Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచి, ఆసియా కప్‌లో సూపర్ 4 దశ నుంచే నిష్క్రమించిన టీమ్ ఇండియా వైఫల్యంపై బీసీసీఐ సమీక్ష చేసింది. రానున్న టీ20 ప్రపంచకప్‌లో దిద్దుబాటు చర్యలు, ప్రధానంగా వేధిస్తోన్న సమస్యలకు పరిష్కారా మార్గాలపై బోర్డు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
- ఆసియా కప్‌పై బోర్డు సమీక్ష
- పరిష్కారాలపై బీసీసీఐ ఫోకస్
ముంబయి : ఐసీసీ 2021 టీ20 ప్రపంచకప్ వైఫల్యంతో భారత జట్టు పొట్టి ఫార్మాట్లో ఆట శైలిని గణనీయంగా మార్చుకుంది. అయినా, ఆశించిన స్థాయిలో ఆ మార్పు ఉన్నట్టు కనిపించటం లేదు. ఆసియా కప్‌లో ప్రదర్శన పట్ల బీసీసీఐ సమీక్ష సమావేశం నిర్వహించినట్టు సమాచారం. సమీక్షలో ప్రధానంగా మిడిల్ ఓవర్లలో (7-15) పరుగుల వేట చర్చకు వచ్చినట్టు సమాచారం. అక్టోబర్ 16 నుంచి 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. అక్టోబర్ 23న భారత్ తొలి మ్యాచ్‌లో పొరుగు దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌లో అనుసరించాల్సిన వ్యూహం, దిద్దుబాటు చర్యలపై బీసీసీఐ పెద్దలు అడిగి తెలుసుకున్నట్టు ఓ బోర్డు అధికారి వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ జట్టు సహా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు భారత జట్లను సోమవారం బీసీసీఐ ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషాలు సెలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశమైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
'అవును, ఆసియా కప్ ప్రదర్శన చర్చకు వచ్చింది. కానీ సమస్యలపై కాకుండా, సమాధానాలపైనే చర్చ సాగింది. టీ20 ప్రపంచకప్‌లో మెరుగయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే మాట్లాడారు. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ సమస్యగా మారింది. ఇన్నింగ్స్ 7-15 ఓవర్లలో రన్‌రేట్ ఆశించినట్టు ఉండటం లేదు. జట్టు మేనేజ్మెంట్కు ఈ విషయం తెలుసు. జట్టులో వరల్డ్‌క్లాస్ ఆటగాళ్లు ఉన్నారు. కచ్చితంగా ఈ సమస్యను అధిగమించేందుకు వారు అవసరమైన అడుగులు వేస్తారు' అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ మిడిల్ ఓవర్లలో (7-15) 59 పరుగులే చేసింది. హాంగ్‌కాంగ్‌పై 9 మిడిల్ ఓవర్లలో 62 పరుగులు, పాక్‌తో సూపర్ 4 మ్యాచ్‌లో 62 పరుగులు మాత్రమే చేసింది. అఫ్గనిస్థాన్‌పై చేసిన 78 పరుగులే.. ఆసియా కప్‌లో ఈ తొమ్మిది ఓవర్లలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన.
ఇక రిషబ్ పంత్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌ను ఎంపిక చేయాలనే అంశం చర్చకు రాలేదని తెలుస్తోంది. సెలక్షన్ కమిటీ సైతం సంజు శాంసన్ పేరును పరిగణించలేదు. 'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సంజు శాంసన్ ఉంటాడు. ఎందుకంటే సెలక్షన్ కమిటీ నిలకడగా అవకాశాలు కల్పిస్తుంది. జింబాబ్వే పర్యటనలో సంజు శాంసన్ ఆడాడు. రిషబ్ పంత్‌ను తొలగించాలనే ఆలోచనే సెలక్షన్ కమిటీకి రాలేదు. టాప్ ఆర్డర్‌లోని ఏకైక ఎడమ చేతి వాటం బ్యాటర్ పంత్. తనదైన రోజున పంత్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడని' అని సదరు బీసీసీఐ అధికారి అన్నారు.