Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది వరుసగా 37 మ్యాచుల్లో అజేయ జైత్రయాత్రకు జులైలో బ్రేక్ పడింది. అప్పట్నుంచి గెలుపోటముల్లో ఆమె రికార్డు 4-4. వరల్డ్ నం.1గా నిలిచినా, న్యూయార్క్‌లో ఎన్నడూ నాల్గో రౌండ్ దాటిందే లేదు. మహిళల సింగిల్స్ సర్క్యూట్లో సెరెనా వారసురాలిగా దూసుకొచ్చిన పొలాండ్ స్టార్ ఇగా స్వైటెక్.. దిగ్గజం వీడ్కోలు పలికిన గ్రాండ్‌స్లామ్‌లో చాంపియన్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ టైటిల్ వేటలో ట్యునిషియా చిన్నది ఒన్స్ జాబెర్‌పై వరుస సెట్లలో గెలుపొందిన స్వైటెక్ చాంపియన్‌గా అవతరించింది.
- మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం
- ఫైనల్లో నిరాశపరిచిన ఒన్స్ జాబెర్
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-న్యూయార్క్
యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చాంపియన్ 21 ఏండ్ల ఇగా స్వైటెక్. వరల్డ్ నం.1 పొలాండ్ స్టార్ ఇగా స్వైటెక్ శనివారం జరిగిన టైటిల్ పోరులో వరల్డ్ నం.5 ఒన్స్ జాబెర్‌పై వరుస సెట్లలో విజయం సాధించింది. 6-2, 7-6(7-5) మెరుపు విజయం సాధించింది. కెరీర్ తొలి యుఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌నూ దక్కించుకున్న ఇగా స్వైటెక్.. 2016 తర్వాత మహిళల సింగిల్స్ సర్క్యూట్లో ఓ సీజన్లో రెండు గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. సుమారు రెండు గంటల పాటు సాగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ట్యునిషియా చిన్నది ఒన్స్ జాబెర్ పోరాట స్ఫూర్తి కనబరిచింది. ఇగా స్వైటెక్‌కు ఓవరాల్‌గా ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావటం విశేషం.
సూపర్ స్వైటెక్ : వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్‌తో తుది పోరులో నిజానికి వరల్డ్ నం.5 ఒన్స్ జాబెర్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అందుకు కారణం, సెమీఫైనల్లో జాబెర్ విజయం సాధించిన తీరు!. సహజంగానే మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఎక్కువగా రెండు సెట్లలోనే ముగుస్తాయి!. యుఎస్ ఓపెన్ ఫైనల్లోనూ అదే పునరావృతమైంది. 111 నిమిషాల అంతిమ సమరంలో ఇగా స్వైటెక్ అదరగొట్టింది. తొలి సెట్లో స్వైటెక్ ఏకంగా 3-0 ఆధిక్యంతో మొదలెట్టింది. ఆరంభంలోనే జాబెర్ సర్వ్‌ను బ్రేక్ చేసిన స్వైటెక్ ముందంజ వేసింది. ఒత్తిడిలోనూ స్వైటెక్‌ను సర్వ్‌ను బ్రేక్ చేసిన జాబెర్ 2-3తో రేసులోకి వచ్చింది. కానీ, ఆ తర్వాత సర్వ్ నిలుపుకోవటంలో సైతం తేలిపోయిన జాబెర్ తొలి సెట్‌ను కోల్పోయింది. వరుసగా మూడు గేములు గెల్చుకున్న స్వైటెక్ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ సైతం తొలి సెట్‌ను తలపించింది. స్వీయ సర్వ్‌ను నిలుపుకున్న స్వైటెక్.. జాబెర్‌పై బ్రేక్ పాయింట్ సాధించింది. 3-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జాబెర్ సైతం స్వైటెక్ సర్వ్‌ను బ్రేక్ చేసి 2-3తో మ్యాచ్‌లో నిలిచింది. చావోరేవో తేల్చుకోవాల్సిన సెట్లో జాబెర్ పట్టు విడువలేదు. స్వైటెక్‌ను వెంబడించింది. స్వైటెక్ ముందంజ వేసినా.. వెనక్కి తగ్గలేదు. 4-4 నుంచి 6-6తో స్కోరు సమం చేసిన జాబెర్ సెట్‌ను టేబ్రేకర్కు తీసుకెళ్లింది. టైబ్రేకర్‌లో 7-5తో పైచేయి సాధించిన స్వైటెక్ వరుస సెట్లలోనే యుఎస్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడింది.
ఫైనల్లో ఇగా స్వైటెక్ ఓ ఏస్ సంధించగా, జాబెర్ ఒక్క ఏస్ కొట్టలేదు. స్వైటెక్ రెండు డబుల్ ఫాల్ట్స్ చేయగా, జాబెర్ నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేసింది. స్వైటెక్ 19 విన్నర్లు కొట్టగా, జాబెర్ 14 విన్నర్లు మాత్రమే సంధించింది. అనవసర తప్పిదాల్లో స్వైటెక్ 30 చేయగా, జాబెర్ 33 చేసింది. పాయింట్ల పరంగా 81-66తో స్వైటెక్ ఆధిపత్యం చెలాయించింది. స్వైటెక్ సొంత సర్వ్‌లో ఏడు గేములు గెలుపొందగా.. ఐదు బ్రేక్ పాయింట్లతో జాబెర్ సర్వ్‌ను బ్రేక్ చేసింది. సర్వ్‌లో ఐదు గేములే నెగ్గిన జాబెర్.. స్వైటెక్ సర్వ్‌ను మూడు సార్లు బ్రేక్ చేసింది. గేముల పరంగా స్వైటెక్ 13 నెగ్గగా, జాబెర్ 8 గేములే గెలుపొందింది.
ఈ ఆనందాన్ని ఒక్క మాటలో చెప్పలేను. నా ప్రదర్శన పట్ల గొప్పగా గర్వపడుతున్నాను. ఇది అంత సులువైన మ్యాచ్ కాదు. ఆరంభంలో ఆధిక్యంలో నిలిచినా, ఎంతో కఠినంగా అనిపించింది. నేను ఏ చేసే ఏ చిన్న తప్పునైనా జాబెర్ సద్వినియోగం చేసుకుంటదని తెలుసు. అందుకే ఎంతో జాగ్రత్తగా ఆడాను. ప్రైజ్‌మనీ నగదు రూపంలో కాకుండా చెక్‌గా ఇచ్చినందుకు సంతోషం (నవ్వుతూ)'
- ఇగా స్వైటెక్
విజేతకు రూ.20 కోట్లు
యుఎస్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వైటెక్ ప్రైజ్‌మనీ రూపంలో భారీ మొత్తం ఖాతాలో వేసుకుంది. రూ. 20.71 కోట్లు (2.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) నగదు బహుమతిగా స్వైటెక్ అందుకుంది. అంత పెద్ద మొత్తం ప్రైజ్‌మనీ అందుకుంటూ ఆశ్చర్యపోయిన స్వైటెక్.. నగదు రూపంలో ఇవ్వనందుకు సంతోషమని నవ్వులూ పూయించింది. రన్నరప్ ఒన్స్ జాబెర్ రూ. 10.35 కోట్లు (1.3 మిలియన్ అమెరికన్ డాలర్లు) దక్కించుకుంది.