Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుర్రాడే కింగ్ అయ్యాడు!. 19 ఏండ్ల స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ గార్ఫియ యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్‌తో పాటు ఏటీపీ వరల్డ్ నం.1 ర్యాంక్ ఎగరేసుకుపోయాడు. ఓపెన్ శకంలో యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన టీనేజర్‌గా దిగ్గజం పిట్ సంప్రాస్ సరసన కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో నార్వే స్టార్ కాస్పర్ రూడ్‌పై సాధికారిక విజయం సాధించిన అల్కరాజ్.. ఏటీపీ ర్యాంకింగ్స్ చరిత్రలో వరల్డ్ నం.1గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
- మెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం
- ఏటీపీ వరల్డ్ నం.1 ర్యాంక్ సొంతం
- చరిత్ర సృష్టించిన కార్లోస్ అల్కరాజ్
- ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై ఘన విజయం
- యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022
నవతెలంగాణ-న్యూయార్క్
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర ఆవిష్కితమైంది. 19 ఏండ్ల కుర్రాడు, స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ అతి పిన్న వయసులో న్యూయార్క్‌లో చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఓపెన్ శకంలో పిట్ సంప్రాస్ (1990) మినహా మరో ఆటగాడు ఈ ఘనత సాధించలేదు. కార్లోస్ అల్కరాజ్ 19 ఏండ్ల ప్రాయంలోనే గ్రాండ్‌స్లామ్ విజయంతో దిగ్గజం సరసన నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏండ్ల కాస్పర్ రూడ్ (నార్వే)పై 6-4, 2-6, 7-6(7-1), 6-3తో కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. మూడున్నర గంటల పాటు సాగిన టైటిల్ పోరులో స్పెయిన్ స్టార్ చాంపియన్‌గా అవతరించాడు. యుఎస్ ఓపెన్ టైటిల్‌తో పాటు ఏటీపీ వరల్డ్ నం.1 ర్యాంక్ కార్లోస్ అల్కరాజ్ సొంతమవగా.. రన్నరప్‌గా నిలిచిన కాస్పర్ రూడ్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నం.2తో సరిపెట్టుకున్నాడు.
స్పెయిన్ యువ బుల్! : టైటిల్ పోరుకు ముందు వరుసగా మూడు మ్యాచుల్లో ఐదు సెట్ల మ్యాచుల్లో మారథాన్ పోరాటాలు చేసిన కార్లోస్ అల్కరాజ్ గార్ఫియ.. తుది పోరులోనూ అదే పోరాటాన్ని అంచనా వేశాడు. 200 నిమిషాల మెగా పోరులో స్పెయిన్ కుర్రాడు ఐదో సెట్‌కు వెళ్లకుండానే టైటిల్‌ను ముద్దాదాడు. తొలి సెట్‌ను 6-4తో గెల్చుకున్న కార్లోస్ అల్కరాజ్, రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. ఇక టైబ్రేక్‌కు దారితీసిన మూడో సెట్లో సెట్ పాయింట్ కాచుకున్న కార్లోస్.. టైబ్రేకర్‌లో కాస్పర్ రూడ్‌కు షాకిచ్చాడు. పదునైన ఫోర్‌హ్యాండ్, కండ్లుచెదిరే లాబ్స్, నెట్ దగ్గర కట్టింగ్ వ్యాలీలతో అదరగొట్టిన కార్లోస్ అల్కరాజ్.. టైబ్రేకర్‌లో 7-1తో మెరుపు విజయం సాధించాడు. నాల్గో సెట్‌ను 6-3తో సులువుగానే సొంతం చేసుకున్న అల్కరాజ్.. యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. 23 ఏండ్ల కాస్పర్ రూడ్ సైతం ఫైనల్లో మంచి ప్రదర్శన చేశాడు. కార్లోస్ అల్కరాజ్కు గట్టి పోటీనిచ్చాడు. ఇద్దరు యువ సంచలనాల మధ్య టైటిల్ పోరు అభిమానులకు గొప్ప మజా అందించింది. ఇక ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకున్న కాస్పర్ రూడ్.. రొలాండ్ గారోస్‌లో స్పెయిన్ బుల్ నాదల్కు టైటిల్‌ను కోల్పోయాడు. కెరీర్ రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో ఆర్థర్ ఆషే స్టేడియంలో స్పెయిన్ యువ బుల్ కార్లోస్‌కు ట్రోఫీని చేజార్చుకున్నాడు.
టైటిల్ పోరులో కార్లోస్ అల్కరాజ్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అల్కరాజ్ 14 ఏస్‌లు సంధించగా, రూడ్ నాలుగు ఏస్‌లతో సరిపెట్టుకున్నాడు. అల్కరాజ్ 55 విన్నర్లతో చెలరేగగా, రూడ్ 37 విన్నర్ల వద్దే ఆగిపోయాడు. అనవసర తప్పిదాల్లో అల్కరాజ్ 41 చేయగా.. రూడ్ కేవలం 29 చేశాడు. అయినా, రూడ్‌పై కార్లోస్ పైచేయి సాధించాడు. ఓవరాల్ పాయింట్ల పరంగా 127-122తో అల్కరాజ్ ముందంజ వేశాడు. బ్రేక్ పాయింట్ల విషయంలో అటు రూడ్, ఇటు అల్కరాజ్ చెరో మూడు బ్రేక్ పాయింట్లు సాధించారు. సొంత సర్వ్‌లో కాస్పర్ రూడ్ 16 గేములు నెగ్గగా, కార్లోస్ అల్కరాజ్ 17 గేములు గెల్చుకున్నాడు. ఓవరాల్‌గా కాస్పర్ రూడ్ 19 గేములు నెగ్గగా, కార్లోస్ అల్కరాజ్ 21 గేములతో ఆధిక్యత నిరూపించుకున్నాడు.
'వరల్డ్ నం.1 నా చిన్ననాటి కల. గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచేందుకు ఎంతగానో శ్రమించాను. భావోద్వేగాలతో కూడిన క్షణంలో మాట్లాడటం అంత సులువు కాదు. ఫైనల్లో అలసటకు తావులేదు. ఐదు సెట్ల సమరానికి సైతం సిద్ధపడే కోర్టులో అడుగుపెట్టాను'
- కార్లోస్ అల్కరాజ్
1.19 ఏండ్ల కార్లోస్ అల్కరాజ్ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇది. 2005లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజయానంతరం.. ఓ స్పెయిన్ కుర్రాడు 19 ఏండ్లలోనే ఓ గ్రాండ్‌స్లామ్ అందుకోవటం ఇదే తొలిసారి.
1.ఏటీపీ ర్యాంకింగ్స్ 1973లో ప్రవేశపెట్టగా.. పిన్న వయస్కులో వరల్డ్ నం.1 నిలిచిన ఆటగాడిగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. 2003లో యుఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచి జువాన్ కార్లోస్ వరల్డ్ నం.1 ర్యాంక్ సాధించగా, ఇప్పుడు అల్కరాజ్ ఆ ఘనత అందుకున్నాడు. జువాన్ కార్లోస్ ఫెర్రెరో ప్రస్తుతం అల్కరాజ్కు కోచ్ కావటం విశేషం.