Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత జట్టులో కొత్త సమస్యలు ొవరల్డ్కప్కు ముందు ఆందోళనకరం
ఆసియా కప్‌లో హ్యాట్రిక్ టైటిళ్లు కొట్టేందుకు యుఏఈలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. తుది సమరానికి ముందే స్వదేశానికి చేరుకుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన భారత్.. తాజాగా ఆసియా కప్‌లోనూ అటువంటి ప్రదర్శనే పునరావృతం చేసింది. యుఏఈ గడ్డపై వరుసగా రెండు మెగా టోర్నీల్లో నాకౌట్ దశకు చేరుకోలేని టీమ్ ఇండియా.. వచ్చే నెలలో ఆరంభం కానున్న 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఎలా ఆశించగలదు?!
నవతెలంగాణ క్రీడావిభాగం
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ వైఫల్యం నుంచి టీమ్ ఇండియా పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించటం లేదు. జట్టు ఎంపికలో గెలుపు గుర్రాలకు చోటు, వ్యూహ చతురతలో ఎం.ఎస్ ధోని అండ లభించినా ప్రపంచకప్‌లో గ్రూప్ దశ దాటలేదు. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ శైలి పూర్తిగా మారింది. మిడిల్ ఓవర్లలో సైతం దండిగా పరుగులు పిండుకునే ప్రణాళిక పక్కాగా అమలు చేశారు. ఆసియా కప్‌కు ముందు చేసిన ప్రయోగాలు అన్ని భారత్‌కు ఫలితాల్ని అందించాయి. కానీ, ఆసియా కప్‌లో ఏ ప్రణాళిక కలిసిరాలేదు. అందుకు ఓ కారణం, ఒత్తిడితో కూడుకున్న మ్యాచుల్లో టీమ్ ఇండియా తీసికట్టు ప్రదర్శన. రెండోది, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ప్రధాన ఆటగాళ్లు కలిసి ఎప్పుడూ ఆడలేదు. రిజర్వ్ ఆటగాళ్లతో సక్సెస్ సాధించిన జట్టు మేనేజ్మెంట్, కీలక ఆటగాళ్లతో అవే ఫలితాలను సాధించలేకపోయింది. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టు కూర్పు, ప్రణాళికలపై ఆసియా కప్ ఓ రిహార్సల్‌గా పని చేస్తుందని జట్టు భావించింది. ప్రపంచకప్ వ్యూహలకు సమాధానాలు ఇవ్వటం అటుంచి, వరల్డ్‌కప్‌కు ముందు కొత్త సమస్యలను ఆసియా కప్ తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచ క్రికెట్ అగ్రజట్టుగా కొనసాగుతూ వరుసగా మెగా టోర్నీల్లో నాకౌట్‌కు చేరకుండానే నిష్క్రమించటం చిన్న విషయం కాదు. జట్టు మేనేజ్మెంట్కు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్ రూపంలో మరో రెండు అవకాశాలు ముందున్నాయి. స్వదేశీ సిరీస్‌ల్లోనైనా టీమ్ ఇండియా ఈ సమస్యలను బదులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
టాప్-3 తిప్పలు
భారత జట్టు ప్రధాన బలం టాప్-3. 2019 వన్డే వరల్డ్‌కప్‌తో ఆ బలం కాస్త సమస్యలకు దారితీసింది!. రోహిత్, ధావన్, విరాట్లతో కూడిన టాప్-3 బ్యాటింగ్ లైనప్ భారత ఇన్నింగ్స్‌లో అధిక శాతం పరుగులు బాదేసేది. కానీ ప్రస్తుత టాప్-3 రోహిత్, రాహుల్, విరాట్లు నిలకడ లేని ప్రదర్శనతో జట్టును సమస్యల్లోకి నెడుతున్నారు. కెఎల్ రాహుల్ పవర్ ప్లేలో ఎదురుదాడి చేయడానికి బదులు, వికెట్ కాపాడుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇక విరాట్ కోహ్లి స్ట్రయిక్‌రేట్ జట్టు స్కోరుపై ప్రభావం చూపుతోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ఎప్పుడైనా గేర్ మార్చగలరు. కానీ సమస్య రాహుల్‌తోనే వస్తోంది. సంప్రదాయ ఆట తీరుతో రాహుల్ జట్టుకు తీరని అన్యాయం చేస్తున్నాడు. ఇక సూర్యకుమార్ యాదవ్‌ను టాప్-3లో ఆడించాలనే ఆలోచన సైతం ఉదయిస్తోంది. రోహిత్, విరాట్ ఓపెనర్లుగా.. సూర్యకుమార్‌ను నం.3 బ్యాటర్‌గా సూచిస్తున్నారు. తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టే బ్యాటర్ సూర్యకుమార్. ఆధునిక టీ20ల్లో ఏ జట్టు వదులుకోలేని విలువైన బ్యాటర్ సూర్యకుమార్. 10-15 బంతులు క్రీజులో ఉంటే పరుగుల వేటలో వేగం పెంచగల సత్తా విరాట్ సొంతం. అందులో ఎటువంటి అనుమానం లేదు. 300 బంతుల వన్డేకు అది సరిపోతుంది కానీ, 120 బంతుల టీ20 ఫార్మాట్లో 15 బంతులు చాలా పెద్ద విషయం. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రోహిత్, రాహుల్, విరాట్లతో కూడిన టాప్-3 వెనక్కి లాగింది. ఇప్పుడు మరో వరల్డ్‌కప్‌లో ఆ టాప్-3తోనే ముందుకెళ్లి అదే ఫలితాన్ని అక్కున చేర్చుకోవటం తెలివైన నిర్ణయం అవుతుందా?!.
తేలని.. మిడిల్ ఆర్డర్
మిడిల్ ఆర్డర్‌కు సంబంధించి ఆసియా కప్ ఓ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌లలో ఉపయుక్తమైన బ్యాటర్ ఎవరనే అంశంలో స్పష్టత లేదు. ఇన్నింగ్స్ చివర్లో 15 బంతుల ధనాధన్ షో స్పెషలిస్ట్ దినేశ్ కార్తీక్. నం.4 నుంచి నం.6 వరకు మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రయోగించగల ఆయుధం రిషబ్ పంత్. ఆసియా కప్‌లో మూడు మ్యాచుల్లో ఆడిన దినేశ్ కార్తీక్ పది బంతులే ఎదుర్కొన్నాడు. ఈ గణాంకాలు అతడి పాత్రను తేల్చలేవు. ఇక రిషబ్ పంత్ సైతం స్పష్టమైన పాత్ర పోషించలేదు. టెస్టుల్లో ధనాధన్ షో చూపించే రిషబ్ పంత్.. ధనాధన్ ఫార్మాట్లో ఆ జోరు చూపించేందుకు అసౌకర్యంగా కనిపిస్తున్నాడు. దీపక్ హుడా, సంజు శాంసన్‌లను పరీక్షించేందుకు మిడిల్ ఆర్డర్ ఇంకా ఓపెన్‌గానే కనిపిస్తోంది.
పస లేని పేస్!
ఆసియా కప్‌లో సగటు అభిమానిని సైతం వేధించిన ప్రశ్న.. నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉండగా, పస లేని పేసర్లను ఎందుకు జట్టులోకి తీసుకున్నారు?!. ఇటీవల కాలంలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటిస్తుందే కానీ, ఎవరిని ఎందుకు తీసుకుందనే విషయం చెప్పేందుకు మీడియా ముందుకు రావటం లేదు. స్టాండ్‌బైగా దీపక్ చాహర్, స్వదేశంలో మహ్మద్ షమి అందుబాటులో ఉండగా అవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అంతుచిక్కని ప్రశ్న. అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో అసమాన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయినా, మహ్మద్ షమి వంటి వరల్డ్ క్లాస్ పేసర్‌ను జట్టులోకి తీసుకోవాల్సింది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. ఆ ప్రభావం రోహిత్ శర్మ బౌలింగ్ ప్రణాళికలు తేలిపోయేందుకు దోహదం చేసింది. జట్టులోని ఏకైక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పవర్‌ప్లేలో అదరగొట్టినా.. వరుసగా పాక్, శ్రీలంకపై 19వ ఓవర్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అంతిమంగా, జట్టు ఓటమికి దారితీసింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌కు మహ్మద్ షమి, హర్షల్ పటేల్‌లను జట్టులోకి తీసుకుంటేనే పేస్ బలం మెరుగవగలదు.