Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణకు రంగం సిద్ధమవుతోంది!. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం. లోధా కమిటీ సిఫారసుల ఫలితంగా రూపొందించిన నిబంధనలను సవరిచేందుకు అనుకూలంగా కోర్టులో వాదనలు జరిగాయి!. స్వతంత్య్ర సంస్థ బీసీసీఐ, రాజ్యాంగ సవరణ చేసుకునే వీలు కల్పించాలని సుప్రీంకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. బీసీసీఐ కేసులో నేడు ధర్మాసనం తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తోంది!.
- సుప్రీంకోర్టులో అమీకస్ క్యూరీ, సొలిసిటర్ జనరల్
- బీసీసీఐ రాజ్యాంగ సవరణకు అనుకూలంగా వాదనలు
- ధర్మాసనం నేడు తీర్పు వెలువరించే అవకాశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషనుపై సుప్రీంకోర్టు మంగళవారం వాదనలు విన్నది. వరుసగా ఆరేండ్ల పాటు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో విడివిడిగా, లేదా కలిసి పదవిలో కొనసాగితే తర్వాత మూడేండ్లు విరామం తీసుకోవాలి. క్రికెట్ పరిపాలన పదవులు చేపట్టకూడదు. ఈ నిబంధన మార్పు చేసుకునేందుకు, రాజ్యాంగ సవరణకు అనుమతి కోరుతూ బోర్డు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ డి.వై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం మంగళవారం వాదనలు విన్నది. ఈ కేసులో నేడు సైతం వాదనలు విననున్న ధర్మాసనం.. తీర్పును సైతం వెలువరించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో సుప్రీంకోర్టు అమీకస్క్యూరీగా నియమించబడిన మణిందర్ సింగ్, బీసీసీఐ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు బోర్డు రాజ్యాంగ సవరణకు అనుకూలంగా వాదనలు వినిపించటం గమనార్హం.
ఆ నిబంధన తొలగించవచ్చు : అమీకస్క్యూరీ
బీసీసీఐ కేసులో కొత్తగా నియమించబడిన అమీకస్క్యూరీ (కోర్టు సహాయకారి) మణిందర్ సింగ్. మూడేండ్ల విరామ సమయాన్ని ఎత్తివేయవచ్చని మణిందర్ సింగ్ సుప్రీంకోర్టుకు సూచించారు. విరామ సమయంతో సంబంధం లేకుండా బీసీసీఐలో వరుసగా రెండు పర్యాయాలు పదవిలో కొనసాగేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. రాష్ట్ర క్రికెట్ సంఘంలో మూడేండ్లు, బీసీసీఐలో మూడేండ్లు పదవిలో కొనసాగితే విరామ సమయం వర్తించకూడదు. ఇటు రాష్ట్ర క్రికెట్ సంఘంలోనైనా, అటు బీసీసీఐలోనైనా వరుసగా రెండు పర్యాయాలు (ఆరేండ్లు) పదవిలో ఉన్నప్పుడు మాత్రమే విరామ సమయం వర్తింపచేయాలి. బీసీసీఐ ఆఫీస్ బేరర్‌గా పోటీచేసేందుకు కచ్చితంగా రాష్ట్ర క్రికెట్ సంఘంలో ఆఫీస్ బేరర్‌గా పని చేస్తూ ఉండాలి. దీంతో బీసీసీఐ ఆఫీస్ బేరర్‌గా పోటీచేసే సమయంలో ప్రతిసారీ విరామ సమయం నిబంధన ఇబ్బందులు సృష్టింస్తోందని మణిందర్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీసీసీఐ, రాష్ట్రం వేర్వేరు : సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తరఫున సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా హాజరయ్యారు. రాష్ట్ర క్రికెట్ సంఘంలో పని చేసిన పదవీ కాలాన్ని.. బీసీసీఐలో పని చేసిన పదవీ కాలంతో కలిపి చూడకూడదని అన్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘంలో పదవీ చేపటినప్పుడు మాత్రమే అక్కడ వరుసగా ఆరేండ్ల అనంతరం మూడేండ్లు విరామం తీసుకోవాలి. బీసీసీఐలోనూ వరుసగా ఆరేండ్లు పదవీలో కొనసాగితేనే మూడేండ్లు పదవికి దూరంగా ఉండాలి. రాష్ట్ర క్రికెట్ సంఘం, బీసీసీఐ నిబంధనలు పూర్తిగా భిన్నం. అయినా, బీసీసీఐ స్థాయిలో నాయకత్వ ప్రతిభను చూపించేందుకు మూడేండ్ల సమయం చాలా తక్కువ. బీసీసీఐ స్థాయిలోనే వరుసగా ఆరేండ్లు పదవిలో కొనసాగేందుకు అనుమతి ఇవ్వటం ద్వారా.. రాష్ట్ర క్రికెట్ సంఘంలో గడించిన అనుభవాన్ని బోర్డు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఏ వ్యక్తి శాశ్వతంగా బోర్డు పదవిలో ఉండకుండా చూడగలదు.
తుషార్ మెహతా మరో రెండు కీలక నిబంధనలను సైతం తొలగించేందుకు వాదనలు వినిపించారు. ప్రస్తుతం మంత్రులు (కేంద్ర, రాష్ట్ర), ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రాతినిథ్య పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు బీసీసీఐ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. రాజకీయ నాయకులకు ఎన్నికలకు ఆసక్తి లేకపోయినా, మాజీ క్రికెటర్లు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి వారు, బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. వారి సేవలు సైతం వినియోగించుకోవాలి. అందుకోసం, ఈ నిబంధన ఎత్తివేయాలి. ఇక ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధి వయో పరిమితి ఎత్తివేయాలి. 70 ఏండ్ల లోపు వారినే పంపించాలనే నిబంధన బోర్డుకు నష్టం చేకూర్చుతుంది. ఐసీసీలో అన్ని తెలిసిన, వ్యవహారాలు చక్కబెట్టగలిగిన నేర్పు ఉన్న వ్యక్తులు అవసరం. ఇక ఏదేని ఇతర క్రీడా సంఘం పదవిలో కొనసాగుతుంటే, బీసీసీఐ ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉంది. ఈ నిబంధన సైతం తొలగించాలి. బీసీసీఐ స్వతంత్య్ర సంస్థ. బోర్డు రాజ్యాంగ సవరణకు ప్రతిసారి సుప్రీంకోర్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ రూల్‌ను తీసివేయాలి. సుప్రీంకోర్టు రాజ్యాంగం వార్షిక సర్వ సభ్య సమావేశం తీర్మానంతోనే సవరణలు, ఆమోదం పొందేలా రూల్ మార్పు చేయాలని తుషార్ మెహతా వాదించారు.
మార్పు అవసరం లేదు : బిహార్ క్రికెట్ సంఘం
సొలిసిటర్ జనరల్ కోరినట్టు బీసీసీఐ నిబంధనలు మార్పు చేయటం, రాజ్యాంగ సవరణ అధికారం తిరిగి బోర్డుకు కట్టబెట్టడంతో.. బీసీసీఐ ప్రక్షాళన ప్రక్రియ అర్థం లేనిదిగా మారుతుంది. 70 ఏండ్ల గరిష్ట వయో పరిమితి ఎత్తివేయకూడదు. జాతీయ క్రీడా విధానం సైతం యువతకు పెద్ద పీట వేస్తోంది. రాష్ట్ర స్థాయి, బీసీసీఐలో వరుసగా ఆరేండ్లు పదవిలో కొనసాగితే మూడేండ్ల విరామ సమయం తీసుకోవాలి. రాష్ట్ర స్థాయి, బీసీసీఐ పదవీ కాలాన్ని వేర్వేరుగా చూడాలని కోరటం సమంజసం కాదు. రాష్ట్ర స్థాయిలో ఆరేండ్ల పదవీ పూర్తి చేసుకుంటే కచ్చితంగా మూడేండ్లు విరామం తీసుకోవాలి. అప్పుడే తిరిగి బీసీసీఐ ఆఫీస్ బేరర్‌గా ఎన్నికల్లో పోటీ చేయాలని బిహార్ క్రికెట్ సంఘం తరఫున హాజరైన కౌన్సిల్ వాదించారు.