Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక
2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్, 2022 ఆసియా కప్ పరాభవాల అనంతరం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మరో మెగా ఈవెంట్‌కు భారత జట్టును ఎంపిక చేసింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును సోమవారం ప్రకటించింది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రాగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమికి స్టాండ్‌బైగానే అవకాశం లభించింది.
ముంబయి :ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్ పూర్తి స్థాయి పేస్ దళంతో వెళ్లనుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌లతో కూడిన పేస్ విభాగాన్ని బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఖరారు చేసింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరుగనున్న 2022 టీ20 ప్రపంచకప్‌కు సోమవారం భారత జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ సారథ్యంలో తొలిసారి భారత్ ఐసీసీ టైటిల్ కోసం పోటీపడనుంది.
ఊహించినట్టే..! : భారత జట్టు ఎంపికలో ఆశ్చర్యకర నిర్ణయాలు ఏమీ చోటుచేసుకోలేదు. బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌లకు తోడుగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యారు. వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ చోటు సాధించారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్య, దీపక్ హుడా, అక్షర్ పటేల్ జట్టులో నిలిచారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్‌లు చోటు దక్కించుకున్నారు. పేస్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకుని జట్టులోకి ఎంపిక కాగా.. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు బెర్త్‌లు సొంతం చేసుకున్నారు. వరుస వైఫల్యాల నుంచి సెలక్టర్లు పాఠాలు నేర్చినట్టు కనిపించటం లేదు!. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు విధ్వంసకర బ్యాటర్ సంజు శాంసన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఇక పేస్ విభాగం బలోపేతానికి సీనియర్ పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి ఎంపిక చేయలేదు. ఆసియా కప్‌లో పేసర్లతో పాటు బ్యాటర్లు సైతం అంచనాలను అందుకోలేదు. అయినా, సెలక్షన్ కమిటీ బ్యాటింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఆసియా కప్ జట్టులో ఉన్న అవేశ్ ఖాన్‌ను పక్కనపెట్టగా.. గాయంతో దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.
ప్రపంచకప్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లకు సైతం భారత జట్లను ప్రకటించారు. హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు కండిషనింగ్ సెషన్ కోసం వరల్డ్‌కప్ ముంగిట ఎన్సీఏలో శిక్షణ పొందనున్నారు. వరల్డ్‌కప్ జట్టులోని స్టాండ్‌బై ఆటగాళ్లు ఈ రెండు సిరీస్‌ల్లో ఆడనున్నారు. అక్టోబర్ 23న ప్రపంచకప్‌లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ లోపు, భారత జట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ అనుమతిస్తుంది.
టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్, అక్షర్ పటేల్, జశ్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్.
స్టాండ్‌బై : మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోరు, దీపక్ చాహర్.