Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ టైటిల్ పోరు నేడు
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-దుబాయ్
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభ దుస్థితిలో దేశం. పూర్వ వైభవం కోల్పోయిన జాతీయ జట్టు. ఎటు చూసినా, నిరాశే. ఇటువంటి తరుణంలో సమిష్టి తత్వంతో జట్టుగా రాణించిన లంకేయులు వరుసగా అద్వితీయ విజయాలతో ఆసియా కప్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. గడ్డు కాలంలో ఆ దేశ ప్రజల మోముల్లో చిరునవ్వుకు ఓ కారణం చూపేందుకు శనక సేన నేడు బరిలోకి దిగుతోంది. అదే ఆసియా కప్ ఫైనల్లో లంకేయుల స్ఫూర్తి!. మరోవైపు, దశాబ్దకాలంగా ఆసియా కప్ కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్.. ఎలాగైనా ఈ పర్యాయం కప్ పట్టుకెళ్లాలనే తపనతో కనిపిస్తోంది. అత్యుత్తమ జట్టుగా నిరూపించుకునే క్రమంలో ఉన్న పాకిస్థాన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట ఆసియా విజేతగా నిలిచి ఆత్మవిశ్వాసం రెట్టింపు చేసుకోవాలని తపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఎదురు నిలిచిన శ్రీలంక సవాల్‌ను అధిగమించగలదా?! ఆసియా కప్ టైటిల్ పోరు నేడు.
ఊపుమీదున్న శ్రీలంక : ఆదివారం ఆసియా మెగా వార్‌కు శ్రీలంక హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. జట్టులో ఎవరూ సూపర్ స్టార్స్ లేరు. ధనాధన్ హీరోలకు అసలే ఆస్కారం లేదు. అయినా, జట్టుగా ఆడి గెలవటంలో ఆరితేరిన శ్రీలంక నేడు మానసికంగా పాకిస్థాన్‌పై పైచేయి సాధించింది. సూపర్ 4 దశలో పాకిస్థాన్‌పై విజయం సాధించిన శ్రీలంక.. సూపర్ 4లో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచింది. టాప్, మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఉత్కంఠ ఛేదనల్లో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. బౌలింగ్ విభాగం సైతం గొప్పగా రాణిస్తోంది. అండర్‌డాగ్‌గా ఆసియా కప్‌కు వచ్చిన శ్రీలంక నేడు టైటిల్ ఫేవరేట్‌గా ఫైనల్లో అడుగుపెట్టనుంది. కుశాల్ మెండిస్, నిశాంక, గుణతిలక, శనక సహా రాజపక్సలు శ్రీలంకకు కీలకం కానున్నారు. సూపర్4లో పాక్‌ను ఇరకాటంలో పడేసిన వానిందు హసరంగ, మహీశ్ తీక్షణలు ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషించనున్నారు.
కొత్తగా.. పాక్! : ఆదివారం ఆసియా కప్ ఫైనల్స్‌కు పాకిస్థాన్ కొత్త వ్యూహలు, ప్రణాళికలతో రానుంది. సూపర్4లో శ్రీలంక చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. చివరగా 2012లో ఆసియా కప్ విజయం అందుకున్న పాకిస్థాన్.. దశాబ్ద కాలం అనంతరం మరోసారి ఆసియా ట్రోఫీకి ముద్దు పెట్టేందుకు ఎదురుచూస్తోంది. టోర్నీలో నిరాశపరిచిన బాబర్ ఆజామ్.. నేడు ఫైనల్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అదరగొట్టే అవకాశం లేకపోలేదు. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌పై పాక్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఫకర్ జమాన్, రిజ్వాన్‌లు మెరిస్తే ఆ జట్టు బ్యాటింగ్ కష్టాలు తీరినట్టే. లోయర్ ఆర్డర్లో అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ ప్రధానం కానున్నారు. పేసర్లు నషీం షా, హరీశ్ రవూఫ్, మహ్మద్ హస్నైన్‌లు పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్లు శ్రీలంకను మాయలో పడేందుకు చూస్తున్నారు.ఇక ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంకలు తలపడటం ఇది నాల్గోసారి. గతంలో మూడు సార్లు తలపడిన ఫైనల్స్‌లో ఏకంగా రెండు సార్లు శ్రీలంక విజేతగా నిలిచింది.
పిచ్, వాతావరణం : ఆసియా కప్ ఫైనల్ అధిక ఉష్ణోగ్రతల నడుమ సాగనుంది. దుబారు పిచ్ పొడిగా కనిపిస్తోంది. స్పిన్నర్లకు మంచి సహకారం లభించే అవకాశం కనిపిస్తోంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచనకు తావులేకుండా తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది. అధిక ఉష్ణోగ్రతలతో మంచు ప్రభావం కాస్త తగ్గినా.. తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇరు జట్లు ఆసక్తిగా లేవు!.
తుది జట్లు (అంచనా) :
పాకిస్థాన్ : బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకర్ జమాన్, ఇఫ్తీకార్ అహ్మద్, ఖుష్దీల్ షా, షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, నషీం షా, హరీశ్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.
శ్రీలంక : కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), పథుం నిశాంక, ధనంజయ డిసిల్వ, ధనుష్క గుణతిలక, దశున్ శనక (కెప్టెన్), భానుక రాజపక్స, చామిక కరుణరత్నె, వానిందు హసరంగ, మహీశ్ తీక్షణ, ప్రమోద్ మధుశన్, దిల్షాన్ మధుశంక.