నిలుస్తారా? అనుకున్న దశలో ఇబ్రహీం జద్రాన్ (64 నాటౌట్, 59 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో ఆశల్లేని మ్యాచ్‌లో అఫ్గాన్‌కు ఆలౌట్ ప్రమాదం నుంచి ఆదుకున్నాడు. చివర్లో రషీద్ ఖాన్ (15), ముజీబ్ (18)లు ఇబ్రహీం తర్వాత అత్యధిక స్కోరు సాధించారు.
గత రెండున్నర ఏండ్ల కాలం నాకెంతో నేర్పింది. ఈ ఫార్మాట్లో శతకం సాధిస్తానని నేనూ ఊహించలేదు. ఈ శతకం ఎన్నో అంశాల సమ్మిళితం. జట్టు ఎంతగానో మద్దతుగా నిలిచింది. మైదానం వెలుపలా ఎన్నో విషయాలు జరిగాయి. నేను ఇక్కడ ఇలా నిలబడేందుకు ఓ వ్యక్తి కృషి దాగి ఉంది. ఆమె నా భార్య అనుష్క. అందుకే శతకానందంలో పెళ్లి ఉంగరం ముద్డాడాను. ఈ సెంచరీ నా భార్య అనుష్క, కూతురు వామికలకు అంకితం. ఆరు వారాల విరామం ఆస్వాదించాను. నేను ఎంత అలసిపోయాననే సంగతి అవగతమైంది. పోటీతత్వ క్రికెట్లో విరామాలు కుదరవు, కానీ ఈ విరామం నేను మళ్లీ ఆటను ఆస్వాదించేందుకు తోడ్పడింది'
- విరాట్ కోహ్లి
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) నజీబుల్లా (బి) ఫరీద్ అహ్మద్ 62, విరాట్ కోహ్లి నాటౌట్ 122, సూర్యకుమార్ (బి) ఫరీద్ అహ్మద్ 6, రిషబ్ పంత్ నాటౌట్ 20, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (20 ఓవర్లలో 2 వికెట్లకు) 212.
వికెట్ల పతనం : 1-119, 2-125,
బౌలింగ్ : ఫజల్హాక్ ఫరూకీ 4-0-51-0, ముజీబ్ రెహమాన్ 4-0-29-0, ఫరీద్ అహ్మద్ 4-0-57-2, రషీద్ ఖాన్ 4-0-33-0, మహ్మద్ నబి 3-0-34-0, అజ్మతుల్లా ఒమర్జారు 1-0-8-0.
అఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ : హజ్రతుల్లా (ఎల్బీ) భువనేశ్వర్ 0, రెహ్మనుల్లా (బి) భువనేశ్వర్ 0, ఇబ్రహీం నాటౌట్ 64, కరీం (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2, నజీబుల్లా (ఎల్బీ) భువనేశ్వర్ 0, నబి (ఎల్బీ) అర్షదీప్ 7, అజ్మతుల్లా (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 1, రషీద్ ఖాన్ (సి) అక్షర్ (బి) హుడా 15, ముజీబ్ (బి) అశ్విన్ 18, ఫరీద్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం :(20 ఓవర్లలో 8 వికెట్లకు) 111.
వికెట్ల పతనం : 1-0, 2-1, 3-9, 4-9, 5-20, 6-21, 7-54, 8-87.
బౌలింగ్ : భువనేశ్వర్ 4-1-4-5, దీపక్ 4-0-28-0, అర్షదీప్ 2-0-7-1, అక్షర్ 4-0-24-0, అశ్విన్ 4-0-27-1, హుడా 1-0-3-1, కార్తీక్ 1-0-18-0.