Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ కొత్త చాంపియన్‌ను చూడనుంది. మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో ఫెదరర్, నాదల్, జకోవిచ్ అధిపత్యం నడుమ కొత్త ఆటగాళ్లు ఎవరూ న్యూయార్క్‌లో గ్రాండ్‌స్లామ్ అందుకునే సాహాసం చేయలేదు. యువ సంచలనాలు కారెన్ కచనోవ్, కాస్పర్ రూడ్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. యుఎస్ ఓపెన్ నయా సంచలనం, అమెరికా మెరుపు ఫ్రాన్సెస్ తియాఫోకు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. కార్లోస్ అల్కరాజ్ చేతిలో తియాఫోకు భంగపాటు తప్పలేదు. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఇగా స్వైటెక్, ఒన్స్ జాబెర్లు భారత కాలమానం ప్రకారం నేడు అర్థరాత్రి టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నారు.
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
- ఫైనల్లో అల్కరాజ్ గార్ఫియా
- కచకోవ్పై కాస్పర్ రూడ్ గెలుపు
నవతెలంగాణ-న్యూయార్క్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో సంచలనాల మోత మోగుతోంది. మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరేట్, స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ నిష్క్రమణతో మొదలైన సంచలనాల పరంపర శనివారం సెమీఫైనల్లోనూ కొనసాగింది. అమెరికా యువ సంచలనం, నాదల్కు షాకిచ్చిన ఫ్రాన్సెస్ తియాఫో ఫైనల్స్‌కు చేరకుండానే నిష్క్రమించాడు. స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ చేతిలో ఫ్రాన్సెస్ తియాఫో భంగపాటుకు గురయ్యాడు. ఐదు సెట్ల పాటు ఉత్కంఠగా సాగిన సెమీస్ పోరులో తియాఫో ఓటమి చెందాడు. మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కారెన్ కచనోవ్‌పై నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ విజయం సాధించాడు. నాలుగు సెట్ల పోరులో రూడ్ గెలుపొందాడు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి అనంతరం) జరిగే మెన్స్ సింగిల్స్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌తో కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా టైటిల్ కోసం పోటీపడనున్నారు.
మారథాన్ ఫైట్! : పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ గార్ఫియా (స్పెయిన్), ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) మారథాన్ మ్యాచ్‌లో తలపడ్డారు. మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్తో ఐదు సెట్ల మ్యాచ్‌లో పోటీపడిన ఫ్రాన్సెస్ తియాఫో.. యుఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. 6-7(6-8), 6-3, 6-1, 6-7(5-7), 6-3తో ఐదు సెట్ల పోరులో కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. 22వ సీడ్ ఫ్రాన్సెస్ తియాఫో టైబ్రేకర్‌లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నా.. ఆ జోరు తర్వాతి సెట్లలో కొనసాగించలేదు. ఉత్కంఠగా సాగిన తొలి సెట్‌ను టైబ్రేకర్‌ను 8-6తో గెల్చుకున్న తియాఫో.. వరుసగా రెండు సెట్లను 3-6, 1-6తో కోల్పోయాడు. ఫ్రాన్సెస్ తియాఫో ఏస్‌లతో చెలరేగినా.. అల్కరాజ్ బ్రేక్ పాయింట్లతో విరుచుకుపడ్డాడు. ఫ్రాన్సెస్ సర్వ్‌ను విజయవంతంగా బ్రేక్ చేశాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో నాల్గో సెట్‌ను మరోసారి టైబ్రేకర్‌లో గెల్చుకున్న తియాఫో.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక ఐదో సెట్‌కు తీసుకెళ్లాడు. అల్కరాజ్ గార్ఫియా ఐదో సెట్‌ను 6-3తో గెల్చుకుని ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కార్లోస్ అల్కరాజ్ 6 ఏస్‌లు కొట్టగా.. తియాఫో 15 ఏస్‌లు సంధించాడు. అల్కరాజ్ మూడు డబుల్ ఫాల్ట్స్ చేయగా.. ఫ్రాన్సెస్ ఆరు డబుల్ ఫాల్ట్స్‌కు పాల్పడ్డాడు. అల్కరాజ్ 9 బ్రేక్ పాయింట్లతో సత్తా చాటగా.. తియాఫో మూడు బ్రేక్ పాయింట్లే సాధించాడు. పాయింట్ల పరంగా 171-142తో అల్కరాజ్ ఆధిపత్యం నిరూపించుకున్నాడు. అల్కరాజ్ 30 గేములు గెల్చుకోగా.. తియాఫో 21 గేములే నెగ్గాడు. టైబ్రేకర్‌లో రెండు సెట్లు నెగ్గిన తియాఫో.. మిగతా మూడు సెట్లలో అల్కరాజ్కు పోటీ ఇవ్వలేకపోయాడు.
మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కారెన్ కచనోవ్‌పై కాస్పర్ రూడ్ (నార్వే) పైచేయి సాధించాడు. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో చేజార్చుకున్న కచనోవ్.. తర్వాతి సెట్లలో ఆశించిన ప్రతిఘటన చేయలేదు. 7-6(7-5), 6-2, 5-7, 6-2తో కాస్పర్ రూడ్ సెమీఫైనల్లో మెరుపు విజయం నమోదు చేశాడు. కారెన్ కచనోవ్ పదహారు ఏస్‌లు కొట్టగా, కాస్పర్ రూడ్ 10 ఏస్‌లు సంధించాడు. కచనోవ్ మూడు డబుల్ ఫాల్ట్స్ చేయగా, కాస్పర్ రూడ్ ఒక్క డబుల్ ఫాల్ట్తోనే సరిపెట్టాడు. కాస్పర్ రూడ్ 6 బ్రేక్ పాయింట్లతో మ్యాచ్‌పై పట్టు బిగించాడు. కారెన్ కచనోవ్ మూడు బ్రేక్ పాయింట్లు మాత్రమే సాధించాడు. పాయింట్ల పరంగా 128-104తో కాస్పర్ రూడ్ స్పష్టమైన ఆధిపత్యం సాధించాడు. సొంత సర్వ్‌లో కచనోవ్ 14 గేములు గెలుపొందగా.. కాస్పర్ రూడ్ ఏకంగా 17 గేములు సాధించాడు.