Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిక్సర్లు బాదటంపై విరాట్ కోహ్లి వ్యాఖ్యలు
దుబాయ్ : సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి 1019 రోజుల విరామానికి తెరదించుతూ శతక దాహం తీర్చుకున్నాడు. 12 ఫోర్లు, 6 సిక్సర్లతో సునామీ సృష్టించిన విరాట్ కోహ్లి అజేయంగా 122 పరుగులు పిండుకున్నాడు. రెండున్నరేండ్లుగా శతకం కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లి.. అనూహ్యంగా ఆసియా కప్‌లో అఫ్గనిస్థాన్‌పై మూడెంకల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. సహజశైలిలో ఒక్క ఇన్నింగ్స్‌తో శతకం, ఫామ్, వేగం, స్ట్రయిక్‌రేట్.. ఇలా అన్ని విమర్శలకు విరాట్ కోహ్లి బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. అఫ్గనిస్థాన్‌పై అజేయ శతకం సాధించిన అనంతరం విరాట్ కోహ్లిని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూ చేశాడు. రోహిత్‌తో విరాట్ పంచుకున్న విషయాలు ఇవిగో..
' 13-14 ఏండ్ల నా కెరీర్లో తొలిసారి ఆరు వారాల పాటు బ్యాట్ ముట్టుకోలేదు. పునరాగమనంలో చాలా విషయాలు నా దృష్టికోణం నుంచి చూడగలిగాను. కెప్టెన్, మేనేజ్మెంట్ నుంచి నా బాధ్యతలపై స్పష్టత వచ్చింది. అదే నేను నాలా బ్యాటింగ్ చేసేందుకు దోహదం చేసింది. అదే ముఖ్యమైన విషయం. కెప్టెన్, కోచ్‌ల నుంచి లభించిన ఈ స్పష్టతతో రిలాక్స్ కాగలిగాను. జట్టుకు నా వంతు తోడ్పాటు అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూశాను. ఇలా ఆడటం చాలా ముఖ్యం. ఇప్పుడే వరల్డ్‌కప్‌లో జట్టుకు ఇంకా ఎక్కువ ఉపయోగపడగలను.
4 రోజుల క్రితం రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడాను. ప్రత్యేకించి తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు మిడిల్ ఓవర్లలో నా స్ట్రయిక్‌రేట్ మెరుగుపర్చుకోవాలి. పురోగతి ఏది అవసరమైనా చేసేందుకు సిద్ధమయ్యాను. నిజాయితీగా చెబుతున్నా, ఈ ఫార్మాట్లో శతకం ఆశించలేదు. ఎవరూ టీ20ల్లో నా నుంచి సెంచరీ అంచనా వేయలేదని నువ్వూ (రోహిత్) అన్నావు. నేను ఆశ్చర్యపోయాను. నా లక్ష్యం మూడు ఫార్మాట్లలో ఆడటం. సిక్సర్లు కొట్టడం నా బలం కాదనే ఆలోచనతోనే ఏ టోర్నీ, సిరీస్‌కైనా సిద్దమవుతాను. పరిస్థితులకు అనుగుణంగా సిక్సర్లు బాదగలను, కానీ నా బలం ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీలు సాధించటం. నేను బౌండరీలు కొట్టగలినంత కాలం స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లగలను. 10-15 బంతులు ఆడితే.. ఆ తర్వాత వేగం పెంచగలను. నా సహజ శైలి ఆటకు ఇన్నాండ్లు దూరంగా ఉన్నాను. ఎందుకంటే, నా ఆటలో లేని దానికోసం.. ఎంతగానో ప్రయత్నించాను' అని విరాట్ కోహ్లి అన్నాడు.